e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home యాదాద్రి మీకేం కాదని.. మేమున్నామని..

మీకేం కాదని.. మేమున్నామని..

మీకేం కాదని.. మేమున్నామని..
  • కొవిడ్‌ బాధిత కుటుంబాల్లోని చిన్నారుల కోసం జిల్లాలో రెండు ట్రాన్సిట్‌ హోమ్స్‌ ఏర్పాటు
  • సహాయం కోసం హెల్ప్‌లైన్‌ డెస్క్‌ 040 -23733665 కు ఫోన్‌ చేస్తే సరి!
  • తక్షణమే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు
  • బియ్యంతోపాటు రూ.2వేల విలువ గల నిత్యావసర సరుకుల అందజేత
  • జిల్లాలో ఇప్పటివరకు పది బాధిత కుటుంబాలకు సాయం
  • ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే.. కుటుంబంలో అందరినీ వైరస్‌ చుట్టేస్తోంది. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు హోం ఐసొలేషన్‌లో లేకుంటే దవాఖానలో ఉండాల్సి రావడంతో ఆ ఇంట్లోని పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటోంది. కరోనా కాటుకు తల్లిదండ్రును కోల్పోవాల్సి వస్తే.. వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. మహమ్మారి భయంతో బంధుమిత్రులు, ఆప్తులు సైతం చేరదీయని పరిస్థితి. ఇటువంటి దైన్య పరిస్థితులు జిల్లాలో కోకొల్లలు. ఈ నేపథ్యంలో బాల బాలికలకు వసతి కల్పించడంతోపాటు రక్షణనిచ్చి వారిని సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెం: 040 – 23733665కు గానీ.. ఛైల్డ్‌ లైన్‌ నెం:1098లు బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయి. ఫోన్‌ చేసి సహాయం కోరిన చిన్నారులకు సాయం అందించేందుకు అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుంటున్నది.

ఆపత్కాలంలో భరోసా
కరోనా మహమ్మారి కారణంగా ఛిద్రమైన కుటుంబంలోని చిన్నారులకు మేమున్నామంటూ.. తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఆపత్కాలంలో వారిని చేరదీసి తాత్కాలిక ఆశ్రయం కల్పించి భరోసా కల్పిస్తోంది. ఈ మేరకు జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో రెండు ట్రాన్సిట్‌ హోంలను ఏర్పాటు చేయగా..బాలికల కోసం వలిగొండలోని శాంతి నిలయం, బాలుర కోసం చౌటుప్పల్‌(ఎల్లగిరి)లోని ఫేత్‌ అండ్‌ వర్క్‌ బైబిల్‌ అసోసియేషన్‌లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. కరోనా బారిన పడ్డ కుటుంబాల చిన్నారులను ఆశ్రయంలో చేర్పించేందుకు వారి కుటుంబీకులు, బంధువులు అనాసక్తి చూపుతున్నారు. చాలావరకు బంధువులే చిన్నారులను చేరదీసి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఆయా చిన్నారుల ఇంటివద్దకే వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొంత బడ్జెట్‌ కేటాయింపులు సైతం జరపడంతో నెలకు సరపడా 15 కిలోల బియ్యంతోపాటు రూ.2వేల విలువగల పప్పు, నూనె ఇతర సరుకులను అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 10 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందించినట్లు అధికారులు చెప్తున్నారు.

హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ఏర్పాటు
చిన్నారులకు సాయం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సాయం కోసం 040 – 23733665 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వారు జిల్లా అధికారులకు సమాచారం ఇస్తారు. ఆ మేరకు ఇక్కడి అధికారులు తగు చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌ డెస్క్‌ పనిచేస్తుంది. ఆపదలో ఉండి రక్షణ, సంరక్షణ అవసరమైన బాల బాలికలకు 1098 చైల్డ్‌ లైన్‌ నంబర్‌కు 24 గంటల్లో ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చు.

విస్తృత ప్రచారం
జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 17న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఈ సేవలను ప్రారంభించారు. జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాల్లోనైనా సరే.. ఆపదలో ఉన్న చిన్నారులను ట్రాన్సిట్‌ హోమ్‌లకు తరలించడానికి ప్రభుత్వం ఒక వాహనాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ముమ్మరంగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడంతోపాటు ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద గోడలపై వాల్‌ పోస్టర్లను అంటించి అవగాహన పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీకేం కాదని.. మేమున్నామని..

ట్రెండింగ్‌

Advertisement