అంతులేని పోరాటం


Wed,January 8, 2014 03:21 PM

అడవుల్లోని ఖనిజసంపదను దోచుకుని తమ ఆస్తులను మరింత పెంచుకోవడానికి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దళారీలాగా పనిచేస్తున్నది ప్రభుత్వం. అడవిబిడ్డలైన ఆదివాసీలను అక్కడినుంచి తరిమే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలాంటి కథతోనే చక్రవ్యూహ్‌ని రూపొందించాడు ప్రకాశ్ ఝా.
‘మహంతా’ అనే కార్పొరేట్ కంపెనీ కన్ను గిరిజన ప్రాంతం నందిఘాట్‌పై పడుతుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కొన్ని వేల ఎకరాల గిరిజనుల భూమిని ప్రభుత్వం ఆ కంపెనీకి కట్టబెడుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతుంటారు మావోయిస్టు కమాండర్ రాజన్ (మనోజ్ బాజ్‌పేయ్) జూహీ (అంజని పాటిల్)నేతృత్వంలోని సభ్యులు. వారికి పెద్దదిక్కుగా ఉంటాడు ఓ ప్రొఫెసర్ (ఓంపురి).

chakravyuhమహంతా కంపెనీకి బాసటగా నిలవడం కోసం ఎస్‌పి ఆదిల్‌ఖాన్ (అర్జున్ రాంపాల్)ను నందిఘాట్‌కు పంపిస్తాడు డీజీపీ. రాజన్‌ను అరెస్టు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు ఆదిల్‌ఖాన్. గిరిజనుల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఎటు తోచని స్థితిలో తన స్నేహితుడు కబీర్(అభయ్ డియోల్)ను కోవర్టుగా దళంలోకి పంపుతాడు. దళాల కదలికలను తన స్నేహితుడైన ఎస్పీకి చేరవేస్తూ.. అనేకమంది కామ్రేడ్స్ మరణానికి కారణమవుతాడు కబీర్. చివరికి దళకమాండర్ రాజన్‌ను కూడా పోలీసుల చేతిలో చిక్కేలా చేస్తాడు. ఈ క్రమంలోనే మహిళా కామ్రేడ్ జూహీతో ప్రేమలో పడతాడు. అయితే కోవర్టుగా దళంలోకి వచ్చిన అతడిని గిరిజనుల స్థితిగతులు, మావోయిస్టు ఉద్యమం ప్రభావితం చేస్తాయి.

మరోవైపు ఎస్పీ ఆదిల్‌ఖాన్ భార్య రియా మీనన్ (ఇషా గుప్తా) ఇంటలిజెన్స్ ఎస్పీగా నందిఘాట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. టెక్నాలజీ సహాయంతో దళాల కదలికలను గమనించి పోలీసులతో దాడులు చేయిస్తుందామె. ఆ క్రమంలోనే ఓరోజు నందిఘాట్‌లో ఉన్న మహిళా కావూమేడ్ జూహీని తీసుకెళ్తారు పోలీసులు. ప్రతీకారంగా పోలీసులను చంపి, స్టేషన్ పేల్చేసి, జూహీని అత్యాచారం చేసిన ఎస్‌ఐని కిడ్నాప్ చేసి... ఎస్పీ ఆదిల్‌ఖాన్‌కు సవాల్ విసురుతాడు కబీర్. ప్రాణ స్నేహితులు కాస్తా వర్గ శత్రువులుగా మారిపోతారు. అనివార్యంగా దళ బాధ్యతలు కబీర్‌పై పడతాయి. ఆయన ఆజాద్‌గా మారతాడు. తరువాత రాజన్‌ను పోలీసుల చెరనుంచి ఎలా విడిపించాడు? ఎస్పీ ఆదిల్‌ఖాన్ స్నేహితుడే ఆజాద్ (కబీర్) అన్న నిజం తెలుసుకున్న దళం అతడిని ఏం చేసింది? ఆజాద్ తిరిగి దళం నమ్మకాన్ని ఎలా పొందగలిగాడు? టెక్నాలజీ సహాయంతో రియా మీనన్, ఆదిల్‌ఖాన్ దళాలను ఎలా తుదముట్టించాలనుకుంటారు? దళాన్ని కాపాడటం కోసం జూహీ, కబీర్ ఎలా ప్రాణాలు కోల్పోతారు? అనేదే కథ.

స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీల జీవన స్థితిగతులను, వాళ్ల పక్షాన ఉండి... పెట్టుబడిదారులు, భూస్వాములు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మావోయిస్టుల పోరాటాన్ని, దండకారణ్య ఉద్యమాన్ని చెప్పే కథ. ఇటీవలి కాలంలో నక్సలిజం వంటి సామాజికాంశంతో వచ్చిన సీరియస్ సినిమాలు చాలా తక్కువ. అలాంటి సమస్యను తీసుకుని ప్రకాశ్ ఝా చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. ప్రభుత్వం ఇద్దరు ప్రాణ స్నేహితులను బద్ధ శత్రువులుగా ఎలా మారుస్తుందని చెప్పడానికి కూడా ఇదో ఉదాహరణ. ఈ భూమి పుత్రులుగా... ఇక్కడి ప్రజల నిజమైన స్వేచ్ఛా, స్వాతంవూతాల కోసమే మావోయిస్టులు పోరాడుతున్నారని చెబుతుంది. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు దాటినా 20 తరువాత 21 అనే సంఖ్య ఒకటి ఉంటుందని తెలియని జనం ఇంకా ఎంతో మంది ఉన్నారని, వాళ్లపట్ల ప్రభుత్వానికున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుంది.

దేశంలోని మొత్తం పౌరులకు చెందాల్సిన సహజ వనరులను, ముఖ్యంగా ఆదివాసీల నేలను, నీళ్లను, ఖనిజాలను కొల్లగొడుతూ, వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేసి.. తమ ఆస్తులను వేల కోట్లకు పడగపూత్తిస్తున్న పెట్టుబడిదారులకు ఇదో సవాల్. ప్రభుత్వాలు నక్సలైట్లను దేశ ద్రోహులుగా చూపుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా. రాజకీయ నాయకులకు, దోపిడీవర్గాలకు ప్రభుత్వం, పోలీసులు ఎలా రక్షణనిస్తాయి, వాళ్లకెలా కొమ్ముకాస్తాయో మరోసారి చెప్పిందీ సినిమా!
అయితే ఒక ఇన్‌ఫార్మర్ అంత సులభంగా ఉద్యమంలోకి వెళ్లడమనేది సర్వసాధారణంగా ఉండదు. కబీర్ కోవర్టుగా వెళ్లడమనేది సినిమాటిక్‌గానే ఉంది. ‘దేశంలో కోట్లకు పడగపూత్తిన వాళ్లు ఓవైపు, 20 రూపాయల కోసం రోజంతా కష్టపడే పేదవాళ్లు మరోవైపు ఉన్నంతకాలం సంఘర్షణ ఉంటుంది, పోరాటం ఉంటుంది. మనదేశంలో మన బిడ్డలను చంపుకునే ఈ రక్తపాతానికి ముగింపు ఎప్పుడో’ అంటూ ప్రకాశ్ ఝా ఇచ్చిన ముగింపు మాత్రం అసంబద్ధంగా ఉంది.

21 సంఖ్య తెలియని ప్రజలున్నారని గుర్తించగలిగిన దర్శకునికి ‘దోపిడీపాలన కూలి, నిరుపేదలు అధికారంలోకి రాగలిగినప్పుడే పోరాటానికి ముగింపు’ అన్న సత్యం తెలియకుండా పోదు. ‘జీవితం ఎలా ప్రారంభించామన్నది కాదు. ముగింపువిప్లవవాదిగా ఉందా లేదా అనేదే ముఖ్యం’ దోపిడీ పాలన కూలేవరకు పోరాటానికి అంతం లేదు. లాల్‌సలాం!!

- మన్నె క్రిశాంక్

2376
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles