అచల మనసుతోనే ఆత్మానందం


Wed,December 26, 2018 11:10 PM

ఆండాళ్ అమ్మ గోప బాలికలను మేల్కొల్పే విధానం ద్వారా మానవజన్మ సార్థకతకు ఉపయోగపడే విశేషాలను తెలియజెప్పిందని చిన జీయర్ స్వామి అన్నారు. పక్షుల ధ్వని, హరినామ సంకీర్తనలు, ఇతర శబ్దాలను వినడం ద్వారా మేల్కొనడం అంటే ఎక్కువగా వినడం నేర్చుకోమని ఆమె చెప్పినట్టు భావించాలని వారు వివరించారు. వినడం ద్వారా ప్రతి మనిషీ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడని, తద్వారా ఉన్నత శిఖరాలను అందుకోగలడని చిన జీయర్ స్వామి వెల్లడించారు.
chinna-jeeyar-swamy
హైదరాబాద్, నందగిరి హిల్స్‌లోని మై హోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో డిసెంబర్ 18న ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారంతో వేడుకలు 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి భక్తులకు ధనుర్మాసం వ్రత మహత్తును వివరించారు. ఇందులో భాగంగానే బుధవారం 6వ గోప బాలికను మేల్కొల్పిందని చిన్న జీయర్ స్వామి తెలిపారు. గోదాదేవి తన పాశురాల ద్వారా చెప్పిన విశేషాలనే స్వామి వారు భక్తులకు వివరించారు. మానవ జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? తదితర విశేషాలను గోదాదేవి వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె చెప్పిన ఘట్టాల్లో మనం గ్రహించాల్సిన అంతరార్థమేమిటి? ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి అనేది కూడా ఆ తల్లి మన వివేచనకే వదిలేసిందని ఆయన చెప్పారు. గోదాదేవి గతంలో ఇద్దరు గోపికలను మేల్కోల్పే సమయంలో వారిద్దరినీ పక్షుల కిలకిల రాగాల ధ్వనులతోనే నిద్ర లేపిందని, మరొకరిని పక్షుల ప్రమేయం లేకుండా, పల్లె వాతావరణంలోని గోవుల అంబా రావాలు, ఇతర జంతువుల అలికిడితోనూ, హరినామ సంకీర్తనల ద్వారా మేల్కొల్పిందని వారు అన్నారు.


అలా ఆండాళ్ అమ్మ గోప బాలికలను మేల్కొల్పే విధానం ద్వారా మానవజన్మ సార్థకతకు ఉపయోగపడే విశేషాలను తెలియజెప్పిందని చిన జీయర్ స్వామి అన్నారు. పక్షుల ధ్వని, హరినామ సంకీర్తనలు, ఇతర శబ్దాలను వినడం ద్వారా మేల్కొనడం అంటే ఎక్కువగా వినడం నేర్చుకోమని ఆండాళ్ తల్లి చెప్పినట్టు మనం భావించాలని వారు వివరించారు. వినడం ద్వారా ప్రతి మనిషీ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడని, దాని ద్వారానే ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అవసరమైన వనరులను పొందుతాడని చిన జీయర్ స్వామి వెల్లడించారు. అనుభవజ్ఞలు తమ అనుభూతిని, వారు చేసిన ప్రయోగాలను గురించి చెప్పడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చని ఆయన అన్నారు.


అయితే, శ్రవణం ద్వారానే ఎక్కువ ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందని, విన్న వాటిని సరిగా అర్థం చేసుకుని తమ విధి నిర్వహణను జాగ్రత్తగా నిర్వర్తిస్తేనే మరిన్ని ఘన విజయాలను అందుకోవచ్చని, విష్ణుసహస్ర నామ పారాయణం ద్వారా కూడా పలు విశేషాలను తెలుసుకోవచ్చని స్వామి వారు చెప్పారు. విన్న తర్వాత దానిని అమలు చేయడానికి ప్రణాళిక చేసుకుని ఆ ప్రకారంగానే అమలు చేయాలని, అలా సులువుగా విజయాలను అందుకోవచ్చని, సమయం వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని అన్నారు.


మనస్సును అచల స్థితికి తీసుకురావడం ద్వారానే భగవంతుని సన్నిధికి చేరడానికి అవకాశం ఉంటుందన్నారు. మన ఇంద్రియాలను నియంత్రించుకున్నప్పుడే అచల స్థితిని పొందుతామని, ఆ స్థితి మనిషిని గొప్పవాడిని చేస్తుందని చిన జీయర్ స్వామి తెలిపారు. ఇంద్రియాలకు గొప్ప వస్తువుల్ని చూపిస్తే పలు దురలవాట్లను దూరం చేసుకుని అత్మానందాన్ని పొందవచ్చని, అదే విధంగా పాత అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లతో మనుగడ సాధించవచ్చని ఆయన చెప్పారు.
-పసుపులేటి వెంకటేశ్వరరావు


chinna-jeeyar-swamy2

ధనుర్మాస వ్రత విధానం

ధనుర్మాస వ్రతంలో భాగంగా మహిళలు పూలు పెట్టుకోకూడదు. ఈ వ్రతం జరిగే 30 దినాలు ప్రతి పువ్వూ ఆ కృష్ణ పరమాత్మకే చెందాలనే ఉద్దేశంతో పూలు ధరించరాదనే నియమావళిని విధించారు. ఈ వ్రతంలో ప్రధానంగా తెలిపిన నియమావళి ఇలా ఉన్నది. శుభ్రంగా తలంటు స్నానం చేసి, నూతన బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించి గోదాదేవికి, గోవిందుడికి పూజ చేయాలి. విష్ణు సహస్ర నామావళిని చదివిన అనంతరం హారతి ఇచ్చి, ఆ తర్వాత వారిరువురికీ నైవేధ్యం సమర్పించి తిరుప్పావై పాశురాలను చదువాల్సి ఉంటుంది. గోదాదేవి ధనుర్మాస వ్రత వివరాలను 30 పాశురాల్లో తెలిపింది. ఈ వ్రతం చేయడం వల్ల అంతా సుభిక్షంగా ఉండవచ్చన్నది అసలు సందేశం. పాశురాల ద్వారా గోదాదేవి దానినే చాటి చెప్పే ప్రయత్నం చేసింది. గోదాదేవి ఈ వ్రతం కోసం పదిమందిని మేల్కొల్పేందుకు సిద్ధమైన వైనం అత్యంత భక్తిప్రదం.

831
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles