అతి వినియోగం అనర్థం


Sat,December 29, 2018 12:29 AM

debit-card-charges
వినియోగదారులు అదుపులేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. అందు కు వారు క్రెడిట్ కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డు రుణాలు తలకు మించిన భారంగా చాలామందికి మారుతున్నాయని ట్రాన్స్‌యూనియన్ అధ్యయనంలో తేలింది. ప్రతి చిన్న కొనుగోలుకూ క్రెడిట్ కార్డును ఉపయోగించడం, కనీస మొత్తాన్ని చెల్లించి ఆతర్వాత బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నవారి సంఖ్యే దేశంలో అధికంగా ఉంటున్నదట. దీంతో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా క్రెడిట్ కార్డు వినియోగం పెరిగిపోయింది. హోటల్స్‌లో భోజనాల దగ్గర నుంచి హాలిడే విహార యాత్రల బుకింగ్ వరకూ క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 3.69 లక్షల మంది క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు. సగటున ప్రతి క్రెడిట్ కార్డు మీద చెల్లించాల్సిన మొత్తం బ్యాలన్స్‌రూ. 84,400 రూపాయలు ఉంది. అలాగే ప్రతి క్రెడిట్ కార్డు సగటు బ్యాలన్స్ రూ. 46,000గా ఉంది. అంటే సగటున 35 శాతం పైగా క్రెడిట్ కార్డు వినియోగదారులు కనీస చెల్లింపులను చేసి బ్యాలన్స్ మొత్తాలను వచ్చే నెలకు కొనసాగిస్తున్నారు.

ఇలా క్రెడిట్ కార్డును అత్యధికంగా ఉపయోగిస్తున్న వారిలో అత్యధికులు 40 ఏండ్లలోపు వారే కావడం విశేషం. మొత్తం క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో వీరి సంఖ్య సగానికి పైగా ఉంది. క్రెడిట్ కార్డుల సంఖ్య పెరగడమే కాదు, బ్యాలన్స్ మొత్తాలను వచ్చే నెలకు కొనసాగించ వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. సాధారణంగా క్రెడిట్ కార్డు కొనుగోళ్లకు 45 నుంచి 90 రోజుల వరకూ వడ్డీ విధించరు.

ఆ తర్వాత నుంచి మాత్రం వడ్డీ విధింపు భారీగానే ఉంటుంది. బ్యాలన్స్ మొత్తాలను కొనసాగించడంతో పాటు కొనుగోళ్లలో అదుపు లేకుండా పోవడం వల్ల క్రెడిట్ రుణాలు అదుపు తప్పి పోతున్నాయి. క్రెడిట్‌కార్డును అధికంగా వినియోగిస్తున్న యువతలో రుణాలను సరిగ్గా మేనేజ్ చేయగల అనుభవం లోపించడం వల్ల కూడా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పు కోసం మళ్లీ అప్పు చేయడం చక్రవడ్డీల విషవలయంలలో చిక్కుకోవడం జరుగుతున్నది.

క్రెడిట్ కార్డు రుణ భారం

క్రెడిట్‌కార్డు పొందితే చాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా అప్పు పొందే వీలుంటుంది. కానీ ఆ అప్పు అనేక అంక్షల మధ్య వస్తుందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. నిజానికి క్రెడిట్ కార్డు మీద వసూలు వడ్డీ అన్ని రుణాల కన్నా చాలా ఎక్కువ. సాధారణంగా 45 నుంచి 90 రోజుల గడువు తర్వాత 3 శాతం వడ్డీ విధిస్తారు. ఇది ప్రతినెలకు అన్న విషయాన్ని మరిచి పోతారు. అంటే నెలకు మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకుంటున్నట్టు లెక్క. దీంతో సంవత్సరానికి 36 శాతం వడ్డీ అనుకుంటారు. కానీ వాస్తవానికి బ్యాలన్స్ మొత్తాలను ట్రాన్స్ ఫర్ చేయడం బ్యాలన్స్ మొత్తంతో పాటు వడ్డీ వచ్చే నెలకు అసలు అయి కూర్చుంటుంది. దీంతో దాదాపు ఏడాదికి 45 నుంచి 50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అడక్కుండానే అప్పు పుట్టే సదుపాయం క్రెడిట్ కార్డు ద్వారా వస్తున్నా, దాని వల్ల అనేక రిస్క్‌లు ఉన్నాయన్న అంశాన్ని చాలా మంది వినియోగదారులు మరిచిపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే క్రెడిట్ కార్డు రుణాలు చాలా దారుణాలకు దారితీస్తాయి.

అధిక వ్యయం ముప్పు

డబ్బు ఖర్చు చేయడంలో అదుపు లేకపోతే క్రెడిట్‌కార్డు చాలా రిస్క్‌తో కూడిన సాధనం. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లతో చాలా సందర్బాలలో అవసరం లేకపోయినా సరే కొనుగోళ్లకు ఉపక్రమిస్తున్నారు. దీంతో మనం తిరిగి చెల్లించలేనంతగా కొనుగోళ్లకు దిగుతున్నారు. ఈ ధోరణి కారణంగా బ్యాలన్స్ మొత్తాన్ని వచ్చే నెలకు కొనసాగించడం జరుగుతున్నది. దీనికి ఒక్కటే పరిష్కారం నెలలో ఎంత చెల్లించగలమో అంత మొత్తానికే కొనుగోళ్లు జరపడం. అంటే బ్యాలన్స్‌ను కొనసాగించకుండా ఉండడం. అలాగే క్రెడిట్ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ వ్యయాలను తగ్గించడం, అన్‌బిల్డ్ బ్యాలన్స్‌ను సరి చూసుకోవడంతో పాటు గడువులోగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. క్రెడిట్ కార్డు బ్యాలన్స్‌లను రివాల్వింగ్ చేయకుండ ఉండగలిగినంత కాలం క్రెడిట్ కార్డు ఊబిలో ఇరుక్కోనట్టే.

క్రెడిట్ స్కోర్‌కూ కష్టమే

క్రెడిట్ కార్డు మీద ఔట్‌స్టాండింగ్ బ్యాలన్స్ పెరిగే కొద్దీ సిబిల్ ఇచ్చే క్రెడిట్ స్కోర్‌కూ గండిపడుతుంది. క్రెడిట్ కార్డుబ్యాలన్స్‌లను రుణ బకాయిలుగానే సిబిల్ పరిగణిస్తుంది. బిల్లు బకాయిలు, డిఫాల్ట్‌లు అన్నీ క్రెడిట్ స్కోర్‌ను దారుణంగా దెబ్బతీస్తాయి. గడువులోగా చెల్లించేందుకు బ్యాంకులకు ఆటో బిల్ పేమెంట్ పద్దతిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయండి. దాని వల్ల చెల్లించగలిగినా గడువు తేదీని మరచి పోవడం అంటూ ఉండదు. దీనికి మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డు మీద మీకున్న లిమిట్‌లో అత్యధిక భాగం వినియోగిస్తున్నా క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. 40 శాతం కన్నా ఎక్కువగా వినియోగిస్తే క్రెడిట్ బ్యూరో మిమ్ములన్ని రుణగ్రస్తులుగానే పరిగణిస్తాయి. ఇది మళ్లీ మీ క్రెడిట్ స్కోర్‌కు ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల వరకూ క్రెడిట్ లిమిట్ ఉందనుకుందాం. అందులో రూ. 40,000 ఖర్చు చేసినట్టయితే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకని ఆంత కన్నా తక్కువగా ఉపయోగించి చెల్లింపులు ఎప్పకప్పుడు చేయండి. మీరు క్రెడిట్ కార్డును రెగ్యులర్ ఉపయోగిస్తున్నట్టయితే క్రెడిట్ లిమిట్ పెంచమని కోరండి. ఆ తర్వాత మీ ఖర్చు పెరగకుండా చూసుకోండి. దీంతో మీరు ఖర్చు చేస్తున్న మొత్త 40 శాతం దిగువకు పడిపోతుంది.

చార్జీల మోత

క్రెడిట్ బిల్లులను చెల్లించకపోతే సాధారణంగా 45 నుంచి 90 రోజుల తర్వాత సంవత్సరానికి 36 నుంచి 50 శాతం వరకు వడ్డ పడుతుంది. అలాగే ఈ వడ్డీ మీద మళ్లీ పన్నులు, సెస్‌లు ఉంటాయి. మీరు కనీస మొత్తం 5 శాతం చొప్పున చెల్లించుకుంటే పోతుంటే మీ కార్డు బిల్లు తగ్గకపోగా ఈ వడ్డీలు. చార్జీల కారణంగా పెరిగిపోతుంటుంది. లేట్ పేమెంట్ జరిమానాలు కూడా ఒక్క సారి చెలించాల్సి ఉంటుంది. బ్యాలన్స్ ఎక్కువగా ఉంటే కొత్త కొనుగోళ్లపై ఇచ్చే వడ్డీలేని సమయం కూడా తీసేసి కొత్త కొనుగోళ్లపై కూడా వడ్డీని చార్జ్ చేస్తారు.

ఊబిలో నుంచి బయటపడాలంటే

సింపుల్.. ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉపయోగించకండి. ఉపయోగించినా ఏ నెలకానెల మొత్తం చెల్లించేయండి. బ్యాలన్స్ టాన్స్‌ఫర్ అంటే మీకు వడ్డీ పోటు గ్యారంటీ. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించకండి. చాలా బ్యాంకులు మొదట ఫ్రీ కార్డు అంటూ అంటగట్టే ప్రయత్నం చేస్తాయి. కోబ్రాండెడ్ కార్డులు, యాడ్ ఆన్ కార్డులంటూ చాలా రకాలు ఊబిలో దించడానికి క్రెడిట్ కార్డు బ్యాంకులు, కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. వాటి బారి నుంచి బయటపడండి. అంతే.. ఆర్థిక క్రమశిక్షణే మీకు శ్రీరామ రక్ష.....

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles