e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home యాదాద్రి మనమంతా.. ఒకే కుటుంబం

మనమంతా.. ఒకే కుటుంబం

 • సమష్టిగా పిడికిలి బిగిస్తే అసాధ్యమంటూ ఏదీలేదు
 • మూడు రోజుల్లో అభివృద్ధి కమిటీలు వేసుకోవాలి
 • వాసాలమర్రి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ పమేలాసత్పతిని నియమిస్తున్నట్లు ప్రకటన
 • దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధికి బీజం వేసిన సీఎం కేసీఆర్‌
 • వాసాలమర్రి వాసులంతా నా కుటుంబ సభ్యులే…
 • జిల్లాపై సీఎం వరాల జల్లు
 • ప్రతి పంచాయతీకి రూ.25లక్షలు, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి,
 • ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు వెల్లడి
 • మళ్లీ నెల రోజుల్లో వస్తా… కార్యాచరణను రూపొందించుకుందాం
 • గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం
 • సీఎం కేసీఆర్‌ రాకతో గ్రామంలో పండుగ వాతావరణం
మనమంతా.. ఒకే కుటుంబం

వాసాలమర్రి వాసులంతా నా కుటుంబసభ్యులే.. గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుంటా… గ్రామాభివృద్ధికి రూ.100 నుంచి రూ.150 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం పెద్ద విషయం కాదు..ప్రతి పైసాను సద్వినియోగం చేసుకునేలా గ్రామస్తులు కార్యాచరణను రూపొందించుకుకోవాలి. మీ శక్తి ఏమిటో చూపెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో మంగళవారం సీఎం కేసీఆర్‌ పర్యటించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు గ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ వేదికపై నుంచి అభివాదం చేసిన సీఎం ‘భోజనాలు చేద్దాం పదండి’ అని భోజన ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం అనంతరం తిరిగి సభా వేదికపైకి వచ్చిన సీఎం కేసీఆర్‌ సుమారు గంట సేపు వాసాలమర్రి అభివృద్ధిపైనే ప్రధానంగా ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదారి బాలమల్లు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సాంబశివరావు, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్‌, డీసీపీలు నారాయణరెడ్డి, పి.యాదగిరి, శ్రీనివాస్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ కొల్పుల అమరేందర్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బీకునాయక్‌, ఎంపీపీ భూక్య సుశీలారవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కొమ్మిరిశెట్టి నర్సింహులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌, టీఆర్‌ఎస్వీ, యువజన విభాగం మండలాధ్యక్షులు భాస్కర్‌యాదవ్‌, శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీపీ బబ్బురి రవీంద్రనాథ్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు షరీఫ్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు బద్దునాయక్‌, మంజుల, సుంకరి శెట్టయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ పలుగుల మధు, నామసాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మనమంతా.. ఒకే కుటుంబం
- Advertisement -

అడుగడుగునా పటిష్ట నిఘా…
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి ఫాంహౌజ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్‌ చేరుకోగా, ఆ మార్గంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంతోపాటు వాసాలమర్రి గ్రామంలో కూడా అడుగడుగునా పటిష్ట నిఘాను ఉంచారు. సహపంక్తి భోజనం, గ్రామ సభలో కేవలం వాసాలమర్రి వాసులే పాల్గొనేలా వారికి ప్రత్యేక పాసులను అందించారు. బందోబస్తు చర్యల్లో ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 47 మంది ఎస్‌ఐలు, 53 మంది ఏఎస్‌ఐలు, 80 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 460 మంది కానిస్టేబుళ్లు, 80 మంది మహిళా కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 750 మంది పాల్గొన్నారు.

పింఛన్‌తోనే బతుకుతున్న
అప్పట్ల రూ.వంద, రెండు వందల పింఛను వస్తుండే. అవి ఎటూ సరిపోకపోతుండే. మా ముసలాయినె సచ్చిపోయినప్పటి నుంచి బిడ్డ దగ్గరికి వచ్చి ఉంటున్న. కేసీఆర్‌ సారు ఇప్పుడు రెండువేల రూపాల పింఛను ఇస్తున్నడు. నెలనెల పైసలు పడుతున్నయి. ఇప్పడు నేనేం పని చేశెటట్టు లేదు. ఆ రెండువేలతోనే బతుకుతున్న. నా బిడ్డ, అల్లుడు కూలి పనులు చేస్తరు. వచ్చే సంపాదన వాళ్ల తిండికే సరిపోతది. వాళ్లకు నేను బరువు కాకుంట కేసీఆర్‌ సారు ఆదుకుంటున్నడు. నెలనెల ఇచ్చే రెండువేలతోటి బతుకుతున్న. అప్పట్ల మా ఇంటి ముంగట మట్టి రోడ్లు ఉంటుండే. ఇప్పుడు సీసీ రోడ్లు అయినయి.

 • బుర్రకాయల లక్ష్మి

ఊరుకు దగ్గర్లో కాలేజీ వచ్చింది
మా ఊర్లో పదో తరగతి వరకు ఉంది. ఒకప్పుడు ఇంటర్‌ చదవాలంటే గవర్నమెంట్‌ కాలేజీలు దగ్గర్లో ఉండేవికాదు. భువనగిరికో లేదంటే గజ్వేల్‌కో వెళ్లాల్సి వచ్చేది. ఎటు వెళ్లినా కనీసం 25 కిలోమీటర్ల దూరం. రానుపోను 50 కిలోమీటర్ల ప్రయాణం. నాలుగేండ్ల కిందట మాకు దగ్గర్లోని రాంపూర్‌లో మోడల్‌ కాలేజీ కట్టిండ్రు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు క్లాసులు ఉన్నాయి. నేను పదో తరగతి ఐపోగానే రాంపూర్‌ కాలేజీలో చేరిన. మంచి స్టాఫ్‌, కొత్త బిల్డింగ్‌, పెద్ద క్లాస్‌ రూమ్‌లు, మంచి ల్యాబ్‌లు.. ఇట్లా అన్ని వసతులు బాగున్నాయి. ఊరుకు దగ్గర్లోనే ఇన్ని వసతులతో కాలేజీ, స్కూల్‌ రావడం సంతోషంగా ఉంది.

 • బుర్రకాయల మౌనిక

గ్రామాలకు నిధులు
వాసాలమర్రి అభివృద్ధిపై చర్చించేందుకు నిర్వహించిన గ్రామ సభా వేదికపైనే జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలుండగా ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25లక్షల చొప్పున ముఖ్యమంత్రి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, ఇతర ఐదు మున్సిపాలిటీలు యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్‌, పోచంపల్లిలకు రూ.50లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సీఎం సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో వసతులు మెరుగుపడుతున్నాయని.. కాళేశ్వరం నీళ్లు, 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో క్రమక్రమంగా అన్ని సమస్యలు తీరిపోనున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మంత్రులకు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు…
సీఎం కేసీఆర్‌ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులపై ప్రశంసలు కురిపించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్యమంలో పని చేసిన వ్యక్తి అని, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సీఎం అభినందించారు. ప్రజల కోసం పని చేసే వ్యక్తి అని కొనియాడారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారని, మంత్రి ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల వాసాలమర్రి గ్రామ పనులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని సీఎం చెప్పారు. వాసాలమర్రి పర్యటనకు సంబంధించి ముందుగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికే ఫోన్‌ చేశానని, వాసాలమర్రి బాగోగులను ఎమ్మెల్యే సునీత దగ్గరుండి చూసుకుంటుందన్నారు.

గ్రామస్తులతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం…
వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. గ్రామ సభకు ముందే భోజన కార్యక్రమాన్ని నిర్వహించగా, సుమారు 3 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ గ్రామస్తులతో కలిసి భోజనం చేయగా, 23 రకాల ప్రత్యేక వంటకాలను గ్రామస్తులకు ఈ సందర్భంగా వడ్డించారు. అనియన్‌ లీమ్‌సలాడ్‌, ప్లేన్‌ పుల్కా, మెంతి చికెన్‌ ఫ్రై, మటన్‌ కర్రీ, చేపల పులుసు, మటన్‌ దాల్చా, ఎగ్‌ పులుసు, ప్లేన్‌ బగారా రైస్‌, మిర్చికా సలాడ్‌, ఆలుగోబి టమాట షోర్వ, బెండకాయ ఫ్రై, చిక్కుడు మెంతి ఫ్రై, గంగభావి మ్యాంగో దాల్‌, పచ్చిపులుసు, ఉల్లిపప్పుచారు, పెరుగు చట్నీ, పెరుగు, పుంటికూర పచ్చడి, డబుల్‌ కా మీటా, కద్దుకా ఖీర్‌, స్వీట్‌ పాన్‌లను గ్రామస్తులకు అందించిన మెనూలో చేర్చారు. మొదటగా మహిళలకు వంటకాలను వడ్డించగా, ఆ ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం కేసీఆర్‌ వంటకాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వాసాలమర్రికి చెందిన చిన్నూరి లక్ష్మి, ఆకుల ఆగమ్మలతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్‌ వారి సాదకబాధలతోపాటు గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలువొస్తే మొత్తం వరి పండిస్తం
డ్యాములు, కాలువల గురించి టీవీలల్ల సూసుడు, పేపర్లల సదువుడేగానీ మా దిక్కు వస్తయని కలలో కూడా అనుకోలే. మా ఊరు గడ్డమీద ఉంటది. ఇక్కడిని నీళ్లెందుకు ఒస్తయి అని అనుకునేటోళ్లం. కాళేశ్వరం మొదలువెట్టినంక కొంచెం నమ్మకం మొదలైంది. గుట్టమీదున్న కొండపోశమ్మ కాడికి నీళ్లు ఒచ్చినంక మా ఊరికి గూడ నీళ్లు వొస్తయని పూర్తిగ నమ్మకం ఒచ్చింది. కాలువ పూర్తయినంక కొండపోశమ్మసాగర్‌ల నీళ్లు ఒదులుతే సక్కగ మా ఊరుదాక వస్తయి. ఏడాదంతా వరి పండిచ్చే రోజులు వస్తయి. ఊర్లె చిన్న చిన్న సమస్యలు ఉన్నయి. సీఎం కేసీఆర్‌ సారు వస్తున్నడు కాబట్టి అవన్నీ తీరిపోతయనే నమ్మకం ఉన్నది.

 • జెర్రిపోతుల బాల్‌నర్సయ్య
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనమంతా.. ఒకే కుటుంబం
మనమంతా.. ఒకే కుటుంబం
మనమంతా.. ఒకే కుటుంబం

ట్రెండింగ్‌

Advertisement