అద్భుత ఆలయం.. మడికొండ మెట్టుగుట్ట!


Mon,March 4, 2019 01:47 AM

చుట్టూ ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఆహ్లాదకరమైన వాతావరణం. కనుచూపునకు అందేంత ఎత్తైన పర్వత శిఖరం, సుమారు 55 ఎకరాల్లో విస్తరించిన విశాలమైన గుట్ట పైభాగం. అక్కడే కొలువై ఉంది శివకేశవు లొక్కటేనని చాటే అద్వైత్వ మతానికి ప్రత్యక్ష నిలయమైన మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం. వరంగల్, హైదరాబాద్ రహదారిపై వరంగల్ జిల్లా మడికొండలోని మెట్టుగుట్టపై ఉందీ ఆలయం. కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయ గుట్టను పూర్వం మణిగిరిగా పిలిచేవారు. క్రమంగా మెట్టుగుట్టగా ప్రసిద్ధినొందింది. శివకేశవులతో పాటు వీరభద్రస్వామి, గణపతి, ఆంజనేయస్వామి, సంతాన వేణుగోపాల స్వామి, అన్నపూర్ణ ఆలయాలతో కూడుకుని దక్షిణకాశీగా విలాసిల్లుతున్నది. శివరాత్రి పర్వదినం సందర్భంగా మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ విశిష్టతలపై ప్రత్యేక కథనం.
madigottu
పూర్వం మునులు, సిద్ధులు,సాధువులు, కైలాసంలో కొలువుదీరివున్న శివుడిని దర్శించుకుని ప్రసన్నం చేసుకున్నారు. కరువు కాటకాలతో, వ్యాధుల బారిన పడిన ప్రజలను కాపాడి, ఆధ్యాత్మిక, అధిభౌతికాది బాధలను తొలగించడానికి భూలోకంలో అవతరించమని శివున్ని ప్రార్థించారు. దీంతో ఆ పరమశివుడు అభయమిస్తూ వారందరినీ ఇక్కడికి సమీప ప్రాంతంలో నివసించడానికి అనుమతి ఇచ్చి అక్కడే స్వయంభూలింగంగా వెలిశాడు. తర్వాత కొంతకాలానికి మాండవయ్య, శాండిల్యాది తొమ్మిదిమంది సిద్ధులు శివుడి గురించి తపస్సు చేయగా పరమశివుడు అన్నపూర్ణగా వెలిశాడు. శ్రీరాముడు వనవాసం చేస్తూ మెట్టుగుట్ట వద్ద శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇది శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవాలయంగా పిలువబడుతున్నది. కొన్నేళ్ల తర్వాత ఆకలిబాధలు పెరిగాయి. ఒకనాడు ఒక శివభక్తుడికి తెల్లవారుజామున రామలింగేశ్వరుడు కలలో కనిపించి మెట్టుగుట్టపై అభిషేకం జరపాలని ఆజ్ఞాపించాడు. నిద్రనుంచి మేల్కొన్న భక్తుడు గుట్టపై స్వయంభూ లింగం కనుగొని, భక్తి శ్రద్ధలతో అభిషేకాలు జరిపాడు. వెంటనే చిరుజల్లు కురిసి, అనతికాలంలోనే వర్షాలు పడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని చరిత్ర చెబుతున్నది. అప్పటి నుంచి ఈ భక్తుడు శివార్చన చేస్తూ చివరకు ముక్తిని పొందాడంటారు. ఆ భక్తుడికి ముక్తినిచ్చినందువల్ల ముత్తిలింగంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. 1925లో అభినవ పోతన వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వర మంత్రోపాసన చేయగా సరస్వతీదేవి ప్రత్యక్షమైందని, అప్పుడు భక్తులు సరస్వతి దేవి ఆలయం నిర్మించాలని నిర్ణయించినట్లు చెబుతారు.


చారిత్రక ప్రాధాన్యం

క్రీస్తుశకం 950లో మణిగిరి(మడికొండ) గ్రామాన్ని ఒకనాడు వేంగీదేశ చాళుక్యరాజు పెద్దకొడుకు సుకుమాయుదు నాదుడు పరిపాలించినట్లు కొరివి శాసనాల ద్వారా తెలుస్తున్నది. చాళుక్య రాజుల అనంతరం మణిగిరి ప్రాంతం కాకతీయ రాజుల వశమైంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఆనాడు ఓరుగల్లును పరిపాలిస్తున్న కాకతీయ ప్రభువులలో నాల్గవ వాడైన రెండవ ప్రోలరాజు సహకారంతో క్రీస్తుశకం 1000, 1158మధ్యకాలంలో రామాలయాన్ని నిర్మించినట్లు లభించిన ఆధారాల వల్ల తెలుస్తున్నది. క్రీస్తుశకం 1198నుంచి 1261మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన గణపతి దేవ చక్రవర్తి ఈ కొండపై ఉన్న రామాలయంలో విగ్రహాలు నెలకొల్పి, రామాలయం ముందే శివాలయం నిర్మించాడు. శివాలయం గర్భగుడిలోని శివలింగం కాశీలోని స్వయంభూ లింగాన్ని పోలి ఉండి, భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ద్వారపాలకుల విగ్రహాలూ చూపరులను ఆకట్టుకుంటాయి. గోల్కొండ నవాబు కాలంలో సుబేదారుగా ఉన్న సితాబుఖాన్ శివాలయానికి నాలుగు ఎకరాలు, రామాలయానికి 36ఎకరాలు తరి, 412ఎకరాల ఖుష్కి(ఇనాము) ప్రకటించినట్లు 1192ఫసలీ నాటిరాజ శాసనం ద్వారా తెలుస్తున్నది.
madigottu4

ఆకట్టుకునే దొంతులమ్మ గుండ్లు

మెట్టుగుట్టపై 165 అడుగుల ఎత్తులో రెండు జంట శిఖరాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక శిఖరంలో ఐదు, మరొక శిఖరంలో నాలుగు చొప్పున పెద్దపెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉండి, నగరం నలుదిక్కుల కనబడుతాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకొని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఇట్టి ప్రాశస్త్యం కలిగిన మెట్టుగుట్టపై కార్తీకమాసంలో వరలక్ష్మి పూజలు, దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజున శివకల్యాణం, శ్రీరామ నవమి రోజున శ్రీసీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక బమ్మెర పోతనకు భిక్షుడి వేషంలో వచ్చి శ్రీరాముడే భాగవత రచనకు ఘంటం ఇచ్చాడని ప్రసిద్ధి. ఈ విధంగా ఆ పుణ్యక్షేత్రం సకల పుణ్యతీర్థాలకు ఆలవాలమై, శైవవైష్ణవ సంప్రదాయ సమన్వయ రూపమై, భక్తుల కొంగుబంగారమై, లోకకల్యాణ హేతువై సందర్శకులను, యాత్రికులను, భక్తులను తరింపచేస్తున్నది.


రూ.18కోట్లు కేటాయించిన ప్రభుత్వం

మెట్టుగుట్టపై కొలువై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 54ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2015 మార్చి 31న రూ.18కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. ఈ నిధులను మడికొండ ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేశారు. అయితే ప్రస్తుతం వడ్డీతో రూ.20కోట్లు ఆదాయం ఉంది. శివాలయం, రామాలయం దేవాలయాలు ఎండోమెంట్‌లో వేర్వేరుగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల శివాలయాన్ని రామాలయంలో విలీనం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది ముగిసాక ఇప్పుడున్న 6బి(2) గ్రేడ్ దేవాలయం ఆర్జేసీ, కమిషనర్ గ్రేడ్‌గా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
madigottu3

కొనసాగుతున్న అభివృద్ధి పనులు

మెట్టుగుట్టపై పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దాత పెద్ది ప్రభాకర్ సహకారంతో శ్రీగోకుళం నిర్మాణం చేపడుతున్నారు. అలాగే భక్తుల విరాళాలతో శారదాంబ (సరస్వతీదేవి) ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా నిత్యాన్నదాన సత్రం, అద్దాల మండపం, వీరభద్రస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరుగాల్సి ఉంది. మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మార్చి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


మెట్టుగుట్టపై నవగుండాలు

మెట్టుగుట్టపై తొమ్మిది గుండాలు ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ నవగుండాల్లో పాలగుండం, జీడిగుండం, బ్రహ్మగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం ప్రసిద్ధమైనవి. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపనాశనిగా భక్తులు భావిస్తారు. దీనిలో పాతాళ ఊట కలదని అంటారు. జీడిగుండంలో సంతానం కోరే స్త్రీలు సిద్ధి పొందుతారు. గిన్నె గుండం నుంచి కాశీ వరకు అనుసంధానం ఉందని పెద్దలు అంటారు. జీడిగుండం పక్కనే భీముని పాదముద్రలు కూడా ఉంటాయి.
madigottu2

పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతా

మెట్టుగుట్టను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి అన్ని వనరులు ఉన్నాయి. నగరానికి సమీపంలో ఉన్న మెట్టుగుట్ట పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తాను. 55 ఎకరాల సువిశాలమైన గుట్టపై గ్రీనరీతో పాటు ఆధ్మాత్మిక గ్రంథాలయం, కాటేజీల నిర్మాణం చేపడుతాం. యువత కోసం ట్రెక్కింగ్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తా. ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం తదితర అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులను తీసుకొస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నది. నియోజకవర్గంలోని ఐనవోలు దేవస్థానం తరహాలో ఇక్కడ అభివృద్ధి పనులను చేపడుతాం.
-అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే

-చిలువేరు సంతోష్ మడికొండ


madigottu1

1225
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles