అతిత్వరలో.. ఆన్‌లైన్ ఫిర్యాదులు!


Sat,February 2, 2019 12:13 AM

- తెలంగాణ రెరా ఛైర్మన్ రాజేశ్వర్ తివారీ

GBR
తెలంగాణ రాష్ట్రంలో.. ప్రమోటర్లు నిర్ణీత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేయకున్నా.. చెప్పిన నాణ్యత ప్రకారం ఫ్లాటను నిర్మించకున్నా.. ఇండ్ల కొనుగోలుదారులు దిగులు చెందనక్కర్లేదు. అతిత్వరలో రెరా వెబ్‌సైటులోనే ఫిర్యాదులను నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం.. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య నెలకొనే సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలంగాణ రెరా అథారిటీ ఛైర్మన్ రాజేశ్వర్ తివారి తెలిపారు. ఇండ్ల కొనుగోలుదారుల సమస్యలను పరిష్కరించడం మీదే అధిక దృష్టి సారిస్తామని నమస్తే సంపదకు ప్రత్యేకంగా వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..


రెరా ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తుంది. 500 చదరపు మీటర్లు కంటే అధిక విస్తీర్ణం లేదా ఎనిమిది ఫ్లాట్లను మించి అభివృద్ధి చేసే ప్రతి ప్రాజెక్టు రెరా వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఆయా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే ఏజెంట్లు సైతం రెరా వద్ద నమోదు కావాల్సిందే. ప్రమోటర్లు, ఏజెంట్లతో ఎలాంటి సమస్యలొచ్చినా.. రెరా అథారిటీ వాటిని పరిష్కరిస్తుంది. మన రాష్ట్రంలో 2018 సెప్టెంబరు 1 నుంచి రెరా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఇక్కడి నిర్మాణ సంఘాల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ట్రెడా వంటి సంఘాలకు చెందిన డెవలపర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. కనీసం 5000 ప్రాజెక్టులు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం. ఇప్పటివరకూ పదిహేను వందల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెరాలో నమోదు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ప్రమోటర్లు ఎవరినీ కలవకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 1 నుంచి మొదటి మూడు నెలల దాకా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. డిసెంబరు 1 నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తున్నాం. ఈ నెల 15 వరకూ 2 లక్షల దాకా అపరాధ రుసుమ చెల్లించి రెరాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇంకా ఆలస్యం చేసే వారిపై తీసుకునే చర్యలపై తదుపరి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రెరాలో నమోదు కాకుండా ఏ ప్రమోటరూ తమ ప్రాజెక్టులను విక్రయించడానికి వీల్లేదని రెరా చట్టం చెబుతున్నది. కనీసం ప్రకటన కూడా చేయవద్దు. అలా చేస్తే వారి నుంచి జరిమానా వసూలు చేస్తాం.


రెరా అనుమతి ఉంటేనే ఓకే..


తమ ప్రాజెక్టుల గురించి ప్రాపర్టీ షోలలో ప్రదర్శనకు పెడతామని కొందరు మా వద్దకు వచ్చారు. రెరా అనుమతి లేకుండా, ఏ ఒక్కరూ అలా చేయడానికి వీల్లేదు. రెరా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకుండా ప్రాపర్టీ షోలలో వెంచర్లు, ప్రాజెక్టుల సమాచారాన్ని కొనుగోలుదారులకు ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకూడదు. రెరాలో అనుమతి లేకుండా పేపర్ ప్రకటనలు, బ్రోచర్లు ముద్రించినా, హోర్డింగులు పెట్టినా జరిమానా వసూలు చేస్తాం. ఇప్పటికే పద్నాలుగు మంది ప్రమోటర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేశాం. ఉత్తర భారతంలోని నొయిడా, గుర్గావ్‌లను చూస్తే బడా బిల్డర్లు సైతం ఊచలు లెక్కపెడుతున్నారు. అట్టి పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని కొనుగోలుదారులకు న్యాయం చేస్తోంది. అదృష్టవశాత్తు, మన వద్ద అలాంటి ప్రతికూల పరిస్థితుల్లేవు. కొన్ని నిర్మాణ సంస్థలు తప్పితే, ఇక్కడి సంస్థలు పారదర్శకంగా నిర్మాణాలు చేపడుతున్నాయి.


- తెలంగాణ రాష్ట్రంలో డెవలపర్లు పూర్తి స్థాయి పారదర్శకంగా వ్యవహరించాలి. రెరాలో నమోదు అయి న తర్వాత, ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతిని రెరా వెబ్‌సైటులో పొందుపర్చాలి. ఒకవేళ, ఎవరైనా ఇంటి కొనుగోలుదారులు నిర్మాణ పనుల్లో వేగం లేదని ఫిర్యాదు చేసినా, డెవలపర్‌ని పిలిచి ప్రశ్నిస్తాం. స్ట్రక్చర్‌లో ఐదేండ్ల పాటు ఎలాంటి లోపాలున్నా ప్రమోటర్లదే బాధ్యత. చిన్న చిన్న నిర్వహణ సమస్యలుంటే రెరా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ, నిర్మాణ నాణ్యతపై తప్పనిసరిగా దృష్టి సారిస్తాం.


ఫిర్యాదు వస్తే షోకాజ్ నోటీసు..

కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదు రాగానే.. ముందుగా డెవలపర్‌కు షోకాజ్ నోటీసును జారీ చేస్తాం. ఇద్దరినీ హియరింగ్‌కు పిలుస్తాం. బిల్డర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలా? లేక జరిమానా విధించాలా? అనే విషయాన్ని రెరా అథారిటీ నిర్ణయిస్తుంది. ఇండ్ల కొనుగోలుదారుల నుంచి బిల్డర్‌పై ఫిర్యాదులొస్తే చాలు.. తక్షణమే పరిష్కరిస్తాం. ఇప్పటివరకూ హైదరాబాద్ నిర్మాణ రంగంలో డెవలపర్ ఎవరో కొనుగోలుదారులకు తెలిసేది కాదు. కానీ, రెరా వచ్చాక డెవలపర్ ఎవరో ప్రతిఒక్క కొనుగోలుదారుడికి తెలిసిపోతుంది. రెరా అమల్లోకి వచ్చాక నిర్మాణ సంస్థల్లోనే కాదు.. ఇండ్ల కొనుగోలుదారుల్లోనూ అవగాహన తెస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ సమావేశాల్ని నిర్వహించాం.


రెరా ఉంటే సంతోషమే..

రియల్ ఎస్టేట్ పరిశ్రమ రెరా వచ్చినందుకు సంతోషించాలి. ఎందుకంటే, వారు రెరాలో కూడా భాగస్వామ్యులయ్యారు. అదే ఉత్తర భారతాన్ని తీసుకుంటే, అక్కడి పేరెన్నిక గల నిర్మాణ సంస్థలు పూర్తిగా నామరూపాల్లేకుండా పోయాయి. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితుల్లేవు. మహారాష్ట్రలో రెరా పూర్తిగా విజయవంతమైంది. అక్కడి డెవలపర్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రెరా అథారిటీ కంటే ముందు, అక్కడో కన్స్యూమర్ రెడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడే డెవలపర్ నుంచి ఒక ప్రతినిధి, కొనుగోలుదారుడి తరఫున ఒక ప్రతినిధి, రెరా మెంబర్ సెక్రెటరీ ఉంటారు. వీరే, రెరా అథారిటీ కంటే ముందే పలు కేసుల్ని పరిష్కరిస్తుంటారు. ఇలా, అక్కడి రెరా అథారిటీ ఐదు వేల కేసులను పరిష్కరించింది. మన తెలంగాణ రెరాలో కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంబిస్తాం. దీని వల్ల 70-80 శాతం కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయి.


- మన రాష్ట్రంలో రెరా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ ఉన్న వ్యాట్ ట్రిబ్యునల్ రెరాకూ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నది. కాకపోతే, రెరా కేసులింకా వారి దృష్టికి వెళ్లలేదు. రెరా అథారిటీలోనే ప్రత్యేకంగా రెండు కోర్టు రూములను ఏర్పాటు చేశాం. అతిత్వరలో రెరా వెబ్‌సైటులో ద్వారానే కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియనూ మొదలెడతాం. కాకపోతే, కేవలం తెలంగాణ రెరా వద్ద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తాం. వాటినే పరిష్కరించేందుకు తగిన చర్యల్ని తీసుకుంటాం.


తూర్పు, ఉత్తరం అభివృద్ధి చెందాలి..

వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే.. దక్షిణ హైదరా బాద్‌లో ఈమధ్య కొంత రియల్ కదలికలు మొదలయ్యాయి. పశ్చిమం అయితే ఊహించిన దానికంటే అధికంగా అభివృద్ధి చెందింది. ఇక తూర్పు, ఉత్తర హైదరాబాద్‌లు కొంత వెనకబడ్డాయి. అవి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు రాకతో.. నగరం నాలుగు వైపులా సమానమైన రీతిలో వృద్ధి చెందే అవకాశమున్నది.


- కింగ్ జాన్సన్ కొయ్యడ

338
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles