e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home యాదాద్రి గో రక్షిత రక్షిత

గో రక్షిత రక్షిత

  • మరణం అంచు నుంచి సంరక్షణ వైపు
  • ఆలనా పాలనా స్వచ్ఛంద సంస్థదే..
  • గోశాలలో 700 పైగా పశువులు
  • చల్లూరులో సహయోగ్‌ గోశాల
గో రక్షిత రక్షిత

రాజాపేట, ఏప్రిల్‌ 10 : మానవులు తన స్వార్థం కోసం మూగ జంతువులను బలి చేస్తూనే ఉన్నారు. హిందువులకు సాక్షాత్తు దేవతా స్వరూపమైన గోవులు వధశాలలకు తరలిపోతున్నాయి. మానవత్వం కరువై పశువుల ప్రాణాలను అతి కిరాతకంగా తీస్తున్నారు. మరణం అంచుల్లోకి వెళ్లిన గోవులను కాపాడుతూ వాటికి ప్రాణం పోస్తున్నారు గోసంరక్షకులు. గోవులను రక్షిస్తూ గో రక్షిత రక్షితః అంటూ గోశాలను నిర్వహిస్తున్నారు. రాజాపేట మండలంలోని చల్లూరు సహయోగ్‌ నంది గోశాల నిర్వాహకులు.

మహాలక్ష్మికి ప్రతిరూపమే గోవు
భారతీయ సంస్కృతిలో మాతకు ప్రత్యేక స్థానం ఉన్నది. గోమాతను ఎక్కడ పూజిస్తారో అక్కడ సిరి సంపదలు తులతూగుతాయని నమ్మకం. అందుకే మహాలక్ష్మికి ప్రతిరూపమే గోమాతగా కొలుస్తారు. ఏదైనా శుభకార్యం జరిపే ముందు గోవులకు పూజ చేసి ప్రారంభిస్తారు. మానవాళికి మేలు చేసే గోవులను నిత్యం పూజిస్తే ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుంది. గోవుతో సకల ప్రయోజనాలు ఉన్నాయి.

చల్లూరులో స్వచ్ఛందంగా గోశాల నిర్వహణ
రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామ శివారులో 2004 సంవత్సరంలో సహయోగ్‌ నంది గోశాలను ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన దీపక్‌ విజయ్‌ వర్గీయ నాలుగు ఎకరాల స్థలం కొనుగోలు చేసి నెలకు రూ.100 నామ మాత్రపు అద్దెకు గోశాలకు ఇచ్చారు. వీటిల్లో షెడ్లను నిర్మించి నీటి తొట్లెను ఏర్పాటు చేశారు. కపిల గోవుతో పూజలు నిర్వహించి గోశాలను ప్రారంభించారు. 11 గోవులతో మొదలై గోశాల లో నేడు 700 పైగా రక్షిస్తున్నారు. ధ్యాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో గోశాలను నిర్వహిస్తున్నారు. గోవులమేత కోసం ప్రతి నెలా రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పశుగ్రాసాన్ని మెదక్‌, గజ్వేల్‌, ఆత్మకూర్‌, మోత్కూరు, హైదరాబాద్‌ నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. రోజుకు రెండు టన్నుల పచ్చిగడ్డి, మూడు టన్నుల ఎండుగడ్డిని పశువులకు మేతగా ఇస్తున్నారు.

కబేళాలకు వెళ్లే పశువులు గోశాలకు..
పశువులను కొంత మంది పశు వధశాలకు, కబేళాలకు తరలిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న గోవులను పోలీసులు, పలు సంస్థల సభ్యులు పట్టుకొని గోశాలలకు తరలిస్తున్నారు. వివిధ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తూ మరణపు అంచుల్లోకి వెళ్లిన గోవులకు గోశాలలో ప్రాణం పోస్తున్నారు.

పశువులకు ప్రత్యేక వైద్యం
వధశాలకు అక్రమంగా తరలించే క్రమంలో ఒక్కో లారీలో సామర్థ్యానికి మించి పశువులను తరలిస్తుండటంతో పశువులకు గాయాలుకావడంతో వాటి గోస వర్ణణాతీతం. గాయాలతో గోశాలకు చేరిన వాటికి ప్రత్యేక వైద్యం అందిస్తారు. గోశాలలో గోవుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలిస్తూ రోగానికి గురైన పశువులను గుర్తించి ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు.

గోశాలలో దేశవాలీ..
గోశాలలో దేశవాలీ ఆవులను సంరక్షిస్తున్నారు. గోశాలలో వివిధ రకాలైన ఆవుల సంరక్షణ జరుగుతుంది. గిర్‌, ఒంగోలు, కాంక్రీన్‌, కపిల, జీవని, జాఫర్‌బాదీ, దేవరకొండ, ముర్ర, పుంగనూర్‌, జెర్సీ, తార్‌పార్‌కర్‌ జాతి రకాల పశువులున్నాయి.

సేంద్రియంపై రైతులకు చైతన్యం..
రసాయన ఎరువులతో పండించిన ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడంతో ప్రజలకు రకరకాల రోగాలు వస్తున్నాయి. రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియం వైపు రైతులు మొగ్గు చూపేందుకు గోశాల నిర్వాహకులు రైతుల్లో చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో రైతులకు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసి అంతరించి పోతున్న దేశవాళి గోవులను కాపాడాలని, సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు, ఎరువుల ఖర్చును తగ్గించేందుకు, గోమూత్రం పేడలో ఉన్న ఔషధ గుణాలను వివరిస్తున్నారు. అందులో భాగంగానే సన్న, చిన్నకారు రైతులకు గోశాల నుంచి ఉచితంగా ఆవులు, ఎద్దులను పంపిణీ చేస్తున్నారు. వరంగల్‌, భూపాల్‌పల్లి, జనగాం, యాదాద్రి జిల్లాల్లో రైతులకు పశువులను పంపిణీ చేస్తున్నారు.

గోవుల పెంపకంతో మేలు
గోవులు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. మూగ జీవాలను ప్రజలు తమ స్వార్థం కోసం కబేళాలలకు తరలించడం సరికాదు. గోవులను నిత్యం పూజిస్తే ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుంది. గోశాలలో ఉన్న ఆవులకు పశుగ్రాసం అందించడానికి దాతలు ముందుకురావాలి. పశువుల వసతి కోసం మరింత భూమిని ప్రభుత్వం కేటాయించాలి. గోశాలలకు ప్రభుత్వ పర ంగా సహకారం అందిస్తే మరిన్ని గోవులను పోషించవచ్చు. సహయోగ్‌ నంది గోశాలలో 700 పైగా గోవులను సంరక్షిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా పశువులను అందిస్తాం.

  • మహేశ్‌ అగర్వాల్‌, తెలంగాణ గోశాలల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు
Advertisement
గో రక్షిత రక్షిత
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement