e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. యాదర్షి తపస్సు, నారసింహావతార ఆవిర్భావం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు .

- Advertisement -

విజ్ఞానేశ్వరుడు చెప్పిన ధర్మమూ, నరసింహతత్వ మర్మమూ ఏమిటో తెలుసుకోవాలని, ఉత్సాహపడుతున్నారు త్రిభువనమల్ల చక్రవర్తి, ఆయన ధర్మపత్ని చంద్రలేఖాదేవి.
“రక్షించేవాడు- పరీక్షించడమెందుకు?
ఆభయం ఇచ్చేవాడు- భయం కల్పించడం ఎందుకు?
కష్టాలను కడతేర్చేవాడు- మరిన్ని కష్టాలను కల్పించడం ఎందుకు?
ధర్మం-నిర్దుష్టంగా ఉండాలి కానీ, దానిలో మరొక అంశం
వలె మర్మం ఎందుకు?
అసలు మనం నరసింహుణ్ని ప్రార్థించేదీ, అర్థించేదీ.. కష్టాలను తొలగించి సుఖాలను, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించమనే కదా! మరి సామాన్యులకు అంతుపట్టని, అర్థం కాని మర్మాలు ఎందుకు?
అసలు..
పాటించే శక్తి లేనప్పుడు నియమాల పఠనం ఎందుకు?
మనసులో సందిగ్ధత ఉన్నప్పుడు సాధన చేస్తే ఉపయోగం ఏమిటి?
“ఈ ప్రశ్నలు- ప్రశ్నలుగానే ఉంటాయి.
కానీ, సమాధానాలు మాత్రం ఎవరికి వారు వెతుక్కుంటూనే ఉంటారు.
సమాధానపడతారు. దేవుని కరుణా కటాక్షాలను ఎవరికి వారు తెలుసుకుంటూ ఉంటారు.
అనుభవం ద్వారా, చుట్టూ ఉన్న సమాజం ద్వారా, కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా, విచిత్రంగా మార్పులు పొందే మనుషుల మనస్తత్వాల ద్వారా ఫలితం ఏమిటో తెలుసుకుంటారు భక్తిపరులు.”
అయితే, మహారాణి చంద్రలేఖకు ఆయన సమాధానం అర్థం కాలేదు.
“అర్థం కాలేదు ఆచార్యా!” అన్న చంద్రలేఖ మాటకు చిరునవ్వుతో చూశాడు విజ్ఞానేశ్వరుడు.
“అర్థం కాలేదా- లేక నచ్చలేదా?” ఇంత సులువుగా చెప్పినా అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ నవ్వాడు.
‘భగవంతుడు చూపే అనుగ్రహం, చేసే పనులు- ఈ కలియుగంలో ప్రత్యేకంగా ఉండవు. ప్రతీకాత్మకంగా ఉంటాయి. మనం ఎంచుకునే మార్గాలు, మనం పాటించే విధానాలు, మనం పొందే అనుభవాలు.. ఇవి. నరసింహుడి అనుగ్రహానికి సూచనలుగానే భావించి- భక్తిభావం, భగవంతుడిపైన నమ్మకం భక్తుడిలో పరిపూర్ణంగా కలిగినప్పుడు, వినాశకర పరిస్థితులు ఏర్పడినప్పుడు, దుష్టశక్తులు రెచ్చిపోయి లోక కంటకంగా మారినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. చెడ్డవాడిని అంతమొందించి, మంచివారిని కాపాడటానికే స్వామివారి నరసింహావతారం!
స్వామి నిజరూపంతో దర్శనం ఇవ్వకపోవచ్చు. కానీ, చుట్టుపక్కల పరిసరాల్లో, పరిచితుల్లో, అపరిచితుల్లో, ఎవరి రూపంలో అయినా రావచ్చు. సమస్యను దూదిపింజలా ఎగరగొట్టేయొచ్చు”
చెప్పడం ప్రారంభించాడు వివరంగా అందరికీ అర్థమయ్యేలా!
‘నరసింహః’ అంటే ‘నర ఇవ సింహ ఇవచ కృతిర్యస్యేతి’ నరుని వలె, సింహము లాంటి రూపం.. ఏ మూర్తికి ఉంటుందో, ఆ మూర్తి నరసింహుడు అని అర్థం.
అందుకే మంత్రరాజపద స్తోత్రం ఇలా చెబుతున్నది..
నరవత్‌ సింహవశ్చైవ యస్యరూపం మహాత్మనః
అలాగే శ్రీ మహాభాగవతం ఏడో స్కంధంలో
శ్లో॥ సత్యం విధాతుం నిజభృత్య భాషితం
వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః
అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్‌
స్తంభే సభాయం న మృగం న మానుషం!
మొదట ఈ విశ్వమంతా జలమయంగా ఉండేది. ఆ అశేష జలనిధి నుంచి ప్రజాపతి ప్రభవించాడు. ప్రజాపతి తపస్సు చేయడం ప్రారంభించాడు. దీర్ఘకాలం తర్వాత తపస్సు సఫలమై, సార్థకమైన తరుణంలో బ్రహ్మదేవుడు మహాశక్తి
మంతమైన, అతి పవిత్రమైన నృసింహ మంత్రాన్ని అనుగ్రహించాడు.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతో ముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యుం మృత్యుం నమామ్యహమ్‌
ఈ నాలుగు చరణాలు, సకల సృష్టికి అనుగ్రహ శరణాలు.
‘య ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషోదృశ్యతే’ అనే సూక్తి ప్రమాణంగా ఇలా చెప్పుకోవచ్చు.
భూమి, రుగ్వేదం, సంపూర్ణ విశ్వం, విరాట్టు, సమ్రాట్టులను ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ అనే ప్రథమ చరణంగా..
అంతరిక్షం, యజుర్వేదం, హిరణ్మయ పురుషుడు- జ్వలంతం సర్వతో ముఖమ్‌ అనే ద్వితీయ చరణంగా..
స్వర్గలోకం, సామవేదం, సోముడు తృతీయ చరణమైన ‘నృసింహం భీషణం భద్రం’గా, ఆకాశం, అథర్వవేదం, సకలదేవతా స్వరూపుడైన పరమస్వరాట్టుగా.. ‘మృత్యుం మృత్యుం నమామ్యహమ్‌’ అని నృసింహ తాపనీయ ఉపనిషత్తు చెబుతున్నది.
పవిత్రమైన పదకొండు పదాలతో కూడిన, అంటే ఏకాదశ పదాత్మకం అయినది ఈ మహామంత్రం.
యాదరుషి తపోమహిమతో దివ్యక్షేత్రంగా అద్వితీయ నరసింహ స్థలంగా రూపొందిన యాదాద్రిలో నరసింహుడిని దర్శించి ఎవరైతే ఈ అనుష్టుప్‌ మంత్రాన్ని భక్తితో పఠిస్తారో వారు అన్ని బాధల నుంచి విముక్తులు అవుతారు. అప్పుల బాధలు, కుటుంబ పోషణలో కష్టనష్టాలు, అంతుచిక్కని వ్యాధులు వీటన్నిటి నుంచి విముక్తులు అవుతారు. స్వామి మంత్రానికి అంత శక్తి ఉన్నది. నిజానికి ఇది సకల శక్తుల సమాహారం.

(మిగతా వచ్చేవారం)

-అల్లాణి శ్రీధర్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement