అందాల చెరువుల కోసం అతడే ఒక సైన్యం!


Sun,April 14, 2019 01:08 AM

అదో అందమైన నగరం. మొత్తం 262 నీటి సరస్సులతో కళకళ లాడేది. పచ్చని పంటపొలాలతో భూమికి రంగు వేసినట్లు ఉండేది. దీంతో కబ్జాదారుల కళ్లు కుట్టాయి. ఆక్రమణలకు బరితెగించారు.. కనిపించిన ఖాళీ భూమిని కబ్జా చేశారు. ఇప్పుడా సుందర నగరంలో సరస్సుల సంఖ్య 81 చేరింది. వాటిల్లో 34 సరస్సులే నీటితో కళకళలాడుతున్నాయి. మిగిలిన వాటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో కళావిహీనంగా మారాయి. కబ్జాకోరల్లో చిక్కుకున్న ఆ సరస్సులకు ప్రాణం పోద్దామంటూ
ఇతగాడు ఒక్కడే ముందుకొచ్చాడు.

Save-Lake3
ఇతని పేరు ఆనంద్ మల్లిగవద్.
కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్ పట్టణంలో సన్‌సేరా ఫౌండేషన్‌లో మెకానికల్ ఇంజినీర్.
ఆ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగానికి అధిపతి. వేలల్లో జీతం.. సంతోషంగా సాగుతున్న జీవితం.. ఇవన్నీ వదులుకొని చెరువు, సరస్సుల సంరక్షణకు పూనుకున్నాడు ఆనంద్. 2025 కల్లా 45 సరస్సులను పూర్తిగా సంరక్షించాలని కలుషితం లేని నీటిని బెంగళూర్ సిటీకి అందించాలని కంకణం కట్టుకున్నాడు. అనుకోవడమే కాదు.. ప్రణాళికబద్ధంగా కార్యచరణ రూపొందించుకున్నాడు. టార్గెట్‌గా పెట్టుకున్న సరస్సులను నిర్దేశించుకున్న సమయంలోనే పూర్తిగా పునరుద్ధరిస్తున్నాడు. ఇప్పటికి మూడు సరస్సుల స్వరూపాన్నే మార్చేశాడు.
సరస్సులపై అధ్యయనం..

38 యేండ్ల ఆనంద్.. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే బెంగళూర్ వ్యాప్తంగా ఉన్న నీటి సరస్సులపై అధ్యయనం చేశాడు. వాటి స్థితిగతులపై స్థానికులతో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు వాటి వివరాలు తన కంప్యూటర్‌లో పొందుపరుస్తూ.. వాటిని ఎలా అభివృద్ధి చెయ్యాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఆయా ప్రాంతాల్లోని చెరువులు, సరస్సులను పునరుద్ధరించడానికి ఎంత ఖర్చు అవుతుందో, అక్కడ ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవాలో నిర్దేశించుకున్నాడు. అందుకు తగినట్లుగా స్థానికుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. వారి సహకారం, ఆర్థిక సహాయ మార్గాలను అన్వేషిస్తూ.. కేవలం నెలల వ్యవధిలోనే వాటి స్వరూపాన్ని మార్చేస్తున్నాడు ఆనంద్.

Anand-Save-Laks

సరస్సుల కోసం ఉద్యోగానికి స్వస్తి..

క్యాలసనహళ్లి చెరువు వైభవం చూసిన తర్వాత.. ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆనంద్. పూర్తిస్థాయిలో సరస్సుల సంరక్షణకు పూనుకున్నాడు. ఆ తర్వాత బొమ్మసంద్ర సమీపంలోని వబసాంద్ర సరస్సుపై దృష్టి సారించాడు. 9 ఎకరాల విస్తీర్ణంగల ఈ సరస్సు పనులను గత ఏడాది ఏప్రిల్ 5న ప్రారంభించాడు. ఇందుకు అవసరమైన 75 లక్షల రూపాయలను హెవ్‌లెట్-పకార్డ్ (హెచ్‌పీ) సంస్థ అందించింది. దీంతో కేవలం రెండు నెలల్లోనే దాదాపు 50 అడుగుల లోతు వరకు మట్టి తీయించి.. ఆ సరస్సుకు పూర్వ వైభవం తెప్పించాడు ఆనంద్. ఆ నీటితో చుట్టుపక్కల రైతుల పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి.

Anand-Save-Laks2

క్యాలసనహళ్లి ఓ ఉదాహరణ..

బెంగళూర్‌లోని అనేకల్‌కు సమీపంలోని క్యాలసనహళ్లి అనే చెరువు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 35 యేండ్లుగా నిర్జీవంగా ఉంది. ఈ చెరువుకు సమీపంలో టాటాస్టీల్స్ కంపెనీ మాజీ వైస్ చైర్మన్ బి.ముత్తురామన్ అందమైన ఇల్లు కట్టుకున్నాడు. అయితే సరైన నీటి సదుపాయం లేకపోవడం, చెరువు అందవిహీనంగా కనిస్తుండడంతో ఆయన మళ్లీ బెంగళూర్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో ఆనంద్ చేస్తున్న అధ్యయనం, పనులు గురించి తెలుసుకొని అతనికి కోటి 17 లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు. ఆనంద్, ముత్తురామన్ కలిసి ఆ చెరువు సమీపంలోని 400 ఇండ్లకు తిరిగి.. తమ ప్రణాళిక చెప్పారు. స్థానిక అధికారులతో మాట్లాడి చెరువు కొలతలు తీసుకొని.. 2017 ఏప్రిల్ 20న పనులు ప్రారంభించారు. వీరు చేస్తున్న పనికి స్పందించిన స్థానికులు.. స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకొచ్చారు. ఉదయం 9 గంటలలోపు, సాయంత్రం వేళల్లో పనులు చేసి దాదాపు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారు.

బురదను చెరువులోనే ఐదు చిన్న మట్టి దిబ్బలుగా మలిచారు. వాటిపై పండ్ల మొక్కలు నాటారు. చెరువు చుట్టూ రాళ్లతో రివిట్‌మెంట్ నిర్మించారు. వేసవిలో 45 రోజుల్లోనే చెరువు స్వరూపాన్ని మార్చుకున్నారు. ఆ చెరువు పక్కనే 18వేల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశారు. 22 రకాలైన 3వేల పండ్ల మొక్కలు, 2వేల ఆయుర్వేద మొక్కలు చెరువు చుట్టూ నాటించారు. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొద్దపాటి అడవిని సృష్టించారు. 5 వేల మొక్కలను 1.45 గంటలలో నాటి రికార్డు సృష్టించారు 1,500 మంది వలంటీర్లు. 2017 సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు నిండింది. స్వచ్ఛమైన నీరు చెరువుకు చేరింది. చెరువులోని మట్టిదిబ్బెలు పక్షులకు ఆవాసంగా మారాయి. అందమైన గార్డెనింగ్‌తో చెరువు సర్వాంగ సుందరంగా మారింది. ఈ చెరువును మొదటిసారి సందర్శించినప్పుడు తీసిన ఫొటో, ప్రస్తుత ఫొటోను ఆనంద్ నెటిజన్లతో పంచుకున్నాడు.

Save-Lake2

సరస్సుల సంరక్షణే ధ్యేయం

ఉద్యోగం మానేసిన తరువాత సరస్సుల సంరక్షణకు నేను పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాను. ఇందుకు ఎంతోమంది నుంచి ఎన్నో అభినందనలు అందుతున్నాయి. నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. రోజుకు 30 కాల్స్‌కు పైగా మాట్లాడుతున్నాను. వారి ఊరికి రావాలని చెరువు అభివృద్ధికి ప్రణాళికలు ఇవ్వాలని కోరుతున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ప్రస్తుతం నగరంలో అత్యంత విషపూరితంగా ఉన్న 16 ఎకరాల విస్తీర్ణం గల కొనసంద్ర సరస్సును పూర్తిగా మార్చేశా. దీని చుట్టుపక్కల ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉండడం.. వాటి వ్యర్థాలు ఈ సరస్సులో కలుస్తుండడంతో విషతుల్యమైంది. హికాల్ లిమిటెడ్ కంపెనీ రూ.81 లక్షల ఫండ్‌ను ఇచ్చింది. దీంతో గతేడాది నవంబర్ 3న మొదలుపెట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు పూర్తి చేశాం. నేను అనుకున్న సమయంలో నా లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటా.
- ఆనంద్ మల్లిగవద్, సామాజిక కార్యకర్త

586
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles