అత్యంత వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు


Mon,December 24, 2018 01:24 AM

ధనుర్మాసమహోత్సవాలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నందగిరిహిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో గత ఏడురోజుల నుంచి జరగుతున్న ఈ ఉత్సవాలు ఆదివారంతో ఏనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీత్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి భక్తులకు ధనుర్మాస వైశిష్యాన్ని తెలియజేసే ముఖ్య ఘట్టాలను వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సతీసమేతంగా హాజరయ్యారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఆయన సతీమణి శ్రీకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సెలవుదినం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి భక్తులకు తన ప్రవచనాల ద్వారా జీవిత సత్యాలను,జీవిత పరమార్థాన్ని వివరించారు.
SWAMY

నడిపించేది భగవంతుని శక్తే

గోదాదేవి ధనుర్మాసం వ్రతంలో పదిమంది గోపికలను చేర్చేందుకు శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగానే రోజుకు ఒకరిని ఈ వ్రతంలో భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు మూడో గోప బాలికనుమేలుకొల్పేందుకు గోదాదేవి సిద్ధమైందని, సమాజంలో అందరినీ కలుపుకుపోయోటప్పుడు అవసరమైతే అనునయించాలి, అదమాయించాల్సి ఉంటుందని చిన జీయర్ స్వామి తెలిపారు. అందరూ కలిసి సాగినప్పుడే మంచి ఫలితాలుంటాయని ఆయన వివరించారు. లోక కల్యాణం కోసం చేసే ప్రతి పనికీ భగవంతుని సహకారంతోపాటు లోకమంతా అనుకూలిస్తుందని, చేసే పని మంచిదైనప్పుడు అన్నీ సమకూరుతాయని స్వామి వారు పేర్కొన్నారు. వ్రతానికి కావల్సిన పరికరాలన్నీ భగవంతుని అనుగ్రహం వల్ల విజయవంతమవుతాయనడానికి గోదాదేవి చేసిన వ్రతమే ఉదాహరణగా చెప్పవచ్చని చిన జీయర్ స్వామి తెలిపారు. భయం రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి ప్రేమతో కూడిన భయం ఇది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకుల్ని చేసే ప్రక్రియలో ప్రేమతో కూడిన భయం ఉంటుందని అన్నారు. మరొక భయం తన పదవిని రక్షించుకునేందుకు యజమాని దగ్గర ఓ ఉద్యోగి భయంతోనే పని చేస్తాడని ఆయన వివరించారు. తైతరీయం అనే వేద శాఖలో దైవత్వాన్ని గురించి వివరంగా ఉందన్నారు. భగవంతుడి మీద ఉండే ప్రేమ అనేది ప్రకృతిని నడిపిస్తుందని గాలి వీయకపోతే భగవంతుడు ఎక్కడ నొచ్చుకుంటాడోనని గాలి తన విధిని నిర్వహిస్తుందని, అదేవిధంగా లోకంలో ప్రతి క్రియ కూడా అదే భయంతోనే జరుగుతుందని చిన జీయర్ స్వామి తెలిపారు. లోకంలో జరిగే పనులన్నీ భగవంతునిపై ఆధారపడే జరుగుతాయని చెప్పారు. భగవంతుడు అంటే అద్భుతమైన తేజస్సు అది ప్రకృతిలో జరిగే ప్రతి కార్యంలోనూ ఉంటుందని, అలా ఉన్న అదృశ్య శక్తే పనులన్నీ జరిగేలా చూస్తుందని స్వామి వారు పేర్కొన్నారు.
Harish
ఆకాశంలో ఎగిరే పక్షిలోనూ, వర్షించే మేఘంలోనూ ఉండే అద్భుతమైన శక్తి వాటిని నడిపిస్తుంటుంది. మేఘానికి ఎటువంటి పక్షపాతం ఉండదు. భగవంతుని వృష్టిని వర్షించేలా చేస్తుందని ఆయన వివరించారు. మేఘం ద్వారా వర్షించిన నీరే స్వచ్ఛమైనది అలా కాకుండా సముద్రంలో లభించే నీటిని ఉపయోగించుకోవడానికి పనికిరావని, మేఘాల్లో శక్తి ఉండడం వల్లనే ఉప్పదనం లేకుండా తియ్యని నీటిని అందించగలుగుతుంది. అదేవిధంగా ఆచార్య కూడా జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియలో భాగంగా ఎంతో శ్రమకోర్చి మంచి సారాన్ని ఆకళింపు చేసుకుని మంచి జ్ఞానాన్ని భక్తులకు అందిస్తాడని చిన జీయర్ స్వామి తెలిపారు. మేఘం వర్షించే సమయంలో ఎటువంటి పక్షపాతంలేకుండా వ్యవహరిస్తుందో అలాగే ఆచార్యుడు కూడా అందరికీ సమానంగా జ్ఞానాన్ని పంచుతాడని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం మనం చేసిన పనులకు సంబంధించిన ఫలితాలే భవిష్యత్‌లో మంచిగా బతకడానికి తోడ్పడుతాయని చిన జీయర్ స్వామి అన్నారు. భగవంతునికి మంచి మనస్సుతో పూజలు చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. మనసులో సంకల్పించిన మాటలే నోటి ద్వారా బయటికి రావాలి. బయటకు ఒకలా, లోపల మరొక లా ఉండడం వల్ల అనర్థాలే వస్తాయి. కాబట్టి ఏ పని చేసినా మనసుతో చేయడం మంచిదని స్వామి వారు వివరించారు. జీడి పండు అన్ని పండ్లలా కాకుండా ముందు గింజలు కాసి, ఆతర్వాత పువ్వులు పుట్టుకువచ్చినట్లుగానే మనం కూడా మనస్సులోనే ముందుగా అనుకుని ఆతర్వాత పనిని మొదలు పెట్టాలి అలా చేసిన పనులన్నీ విజయం సాధిస్తాయి.

మనసులో మాల ఇంద్రియానికి తగిలి ఆతర్వాతనే మాట రావాలని స్వామివారు సూచించారు. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్దములు అనేవాటి వల్లనే అసలు సమ్యలు ఉత్పన్నమవుతున్నాయని, అవి భగవంతుని సేవించడం ద్వారానే దూరమవుతాయమని తెలిపారు. సంచిత కర్మలు గతంలో చేసిన ఫలితాలు, ఆగామి కర్మలు భవిష్యత్‌లో వచ్చే ఫలితాలు, ప్రారబ్దములు అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కర్మల ఫలితాలు అని చిన జీయర్ స్వామి వివరించారు.

1057
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles