అందుకే ఈ.. 24x7 లైవ్ క్రీడా చానెల్


Wed,April 24, 2019 12:14 AM

లండన్‌లో చదివింది. పొలిటికల్ జర్నలిజంలో అనుభవం సంపాదించింది. స్పోర్ట్స్ జర్నలిజంలోకి అనూహ్యంగా ప్రవేశించింది. ఆమెకు అప్పుడే కొన్ని విషయాలు అర్థమయ్యాయి. క్రీడారంగంలో లోపాలు, క్రీడాకారులకు ప్రోత్సాహం, మహిళలకు ప్రాధాన్యం.. వీటన్నిటినీ ప్రపంచం ముందు ఉంచడానికి నిరంతర సాధనాలు లేవనే భావన ఆమెను కలచి వేసింది. తానే ఓ స్పోర్ట్స్ వెబ్ చానెల్‌ను స్థాపించింది. రెండు నెలల్లో అనూహ్య స్పందన పొందగలిగారు. ఇలా మొదటిసారి 24 గంటల లైవ్ స్పోర్ట్స్ చానెల్‌ను స్థాపించిన మొదటి మహిళగా కాంతి డి. సురేశ్ క్రీడా ప్రపంచానికి చేరువయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆమె జిందగీతో మాట్లాడారు.
KVR
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో న్యూస్ చానెళ్లున్నాయి. కానీ వాటిలో ప్రత్యేకంగా క్రీడల కోసమే పని చేసే చానళ్లు తక్కువ. నిరంతరాయంగా క్రీడావార్తలను ప్రసారం చేసే సంస్థలూ లేవు. ఈ దేశ క్రీడాకారులకు దిశానిర్ధేశం చేసేందుకు పవర్ స్పోర్ట్స్ చానల్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు కాంతి సురేశ్. లండన్‌లో జర్నలిజం విద్యను అభ్యసించిన ఆమె పొలిటికల్ జర్నలిస్టుగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన సరైన కంటెంట్ లేదని గుర్తించారు. అలా 2018 మేలో లైవ్ స్పోర్ట్స్ వెబ్ చానల్‌ను స్థాపించారు. బలమైన కంటెంట్‌తో, విలువైన ఇంటర్వ్యూలతో చానల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో స్పోర్ట్స్ జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, అమేజాన్ ఫ్రైమ్, , యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చానల్‌ను విస్తృతం చేశారు. ఇలా 24 గంటల లైవ్ స్పోర్ట్స్ వెబ్ చానెల్ స్థాపించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

జర్నలిజంలోకి ఆమె..

కాంతి డి. సురేశ్‌ది తమిళనాడు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ చేశారు. దీంతోపాటు లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో విద్యను అభ్యసించారు. వివిధ ప్రాంతాల్లో పొలిటికల్ న్యూస్ హోస్ట్‌గా పని చేశారు. స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఆమె ప్రవేశం అనూహ్యంగా జరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్పోర్ట్స్ హోస్ట్ కోసం ప్రకటన చేశారు. దానికి దరఖాస్తు చేసింది. దానికి కాంతి సురేశ్ ఎంపికయ్యారు. అప్పటికే ఆమె పొలిౠకల్ జర్నలిజంలో ఉన్నారు. సవాలుతో కూడుకున్న బాధ్యతలవి. అనూహ్యంగా విభాగం మారడం, అదీ స్పోర్ట్స్ విభాగ జర్నలిజంలోకి ప్రవేశించడం ఆమెకు మరింత సవాలుగా మారింది. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న క్రీడా జర్నలిజంలో మహిళగా తను ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నది. పని భారం, వార్తాకథనాల సేకరణలో పురుషులతో పోటీ పడినప్పటికీ పురుషులకే ప్రాధాన్యం ఎక్కువగా ఉండేదనీ, వాటిని తట్టుకోగలిగినట్టు చెప్పింది.

పదేండ్ల తర్వాత..

సుదీర్ఘ అనుభవం తర్వాత, క్రీడారంగ విధానాలతో పాటు స్పోర్ట్స్ జర్నలిజంలో పట్టు సాధించారు. దాని ఆవశ్యకతను, లోపాలను, స్పోర్ట్స్ కంటెంట్‌ను విపులంగా బయటకు తీయాలనుకున్నారు. క్రీడా వార్తలకు, మహిళా క్రీడాకారులకు వార్తా చానళ్లు ఇచ్చే ప్రాధాన్యం ఆమెను ఆలోచనలో పడేసింది. అప్పుడే సొంతంగా చానల్ పెట్టి విస్తృతంగా క్రీడా సమాచారాన్ని చేరవేయాలని నిర్ణయించున్నారు. 2018 ఢిల్లీ నుంచి పవర్ స్పోర్ట్స్ డిజిటల్ చానెల్‌ను ప్రారంభించింది. 24 గంటలూ ప్రసారం అయ్యే తొలి స్పోర్ట్స్ చానెల్ ఇది. నెల రోజుల్లోపు దాదాపు మిలియన్ హిట్లను పొందగలిగింది. ఇప్పుడు రోజుకూ రెండు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయని చెప్పారు. క్రీడలను ఎక్కువ భాగం ఇండియాలో ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా చూస్తారనీ కానీ అది ఒక సబ్జెక్ట్ అని అంటారామె. దీన్ని ఆధారంగా చేసుకొనే చర్చలు జరుపుతున్నట్టు వివరించారు. క్రీడలు దేశాభివృద్ధిలో భాగమని అమెరికా నిర్ణయించినట్టు చెప్పారు. ఇలాంటి క్రీడా సమాచారాన్ని, చర్చలను సమగ్రంగా ప్రసారం చేసే చానెల్ కావడమే ఇలాంటి స్పందనకు కారణం అంటున్నారు. వారి అనాలటిక్స్ రిపోర్టు ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా వారి చానెల్‌ను 16 నుంచి 38 ఏండ్ల లోపు వారు చూస్తున్నట్టు చెప్పారు.
KVR1

సంస్కరణలు అవసరం

స్పోర్ట్స్ జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగిన కాంతి సురేశ్ ప్రపంచ వ్యాప్తంగా క్రీడా విధానాలను అధ్యయనం చేయగలిగారు. భారతదేశంలోని క్రీడారంగంలో సంస్కరణలు అవసరం అంటున్నారు. స్పోర్ట్స్ అథారిటీల, కార్పొరేట్ల తీరు మారాలని చెప్తున్నారు. ముఖ్యంగా క్రీడా రంగంలో మహిళలకు ప్రాధాన్యం లేదనీ, భారతదేశంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన చెందారు. క్రీడారంగంలో లింగ వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనీ, నిర్ణయాధికారాలు పురుషల చేతుల్లో ఉండడం మహిళలకు అవకాశాలు రాకపోవడానికి కారణమన్నారు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక వెనుకబడుతున్నారని చెప్పారు. స్పోర్ట్స్ ఫెడరేషన్లు, అసోసియేషన్లు కూడా మహిళా క్రీడాకారులంటే పట్టనట్టే ఉంటాయనీ, అవి ఎవరి కోసమో పని చేస్తాయని విమర్శించారు. ఓడిపోయిన క్రీడాకారుల గురించి ప్రపంచానికి తెలుస్తుంది కానీ ప్రతిభ ఉన్న క్రీడాకారిణుల గురించి ఎవరికీ తెలియడం లేదనీ వ్యాఖ్యానించారు. ఈ విధానంలో మార్పులు రావాలని కోరారు. ఈ రంగంలో మహిళల అవసరం ఉందనీ, వారికి ప్రాధాన్యం ఇవ్వడానికే ఈ చానల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీంతోపాటు మేనేజ్‌మెంట్ స్థాయిలో మహిళలు నేతృత్వం వహించే సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిపారు. దేశంలో స్పోర్ట్స్ చానెల్‌కు ఈ బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందనీ, మరింత సృజనాత్మకతతో, ధైర్యంతో ఈ చానెల్‌ను విస్తృతం చేస్తాననీ, క్రీడారంగంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె వివరించారు.

ఊహించని స్పందన..

ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగంలో జరుగుతున్న పరిణామాలు, తాజా పరిస్థితులు, శక్తిమంతమైన చర్చలతో చానల్‌ను నడుపుతున్నది. 24 గంటలూ ఆన్‌లైన్ వేదికల్లో అందుబాటులో ఉండడంతో ఊహించని స్పందన వచ్చింది. ప్రేక్షకుల తాకిడి ఊహించలేదనీ, మొదట సర్వర్ల సమస్య వచ్చేది. క్రీడారంగంలో చర్చలకు వేదికగా టాకింగ్ టర్కి విత్ కాంతి డిబేట్‌కు ప్రపంచ వ్యాప్తంగా స్పందన ఉంది. దానికి మూడు నెలల్లోపు 2 మిలియన్ వ్యూవర్‌షిప్ దాంటిందంటే నమ్మలేకపోతున్నా.
-వినోద్ మామిడాల కోనేటి వెంకట్

649
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles