కావలసిన పదార్థాలు
చికెన్: అరకిలో, గోంగూర: ఒక కట్ట, పచ్చిమిర్చి: నాలుగు, కారం: రెండు టీ స్పూన్లు, పసుపు: ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టీ స్పూన్లు, ఉల్లిగడ్డ: ఒకటి, మెంతులు, జీలకర్ర, ధనియాలు: ఒక టీస్పూన్ చొప్పున, ఎండుమిర్చి: నాలుగు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: అర కప్పు, కొబ్బరి తురుము: ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత
తయారీ విధానం
చికెన్‌ను బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. గోంగూరను కడిగి, తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె లేకుండా ధనియాలు, ఎండు మిర్చి, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి దోరగా వేయించి కొంచెం నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక మసాలా ముద్దవేసి నూనె పైకి తేలేవరకు వేయించాలి. తర్వాత గోంగూర వేసి మగ్గనివ్వాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత చికెన్ వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ.