సురక్షితమైన స్కాన్.. ఎంఆర్‌ఐ


Wed,June 10, 2015 02:54 AM

వ్యాధి నిర్ధారణలో వైద్యరంగం వేసిన విప్లవాత్మకమైన అడుగు మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్.. ఎంఆర్‌ఐ స్కాన్. ఒకప్పుడు వ్యాధి నిర్ధారణ అంటే రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే. ఆ తరువాత ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్‌లు వచ్చాయి. స్కానింగ్ పద్ధతుల్లో ఒక్కోదానిదీ ఒక్కో ప్రత్యేకత. సీటీ స్కాన్‌లో కూడా తెలియని చాలా రకాల జబ్బుల్ని తెలుసుకోవడానికే కాదు.. కొన్ని రకాల చికిత్సలను కూడా గైడ్ చేయగలిగేది ఎంఆర్‌ఐ స్కాన్. మాన్స్‌ఫీల్డ్, గ్లాటర్‌బర్గ్ అనే ఇద్దరు సైంటిస్టుల కృషి ఫలితంగా 1980లో పుట్టిన ఎంఆర్‌ఐ 1989లో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది.

ఏమిటీ ప్రత్యేకత?


mri-scanner

సాధారణ ఎక్స్‌రేలు, సీటీ స్కాన్‌లలో అయొనైజింగ్ రేడియేషన్‌ను వాడుతారు. రేడియోథెరపీలో కూడా వాడేది ఈ రేడియేషనే. కాబట్టి వీటివల్ల కొంతవరకు హాని కలగవచ్చు. కాని ఎంఆర్‌ఐ స్కాన్ వల్ల అటువంటి సమస్య లేదు. ఎంఆర్‌ఐలో అయొనైజింగ్ రేడియేషన్ వాడరు. కాబట్టి ఇది సురక్షితమైనది. అయాస్కాంత శక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల అయస్కాంత ప్రభావాలు మాత్రం ఉంటాయి. కాబట్టి ఈ స్కాన్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌తో సహా ఎటువంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు. శరీరంలో పేస్‌మేకర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటివి ఉంటే ఎంఆర్‌ఐ చేయించుకోవడానికి కుదరదు.

ఇలాంటప్పుడు సీటీ స్కాన్ లాంటి వాటికి వెళ్లాలి. కీలుమార్పిడి చేయించుకున్నవాళ్లకు కూడా లోపల అమర్చే కృత్రిమ కీలు లోహపు వస్తువే అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఎంఆర్‌ఐకి సరిపడే కృత్రిమ కీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఇటీవలి కాలంలో అంటే గత 10-15 ఏళ్లలోపు కీలుమార్పిడి చేయించుకున్నవాళ్లు ఎంఆర్‌ఐ చేయించుకోవచ్చు. వీళ్లకు సురక్షితమే. అయితే కీలుమార్పిడి చేయించుకున్నవాళ్లకు ఎంఆర్‌ఐ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. స్కాన్ చేయడానికి ముందు ఒక 30 సెకన్ల పాటు స్కానర్ లోపల ఉంచుతారు. ఆ సమయంలో వాళ్లకు మోకాలు నొప్పి గాని, వేడెక్కుతున్నట్టు అనిపించినా, తమ ప్రమేయం లేకుండా కాలు కదులుతున్నా ఎంఆర్‌ఐ సరిపడనట్టే. వెంటనే వాళ్లను బయటకు తీసుకువచ్చేస్తారు.

చికిత్సల్లో కూడా..


కొన్ని రకాల జబ్బులకు చికిత్స అందించేటప్పుడు ఒకపక్క జబ్బుకు సంబంధించిన కారణాన్ని విశ్లేషిస్తూ మరోపక్క చికిత్స అందిస్తారు. ఇలాంటప్పుడు ఎంఆర్‌ఐ పాత్ర కీలకం. సాధారణంగా గర్భసంచి సమస్యల్ని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అయితే ఫైబ్రాయిడ్స్ లాంటి వాటికి చికిత్స అందించే ముందు వాటిని మరింత స్పష్టంగా అధ్యయనం చేయడానికి ఎంఆర్‌ఐ తోడ్పడుతుంది. చిన్నవయసు మహిళల్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భసంచి తీసేయకుండా మయోమెక్టమీ ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను తొలగిస్తారు. ఇలా మయోమెక్టమీ ద్వారా గాని, ఇంట్రాయుటెరిన్ ఎంబొలైజేషన్ ద్వారా గాని ఫైబ్రాయిడ్స్‌కు చికిత్స చేసేముందు ఎంఆర్‌ఐ చేస్తారు. అంటే ఎంఆర్‌ఐ సహాయంతో ఈ చికిత్స చేస్తారు. ఇలాంటి చికిత్సను హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎంఆర్ గా పరిగణిస్తారు. ఫైబ్రాయిడ్స్ చికిత్స ముందే కాకుండా పార్కిన్‌సన్స్ డిసీజ్ లాంటి వ్యాధుల్లో కూడా ఎంఆర్‌ఐ పాత్ర కీలకమైనది. క్యాన్సర్ కణితి ఏ దశలో ఉందనేది క్యాన్సర్ చికిత్సలో కీలకమైన అంశం. క్యాన్సర్ దశను నిర్ణయించడంలో ఎంఆర్‌ఐ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?


మన శరీరం మిలియన్ల కొద్దీ కణాలచేత నిర్మితమై ఉంటుంది. ఈ కణాల లోపల మైటోకాండ్రియా అంటే అనేక రకాల కణాంగాలుంటాయి. ఈ కణాంగాల్లో అణువులు, వాటిలో పరమాణువులు ఉంటాయి. పరమాణువుల్లోపల ప్రొటాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రొటాన్లకు అయస్కాంత లక్షణాలు, విద్యుత్ లక్షణాలు ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి సూక్ష్మ అయస్కాంతాలుగా పనిచేస్తాయి.

ఇవి కణాల్లో ఒక క్రమ పద్ధతి లేకుండా తిరుగుతూ ఉంటాయి. ఎంఆర్‌ఐ ద్వారా శక్తివంతమైన అయస్కాంతాన్ని రేడియోఫ్రీక్వెన్సీ తరంగాలను పంపించినప్పుడు ఈ ప్రొటాన్లు వాటి మార్గాన్ని మార్చుకుని ఒక వరుస క్రమంలోకి వస్తాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీని ఆపివేయగానే అవి రిలాక్స్ అవుతాయి. ఎంఆర్‌ఐ ద్వారా పంపించే రేడియో ఫ్రీక్వెన్సీ, ప్రొటాన్ల ఫ్రీక్వెన్సీ ఒక్కటే. కాబట్టి రెజొనెన్స్ ఏర్పడి శక్తి మార్పిడి జరుగుతుంది. ఇలాంటప్పుడు కొంత శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి కొన్ని సంకేతాల రూపంలో విడుదలవుతుంది. ఈ సంకేతాలను కంప్యూటర్ గ్రహించి చిత్రాలను ఏర్పరుస్తుంది.

పరిమితులు.. ఆధునికతలు...


ఎంఆర్‌ఐ స్కాన్ ఆధునికమైనదీ, శక్తివంతమైనదీ అయినప్పటికీ కొన్ని రకాల సమస్యల్లో దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అల్జీమర్స్ లాంటి వ్యాధుల్లో ఎంఆర్‌ఐ ద్వారా చాలా సందర్భాల్లో నార్మల్ అనే రావొచ్చు. అదేవిధంగా మెటబాలిక్ ఎన్‌కెఫలోపతీ వ్యాధిలో కలిగే జీవక్రియలకు సంబంధించిన రసాయనిక చర్యలను ఎంఆర్‌ఐ స్కాన్ కనిపెట్టలేదు. అదే విధంగా వెన్నుపాముకు సంబంధించిన కొన్ని సమస్యల్లో కూడా ఎంఆర్‌ఐ అంతగా ఉపయోగకరం కాదు. అయితే ఇప్పుడు పెట్ ఎంఆర్ అని కొత్తగా అందుబాటులోకి రానుంది. ఇది సాధారణ ఎంఆర్‌ఐ కన్నా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

దీనిలోని పెట్ భాగం కణస్థాయిలోని జీవక్రియల్లో జరిగే రసాయనిక మార్పులను కూడా గుర్తించగలుగుతుంది. కాబట్టి దీనిద్వారా ఎంఆర్‌ఐకి ఉన్న పరిమితులను అధిగమించడం సాధ్యం అవుతుంది. పెట్ ఎంఆర్‌ఐ మనదేశంలో ఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థలో మాత్రమే అందుబాటులో ఉంది. అయస్కాంతం శక్తిని బట్టి దాని ఎంఆర్‌ఐ వేగం, స్పష్టత ఉంటాయి. 3 టెస్లాల సామర్థ్యం ఉన్న ఎంఆర్‌ఐ సర్వసాధారణం. ఇప్పుడు 4 టెస్లాల సామర్థ్యం ఉన్న ఎంఆర్‌ఐ ఆధునికమైనది. భవిష్యత్తులో 7 టెస్లాల సామర్థ్యం ఉండే ఎంఆర్‌ఐ యంత్రాలు కూడా రాబోతున్నాయి.

ఈ వ్యాధులుంటే ఎంఆర్‌ఐ బెస్ట్!


-కొన్ని రకాల వ్యాధులకు ఇతరత్రా స్కాన్‌లు, నిర్ధారణ పద్ధతుల కన్నా ఎంఆర్‌ఐ ఉత్తమమైనది. వాటిని ఎంఆర్‌ఐ ద్వారా మాత్రమే కనిపెట్టవచ్చు.

-మృదుకణజాలానికి గాయాలైనప్పుడు పారాప్లీజియా అంటే ఒకవైపు కాళ్లకు పాక్షికంగా చచ్చుబడతాయి. యాక్సిడెంట్లలో వెన్నుపాముకు గాయాలైనప్పుడు సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌లు రెండూ అవసరం అవుతాయి. ఫ్రాక్చర్లు చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు మాత్రం సీటీ స్కాన్ కన్నా ఎంఆర్‌ఐ స్కాన్ వల్లే ఉపయోగం ఎక్కువ. డిస్క్ ప్రొలాప్స్ సమస్యకు కూడా ఎంఆర్‌ఐ మంచిది.

-మల్టిపుల్ స్లిరోసిస్ - ఇది ఎక్కువగా ఆడవాళ్లలో కన్పిస్తుంది. చూపునకు సంబంధించిన సమస్యలు, ఒకే చేయి లేదా ఒకే కాలు బలహీనం కావడం లాంటి లక్షణాలుంటాయి. దీనికి ఎంఆర్‌ఐ మేలు. అదేవిధంగా చిన్నారుల్లో కనిపించే ల్యుకో డిస్ట్రోఫీస్‌కి కూడా ఎంఆర్‌ఐ సరైనది. ఈ వ్యాధి వల్ల పిల్లల్లో మోటార్ న్యూరాన్ల డెవలప్‌మెంట్ జరగదు. అందువల్ల పెరుగుదలకు సంబంధించిన మైల్‌స్టోన్స్ ఆలస్యం అవుతాయి. పాకడం, నడవడం, మాట్లాడడం అన్నీ ఆలస్యం అవుతాయి. మెదడుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలున్నప్పుడు వాటిని నిర్ధారణ చేయడానికి కూడా మెదడుకు చేసే ఎంఆర్‌ఐ ఉపకరిస్తుంది.

-పక్షవాతానికి సంబంధించిన పరీక్షల్లో కూడా ఎంఆర్‌ఐ ముందు వరుసలో ఉంటుంది. పక్షవాతాన్ని తొలిదశలోనే ముందుగా గుర్తించి, జాగ్రత్తపడడానికి ఇది ఉపకరిస్తుంది. ఎటువంటి కాంట్రాస్ట్‌ను ఎక్కించకుండా మెదడులో ఏర్పడిన గడ్డలను గాని, ట్యూమర్స్‌ను గాని చాలా స్పష్టంగా గుర్తించడానికి ఇది తోడ్పడుతుంది. సీటీ స్కాన్‌లో 24 గంటల్లో తేలని విషయం ఎంఆర్‌ఐ ద్వారా 20 నిమిషాల్లో స్పష్టమవుతుంది.

-మూర్ఛ వ్యాధికి కారణమైన టెంపోరల్ స్క్లిరోసిస్‌ను సీటీ స్కాన్ ద్వారా గుర్తించలేము. ఇందుకు ఎంఆర్‌ఐ తప్ప మార్గం లేదు.

-కార్డియోమయోపతిని గుర్తించడానికి, గుండె కండరంలో ఏ భాగం పనిచేస్తుంది.. దేనిలో లోపం ఉంది తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ చేయాలి. గుండె పంపింగ్ సామర్థ్యంలో లోపాన్ని తెలుసుకోవచ్చు.

-కీళ్లకు సంబంధించిన మృదుకణజాలంలో సమస్యలున్నప్పుడు, లిగమెంట్‌లు దెబ్బతిన్నప్పుడు, కార్టిలేజ్ డీజనరేషన్ సమస్య ఉన్నప్పుడు ఆయా సమస్యలను గుర్తించడానికి, తీవ్రత తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ స్కాన్ ఉపయోగపడుతుంది.

-ఎముక మజ్జలో సమస్యలను ముఖ్యంగా మైలో ఇన్‌ఫిల్ట్రేటివ్ డిజార్డర్స్‌ను కనుక్కోవడానికి కూడా ఎంఆర్‌ఐ చేస్తారు. అంటే ల్యుకేమియాస్, మైలోమాస్ లాంటి మాలిగ్నెంట్ ట్యూమర్లున్నా, సాధారణ ట్యూమర్లున్నా వాటిని కనుక్కోవడానికి ఎంఆర్‌ఐ చేస్తారు.

kishore

-జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు చేసే ఎంఆర్‌ఐని ఎంఆర్‌సీపీ (మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కొలంజియో పాంక్రియాటోగ్రఫీ) అంటారు. పాంక్రియాస్ గ్రంథిలో గాని, బిలియరీ నాళంలో గాని సమస్యలుంటే తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. కామెర్లు, పాంక్రియాస్‌లో కణుతులు, కొలంజియో కార్సినోమాస్ ఉన్నప్పుడు ఈ ఎంఆర్‌సీపీ బాగా ఉపయోగపడుతుంది. గాల్‌స్టోన్స్ (గాల్‌బ్లాడర్‌లో రాళ్లు) కామన్ బైల్ డక్ట్ (సీబీడీ) అనే నాళంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు కూడా ఎంఆర్‌ఐ చేయించడం మేలు.

-ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ) ఉన్నప్పుడు, క్రౌన్స్ డిసీజ్ లాంటి చిన్నపేగు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, క్షయ వ్యాధిని తెలుసుకోవడానికి ఎంఆర్ ఎంటిరోగ్రఫీ లేదా ఎంఆర్ ఎంటిరోైక్లెసిస్ పరీక్షలు చేస్తారు.

-స్త్రీలకు సంబంధించిన గైనిక్ సమస్యలున్నప్పుడు చాలావరకు అల్ట్రాసౌండ్ స్కాన్ సరిపోతుంది. అయితే పుట్టుకతోనే గర్భసంచిలో లోపాలున్నా, ఎండోమెట్రియల్ కార్సినోమా, సర్వికల్ కార్సినోమా లాంటి క్యాన్సర్లు ఉన్నప్పుడు ఎంఆర్‌ఐ చేస్తారు.

3832
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles