e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home యాదాద్రి భూదాన్‌పోచంపల్లి శిగలో మరో మణిహరం

భూదాన్‌పోచంపల్లి శిగలో మరో మణిహరం

భూదాన్‌పోచంపల్లి శిగలో మరో మణిహరం

భూదాన్‌పోచంపల్లి, మార్చి 27 : గ్రామీణ పర్యాటక కేంద్రంతోపాటు మున్సిపాలిటీగా అవతరించిన పోచంపల్లికి మరో మణిహారం తోడయ్యింది. భూదానోద్యమానికి జవసత్వాలివ్వడంతోపాటు హింసారహిత ఉద్యమానికి తోడ్పాటు అందించిన పోచంపల్లి భూదాన గంగోత్రిగా మార్పు చెందింది. ఇక పోచంపల్లి ఇక్కత్‌ వస్ర్తాల రంగుల కళతో ప్రపంచ నలుమూలలా ఈ గ్రామం అనుబంధాన్ని పెనవేసుకున్నది. అంతేకాదు స్వర్గీయ భారత ప్రధాని పీవీ నర్సింహారావు ఆశల సౌధమైన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కూడా ఇక్కడే ఉండటంతో ప్రతినిత్యం ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు, దేశ విదేశీయులు వస్తూ పోతుంటారు. వారందరికీ సేద తీరడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కు శరవేగంగా పనులను పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు ఈ పార్కు సందర్శకులను, వాకర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 16 పార్కుల అభివృద్ధి
అభివృద్ధిలో శరవేగంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ నగర ప్రజలకు మంచి ఆహ్లాదాన్ని పంచడానికి అటు అటవీశాఖ అధికారులతోపాటు ఇటు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరం చుట్టు తెలంగాణ సర్కారు 16 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లో రోజురోజుకు పెరుగుతున్న భూదందాలతో అటవీ భూములు ఆక్రమణకు గురికావొద్దనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో విలువైన అటవీ భూములను సంరక్షించేందుకు కంకణం కట్టుకున్నది. దీనికితోడు నిత్యం అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతను అందించడానికి ఈ అటవీ భూమిలో భారీ పార్కులను ఏర్పాటు చేయనున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 129 అటవీ బ్లాకులను గుర్తించింది. అందులో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 16 బ్లాకుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అందులో యాదాద్రి భువనగిరిలో మూడు పార్కులు అభివృద్ధి పర్చుతుండగా, హైదరాబాద్‌లో 4, రంగారెడ్డి జిల్లాలో 9 పార్కులను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి.

ఫారెస్టు అర్బన్‌ పార్కు ప్రత్యేకత..
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్కుకు అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. పార్కు ముఖద్వారం వద్ద ఎంట్రీ ప్లాజాను గ్రామీణ అటవీ ప్రాంతాన్ని ఉట్టిపడేలా చక్కగా తీర్చి దిద్దడంతోపాటు ఇక్కడ తరుచుగా కనిపించే జాతీయ పక్షి నెమలి బొమ్మలను చక్కగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా లోపల ఇక్కడికి వచ్చే ప్రజలు సేదతీరడానికి గజబును చక్కగా ఏర్పాటు చేయడంతోపాటు మూత్రశాలలు, ప్రజలు విశ్రాంతి తీసుకునే షెడ్‌ నిర్మించారు. ఇక్కడికి నిత్యం వాకింగ్‌ చేయడానికి రెండు కిలోమీటర్ల మేర కాలి బాటలను ఏర్పాటు చేశారు. ఇక సుమారు 5 వేల మొక్కలను నాటడంతోపాటు గతంలో ఉన్న సుమారు 10వేల మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

అటవీ మొక్కలకు అధిక ప్రాధాన్యత..
ఈ అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లోని అటవీ ప్రాంతంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా సుమారు 5వేల మొక్కలను నాటారు. ఇందులో వేప, మద్ది, ఊడుగు, మర్రి, జువ్వి, మేడి, చింత, టేకు, కానుగ, వెలగ, విప్ప, వేరు మద్ది, శిశు, రావి, ఉసిరి లాంటి ఎక్కువ ఆక్సిజన్‌ను అందించే అటవీ మొక్కలతోపాటు దాన్నిమ్మ, జామ, బోగన్‌విల్లా, సైకాస్‌ లాంటి పూల మొక్కలను కూడా ఇక్కడ నాటారు.

20 ఎకరాల్లో జలాల్‌పూర్ అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్
భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్‌ గ్రామంలోని అటవీ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల్లో ఈ అర్బన్‌ ఫారెస్టు బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు. జలాల్‌పూర్‌ గ్రామ పరిసరాల్లో ఉన్న (301.90 హెకార్లు) 746 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు సమీపంలో ఉన్న అటవీ భూమిలో 20ఎకరాల స్థలంలో ఈ అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌(పార్కు)ను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం 746 ఎకరాల పరిధిలో సుమారు 16కిలోమీటర్ల మేర ఇనుప కంచె వేస్తున్నారు. పరిసర ప్రాంత ప్రజల ఆహ్లాదం కోసమే కాకుండా పర్యాటకులకు ఆట విడుపు కలిగించేలా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం నుంచి పోచంపల్లి వచ్చే మార్గంలో మంచి అందమైన అటవీ ప్రాంతంలో ఈ పార్కు ఏర్పాటు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు ఈ పార్కు త్వరలో అందుబాటులోకి రానున్నది.

రోడ్డుకు ఇరువైపులా పూర్తి కావస్తున్న ఫినిషింగ్
కొత్తగూడెం – పోచంపల్లి రోడ్డు మార్గమధ్యలో సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ అటవీ వన సంపద విస్తరించి ఉన్నది. అయితే అటవీ సంరక్షణలో ప్రభుత్వం మొత్తం అటవీ భూమిని సంరక్షించే పనిలో భాగంగా కబ్జాలకు గురికాకుండా అటవీ భూమికి పూర్తిస్థాయిలో16 కిలోమీటర్ల మేర ఇనుప కంచె వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ పనులు పూర్తి కావచ్చాయి. ఇక కేవలం రోడ్డు సైడులో రెండు వైపులా ఈ ఫినిషింగ్‌ పనులు ఊపందుకున్నాయి. అతిత్వరలో ఈ పనులు పూర్తి కానున్నాయి.

ఫారెస్టు అర్బన్‌ పార్కు ఏర్పాటు కావడం సంతోషం
గ్రామీణ పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి పట్టు చీరలు కొనడానికి ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు. కాని వారికి సేదతీరటానికి చక్కటి పార్కు లాంటిది పోచంపల్లిలో లేదు. ఇప్పుడు జలాల్‌పూర్‌లో ఆ పార్కు ఏర్పాటు కావడం ఆనందంగా ఉన్నది. మాకు కూడా ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేయడానికి వీలుగా ఉంటుంది. – దోర్నాల గణేశ్‌, భూదాన్‌పోచంపల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూదాన్‌పోచంపల్లి శిగలో మరో మణిహరం

ట్రెండింగ్‌

Advertisement