అత్రంగి.. హస్తకళల వేదిక


Mon,October 23, 2017 11:34 PM

కొన్నిసార్లు గంటలకు గంటలు కూర్చొని ఆలోచించినా ఏ ఆలోచనా పుట్టదు. రోజులు, నెలల తరబడి థింక్ చేసినా ఎలాంటి ఐడియా రాదు. కానీ చాలా ఐడియాలు, ఆలోచనలు ప్రయాణంలో పుడుతాయి. అలా పుట్టిందే అత్రంగి. పేరులోనే కాదు.. ఆలోచనలో కూడా అత్రంగి విభిన్నమే. కొత్తగా ఆలోచిస్తూ విభిన్నంగా జీవించే జంట మానస పుత్రికే ఈ అత్రంగి. ఆ జంటే పరిణిత శర్మ, గౌతమ్. ఈ అత్రంగి ఏమిటో.. దాని ఏర్పాటు వెనుక అంతరార్థం ఏమిటో పరిణిత గౌతమ్ ఇలా చెప్పారు.
bhomma
కొందరికి అల్టిమేట్ టాలెంట్ ఉంటుంది. కానీ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొందరికి అవకాశాలివ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ వారికి ఆలోచన తట్టదు. కొందరికి సరైన ప్లాట్‌ఫామ్ ఉండదు. ఇంకొందరు అవలీలగా ఎదిగేద్దామని ఆత్రపడిపోతుంటారు. ఇలాంటి వారికి అవకాశాలు రావడం అరుదే. వచ్చినా ఎదగడం కష్టం. కానీ ఎంతో టాలెంట్ ఉండి సరైన వేదిక దొరుకని వారు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారికోసం పుట్టుకొచ్చిందే అత్రంగి. పరిణితి, గౌతమ్ ఇద్దరూ ఓ ఫంక్షన్‌లో కలిశారు. తొలిపరిచయమే ప్రేమగా మారింది. ఆలస్యం చేయకుండా పెండ్లి చేసుకున్నారు. గౌతమ్‌కి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం. పరిణిత ఎమిరైట్స్‌లో ఎయిర్ హోస్టెస్. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది. ఇద్దరికీ తాము చేస్తున్న పని నచ్చలేదు. ఇంకేం ఆలోచించలేదు. వెంటనే ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. ఉన్నపళంగా నేపాల్‌కి ట్రిప్పేశారు. ఆ ప్రయాణం ఎన్నో మార్పులకు, ఆలోచనలకు జీవం పోసింది. అక్కడే అసలు కథ మొదలైంది.

అత్రంగి ఆరంభం..


నేపాల్ ప్రయాణంలో వారికి కనిపించిన విభిన్న హస్తకళలన్నింటినీ సేకరించారు. ఓసారి వాటిని పరికించి చూశారు. చాలా వైవిధ్యంగా కనిపించాయి అవి. ఏదో తెలియని కొత్తదనం వారి మనసును కదిలించింది. ఆదాయం రాకపోయినా అదే పని మీద ఆధార పడుతూ అందమైన వస్తువులను సృష్టిస్తున్న చేతివృత్తి కళాకారుల జీవితాలనూ పరిశీలించారు. వారికి అంతోఇంతో అండగా నిలువాలన్న ఆలోచనతో 2015లో అత్రంగిని స్థాపించారు. వాడిపడేసిన సేకరించి రీసైక్లింగ్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా స్పార్క్‌ప్లగ్స్, నట్‌బోల్ట్స్, క్లచ్‌కిట్స్, వాచర్స్, బైక్ చైన్, బేరింగ్స్.. ఇలాంటి ఆటోమొబైల్ పార్టులతో వెరైటీ బొమ్మలు తయారు చేయించాలనుకున్నారు. తైవాన్‌లో కలిసిన కళాకారులతో తమ ఆలోచన పంచుకున్నారు. కొన్నిబొమ్మలకు ఆర్డర్ ఇచ్చారు. గౌతమ్ ఊహాచిత్రాలకు అక్కడి కళాకారులు ప్రాణం పోశారు. అద్భుతమైన ఫినిషింగ్‌తో మెటల్ విగ్రహాలు తయారు చేసిచ్చారు. వాటిని మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. కొత్తదనం, వైవిధ్యం చూసేవారి మనసును దోచుకున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకున్నారు. మెల్లమెల్లగా ఆర్డర్లు పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఆత్రంగా అక్కడి హస్తకళల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు పరిణితి, గౌతమ్. కొన్ని షాంపిల్స్ తీసుకొచ్చి అత్రంగి ద్వారా అమ్ముతున్నారు. వాటికి డిమాండ్ పెరిగితే ఆర్డరిచ్చి ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నారు.
optimus-prime

ఇదే ప్రపంచంగా..


ఇండియన్ ఆర్ట్‌కు ఓ నేపథ్యం ఉంది. ఎంతో చరిత్ర ఉంది. ప్రపంచంలో మనకు తెలియని, మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఆర్ట్‌లున్నాయి. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే వీళ్ల ముఖ్యఉద్దేశం. ఈ ప్లాట్‌ఫ్లామ్ ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈకామర్స్ వెబ్‌సైట్స్‌కి పోటీకాదు.. వీళ్లది వేరే ప్రపంచం. ఐడియా నచ్చడంతో కస్టమర్ల నుంచి స్పందన పెరుగడంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్ వర్క్ చేస్తున్నారు. వీళ్లు సేకరిస్తున్న ఇక్కడి వస్తువులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. పరిణిత శర్మ యోగాలో కూడా ఎక్స్‌పర్ట్. నగరంలో యోగా స్టూడియో స్థాపించాలనుకుంటున్నది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల అరుదైన కళారూపాలను, వృత్తులను సందర్శించి వాటిని ఈ వేదికలో భాగం చేయాలనుకుంటున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో సాధారణ వ్యక్తులు, సామాన్యులు చేసిన వస్తువులు అమ్మకానికి పెట్టాలంటే కుదరదు. పైగా ఆ వెబ్‌సైట్లను కాంటాక్ట్ చేయడం చాలామందికి తెలియదు కూడా. ఇలాంటి వారికి అత్రంగి అండగా ఉంటుంది.
captian-america

అర్థమేంటి? ఆశయమేంటి?


అత్రంగి అంటే అత్యద్భుమైనది అని అర్థం. ఆదరణకు నోచుకోని కళాకారులకు, వారి కళారూపాలకు వేదిక కల్పించడం దీని ఆశయం. జనపనార, కొబ్బరి చిప్పలు, వైర్లతో తయారుచేసిన హ్యాండ్‌బ్యాగ్స్, పెంపుడు జంతువులను కట్టేసే తాళ్లు, వైర్లతో అల్లిన చిన్న చిన్న బొమ్మలు, లోహాలతో చేసిన బొమ్మలను అత్రంగి వేదిక ద్వారా అమ్మకానికి ఉంచారు. ఇప్పటి వరకు నేపాల్, థాయ్‌లాండ్, బాలీ, మొరాకో, అర్జెంటీనా, జపాన్, టర్కీ ప్రాంతాల్లో తిరిగి వివిధ రకాలైన కళారూపాలను సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హస్తకళారూపాలను సేకరిస్తూనే ఉంటాం. దీన్ని వ్యాపారంగా కాకుండా కళాకారులను కాపాడేందుకు చేస్తున్నాం. అరుదైన వస్తువులన్నింటి కలిపి భవిష్యత్తులో మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అంటున్నారు గౌతమ్, పరిణితి.

820
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles