పెండ్లయ్యాక అత్తగారింట్లో కొన్ని రోజులు బాగానే ఉంది. అందరూ బాగానే ఉండేవారు. మెల్లిమెల్లిగా నా భర్త, అత్త నన్ను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్తే నమ్ముతారన్న నమ్మకం లేదు. ఇందుకు నేను ఎలాంటి ఆధారాలను సంపాదించాలి?
ఓ సోదరి, వరంగల్
చాలామంది మహిళలు గృహహింసను భరిస్తూ ఉంటారు. కుటుంబం పరువు, వ్యక్తిగత ప్రతిష్ఠ, సమాజం ఏమనుకుంటుంది అన్న ఆలోచనలతో హింసను భరిస్తూ ఉంటారు. కానీ, పోరాడితే పోయేదేం లేదు అని గుర్తుంచుకోవాలి. గృహహింసను ఎదుర్కొనేందుకు ముందు దాన్ని రుజువు చేసే ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన ఆధారాలతో అడుగు వేస్తే మీ భర్త, అత్త అకృత్యాలను సులభంగా నిరూపించవచ్చు.
మానసిక, శారీరక, లైంగిక హింసకు గురైన తేదీ, సమయం, స్థలానికి సంబంధించిన వివరాలను ఒక పేపర్‌పై రాసి పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చినప్పుడు, కోర్టును ఆశ్రయించినప్పుడు ఈ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
వీలైతే గృహహింసకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఫోన్లో రికార్డ్ చేయడం మంచిది. అయితే, వీటిని రికార్డు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీకు ఏ ఆపదా రాకుండా చూసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
మీరు ఎదుర్కొంటున్న గృహహింస గురించి ఆత్మీయులకు వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా పంపిస్తే, వాటిని సేవ్ చేసుకోవాలి. ఇవన్నీ గృహహింసకు డాక్యుమెంట్లుగా పని చేస్తాయి.
ఒకవేళ, మీరు ఎలాంటి ఆధారాలు సంపాదించ లేకపోయినా ఫర్వాలేదు. దీని గురించి ఎక్కువగా చింతించకండి. మీరు హింసకు గురవుతున్న సమయం, తేదీ, స్థలం వంటి వివరాలను కుటుంబసభ్యులు, స్నేహితులకు మెసేజ్‌ల రూపంలో పంపినా సరిపోతుంది.
మానసి చౌదరి ,అడ్వకేట్
www.pinklegal.in