అంగవైకల్యాన్ని మిగిల్చే వైపాదిక సొరియాసిస్


Wed,March 2, 2016 01:49 AM

సాధారణంగా ఏ చర్మ వ్యాధి అయినా శరీరంలోని ఏదో ఒక భాగానికే పరిమితమై ఉండదు. క్రమంగా మొత్తం శరీరాన్ని వ్యాపిస్తుంది. కాని వైపాదిక (పామోప్లాంటర్) సొరియాసిస్ మాత్రం ఏళ్ల పర్యంతంగా ఉన్నా అరిచేతులకూ, అరికాళ్లకే పరిమితమై ఉంటుంది. అరుదుగా ఏ 5 శాతం మందిలోనో శరీరమంతా పాకినా మిగతా 95 శాతం మందిలో అలా పాకదు. అరికాళ్లూ, అరిచేతులు శరీరంలో చివరి భాగాన ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థ అంశాలు వాటిలోకి సహజంగానే ఎక్కువగా వచ్చి చేరుతుంటాయి. పైగా అరిచేతుల్లో అరికాళ్లలో చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. ఉన్నవి కూడా దాదాపు మూసుకునే ఉంటాయి. అందుకే వీటిని నాన్ యాక్టివ స్వెట్ గ్లాండ్స్ అంటారు. అలా అవి మూసుకుపోయి ఉండడం వల్ల అక్కడికి చేరుకున్న విష పదార్థాలు అంటే ఆమం బయటికి వెళ్లే మార్గం లేక అక్కడే ఉండిపోతుంది. ఇదే అరిచేతుల్లో అరికాళ్లలో వచ్చే వైపాదిక సొరియాసిస్‌కు కారణమవుతుంది.

వాతం విపరిణామాలు
వాతం సమతుల్యత కోల్పోయినప్పుడు అది పిత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే రక్తధాతువును దెబ్బతీస్తుంది. దీనికి రక్తధాతువునే కాకుండా మాంస ధాతువును కూడా దెబ్బతీసే గుణం ఉంది. అందుకే అరిచేతులూ, అరికాళ్లలో ఉండే పొర జిడ్డు లేకుండా మందంగా, గరుకుగా మారుతుంది. ఆ భాగాలు పగుళ్లు బారతాయి. చర్మం పెళుసులుగా కాకుండా ఒక పొరలా తయారవుతుంది. చర్మం మందంగా మారే కొద్దీ విపరీతమైన దురద మొదలౌతుంది. ఒక దశలో అరికాళ్లు, అరిచేతుల నుంచి వ్యాధి వేళ్ల మధ్యలోకి కూడా పాకుతుంది. ఈ దశలో ఆ భాగాలు తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటాయి. ఇన్‌ఫెక్షన్లతో ఆయా భాగాల్లో నొప్పి, మంట మొదలౌతాయి. వ్యాధి ముదిరే కొద్దీ తెలుపు రంగులోకి మారతాయి. కొందరిలో చాలా కాలంగా ఉన్న ఎగ్జిమా కూడా వైపాదిక సొరియాసిస్‌గా మారే ప్రమాదం ఉంది. చికిత్స ఆలస్యమైతే గోళ్లు వంకరపోతాయి. కీళ్లు దెబ్బతినే సొరియాటిక్ ఆర్థరైటిస్ కూడా రావొచ్చు.

ఆక్రోఫస్టులోసిస్
వైపాదిక సొరియాసిస్ రెండు రకాలు. అందులో ఆక్రోపస్టులోసిస్ ఒకటి. ఇది వేళ్ల చివరి భాగాల్లోనే వస్తుంది. ఆ భాగాల్లో అవసరానికి మించి కణజాలం ఉత్పన్నమై పొట్టులా మారుతుంది. ఆ తరువాత పగుళ్లు మొదలవుతాయి. క్రమంగా చీము గుళ్లలు తలెత్తుతాయి. ఇక కాళ్లలో అయితే మడమ చుట్టూ ఈ పగుళ్లు ఏర్పడతాయి.

పామోప్లాంటార్ పస్టులోసిస్
ఈ వ్యాధిలో అరిచేతులు, అరి పాదాల్లో పొట్టు లాంటి మచ్చలు, పొర ఏర్పడతాయి. వీటివల్ల ఏమాత్రం కదల్లేని స్థితి ఏర్పడుతుంది. అరిచేతుల్లో ఏర్పడిన సమస్యతో ఏ చిన్న వస్తువునూ పట్టుకోలేరు. ఆ పొట్టు పగులుబారడంతో విపరీతమైన దురద మొదలవుతుంది. అందుకే రోగి ఆ పొరను బలవంతంగా తీసేసే ప్రయత్నాలు చేస్తాడు. దీనివల్ల రక్తస్రావం కావొచ్చు. అదే సమయంలో దుమ్ము ధూళి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. ఈ వ్యాధికి గురయ్యే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ. వాళ్లు తరచూ ఉపయోగించే డిటర్జెంట్లు ఇందుకు కారణం కావొచ్చు. ఏ కారణాలు సొరియాసిస్‌కి దారితీస్తాయో, అవే కారణాలు పామోప్లాంటార్ రావడానికి కారణమవుతాయి. అంటే శరీరంలో ఆమం పెరిగిపోవడం ఒక ప్రధాన కారణం అవుతుంది. జన్యుపరమైన కారణాలతో పాటు మేనరికపు వివాహాలు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. వీటికి తోడు మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కీలక కారణమే.

ఆయుర్వేద వైద్యం
వైపాదిక లేదా పామోప్లాంటార్ వ్యాధి రావడానికి కారణమైన ఆమాన్ని అంటే శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను తొలగించడం ఈ వ్యాధి చికిత్సలో కీలకం. అందుకు పంచకర్మ చికిత్సలే ఏకైక మార్గం. శరీరంలో పెరిగిపోయిన ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కొన్ని ప్రత్యేక కషాయాలను ఇస్తాం. ఆమాన్ని తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికిత్సలు కూడా ఈ వైద్యంలో భాగమవుతాయి. అరికాళ్లతో పాటు అరిచేతులకు పై పూతగా రాసే కొన్ని ఔషధ తైలాలు కూడా ఇస్తాం. వీటిని రోజూ క్రమం తప్పకుండా వాడాలి. అరిచేతులకు వాడే మందు ఎంతో కొంత నోటిలోకి వెళ్లినా ప్రమాదం ఏమీ ఉండదు. వాస్తవానికి అది కడుపులోకి ఇచ్చే ఔషధ మూలికల కషాయమే. అందువల్ల ఈ తైలాలను ఎవరైనా నిశ్చింతగా వాడుకోవచ్చు. చికిత్సలన్నీ సక్రమంగా తీసుకుంటే వైపాదిక సొరియాసిస్ లేదా పామోప్లాంటర్ వ్యాధి తగ్గడానికి నెలరోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాకపోతే డాక్టర్ సూచించిన నియమావళిని అక్షరాలా పాటించడం ద్వారా రోగి డాక్టర్‌కు తోడ్పడాలి. అలా సహకరిస్తే ఈ వ్యాధిని సంపూర్ణంగా తొలగించే అవకాశాలు ఉంటాయి.
IOF

2040
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles