e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు గడువు.. 13 రోజులే

గడువు.. 13 రోజులే

గడువు.. 13 రోజులే
  • ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా పన్నుల వసూలు
  • ‘ఎర్లీ బర్డ్‌’ స్కీంకు విశేష స్పందన
  • పథకానికి జిల్లాలో అర్హతగల నివాసాలు 26,376
  • కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం
  • ముందస్తు చెల్లింపులు జరిపిన వారికి 5% రాయితీ

ఆస్తి పన్ను వసూలుకు పురపాలక శాఖ జిల్లాలో అమలు చేస్తున్న ‘ఎర్లీ బర్డ్‌’ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద ఈనెల 31వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీని పురపాలకశాఖ అమలు చేస్తోంది. దీని ద్వారా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా ఆస్తిపన్ను వసూలైంది. లాక్‌డౌన్‌ వల్ల పన్ను చెల్లింపుల్లో కొంత జాప్యమవుతుండగా ..ఇప్పటివరకు అత్యధికంగా భువనగిరి మున్సిపాలిటీలో రూ.58లక్షలు వసూలైంది. ఆతర్వాత రూ.38.02లక్షల వసూలుతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలిచింది. మరో 13 రోజుల గడువు ఉన్నందున మరింత ఆదాయం సమకూరుతుందని ఆయా మున్సిపాలిటీల అధికారులు అంచనా వేస్తున్నారు. యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

యాదాద్రి భువనగిరి, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపాలిటీల్లో బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్ను చెల్లింపులను ప్రోత్సహించి ఆస్తిపన్ను రాబట్టుకునేందుకు పురపాలక శాఖ ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలలో ‘ఎర్లీ బర్డ్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్‌ నెలలో జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్‌ పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ పథకాన్ని అమలు చేయగా, ఆశించిన మేరలో పన్నులు వసూలు కాకపోవడంతో ఈ నెల చివరి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మే 31వ తేదీలోపు పన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ అవకాశం కల్పించగా, ఆదివారం, సెలవు దినాల్లో సైతం సిబ్బంది అందుబాటులో ఉండి పన్ను బకాయిలు తీసుకునేలా ఆయా మున్సిపల్‌ కమిషనర్లు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.కోటికి పైగా ముందస్తు చెల్లింపులు
ఎలాంటి బకాయిలు లేకుండా గతేడాది వరకు సక్రమంగా పన్నులు చెల్లింపులు జరిపిన వినియోగదారులకు మాత్రమే ‘ఎర్లీ బర్డ్‌’ పథకం వర్తిస్తుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకానికి అర్హత గల నివాసాలు మొత్తం 26,376 వరకు ఉన్నాయి. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది పన్ను చెల్లించలేకపోయారు. దీంతో ఈ నెలాఖరు వరకు గడువును పెంచడంతో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముందస్తు పన్ను చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు రూ.కోటికి పైగా పన్నులు వసూళ్లయ్యాయి. అత్యధికంగా భువనగిరి మున్సిపాలిటీలో రూ.58లక్షలు వసూళ్లవ్వగా, అత్యల్పంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.1.10లక్షలు వసూలయ్యాయి.
క్యూఆర్‌ కోడ్‌తోనూ చెల్లింపులు..
ఆస్తి పన్ను చెల్లింపులకు ఈ ఏడాది క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకువచ్చారు. డిమాండ్‌ నోటీస్‌పై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. పన్నుదారులు మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మొబైల్‌ ద్వారా డిమాండ్‌ నోటీస్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆస్తిపన్ను వివరాలు ప్రత్యక్షమవుతాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి వ్యాలెట్‌ల ద్వారా తక్షణమే పన్ను చెల్లించవచ్చు. అలాగే రసీదును సైతం ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఆన్‌లైన్‌ చెల్లింపులవైపే మొగ్గు చూపిస్తున్నారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో ‘ఎర్లీ బర్డ్‌’ స్కీం వివరాలు
మున్సిపాలిటీ అర్హతగల వసూలు స్కీం ఉపయోగిం వచ్చిన
పేరు నివాసాలు లక్ష్యం చుకున్నవారు ఆదాయం
భువనగిరి 13,774 రూ.4.62కోట్లు 977 రూ.58లక్షలు
చౌటుప్పల్‌ 4,725 రూ.1.04కోట్లు 332 రూ.38.02లక్షలు
ఆలేరు 2,727 రూ.47.65లక్షలు 154 రూ.3.60లక్షలు
యాదగిరిగుట్ట 240 రూ.5.30లక్షలు 63 రూ.1.10లక్షలు
పోచంపల్లి 2,365 రూ.15.98లక్షలు 75 రూ.1.87లక్షలు
మోత్కూరు 2,585 రూ.29.29లక్షలు 163 రూ.2.26లక్షలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడువు.. 13 రోజులే

ట్రెండింగ్‌

Advertisement