e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home యాదాద్రి ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు

ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు

ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు
  • నచ్చిన పని.. నచ్చిన రేటుకు.. నచ్చిన కంపెనీలో చేసుకోవచ్చు
  • నైపుణ్యమే పెట్టుబడి..ఇప్పుడంతా అదే ఒరవడి
  • అదనపు సమయాన్ని వినియోగించుకునే అవకాశం
  • ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌తో చక్కటి ఆదాయం కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమాండ్‌
  • దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది ఫ్రీలాన్సింగ్‌ వర్కర్లు

సిటీబ్యూరో, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ) : అక్కడ ఎలాంటి ఆఫీసు ఉండదు.. బాస్‌ కూడా ఉండడు.. అన్నీ మనమే..ఎక్కడి నుంచైనా.. ఎక్కడి వారికైనా..నచ్చిన సమయంలో..నచ్చిన పనిని.. నచ్చిన రేటుకు, నచ్చిన కంపెనీకి చేసుకోవచ్చు. వినడానికి కొత్తగా ఉన్నా ఇది అక్షరాల నిజమే. అదే ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌. ఇప్పటికే ప్రపంచదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ వర్క్‌ కల్చర్‌. ఇప్పటికే మన దేశంలోనూ ఉన్నది. అయితే అది కొంత మొత్తమే. కొన్ని రంగాలకే పరిమితమైంది. కానీ గతేడాది నుంచి కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఊహించని రీతిలో ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాలకు డిమాండ్‌కు పెరుగుతున్నది. అదీగాక ఇప్పటికే కొన్ని విభాగాలకే పరిమితమైన ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌ కల్చర్‌ ప్రస్తుతం ఇతరత్రా రంగాలకు విస్తరిస్తున్నది.

విభాగాలు ఇవీ..
ఇప్పటివరకు సాధారణంగా ఈ ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌కు సంబంధించి ఎక్కువగా డీటీపీ, డేటా ఎంట్రీ, టెలీకాలర్‌ తదితర విభాగాలే ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఇందులో ఫొటోషాప్‌, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌, వెబ్‌ డిజైనింగ్‌, టీచింగ్‌, ట్యూటరింగ్‌, కంటెంట్‌ రైటప్‌, కాపీ రైటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, 3డీ మోడలింగ్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, ట్రాన్సలేషన్‌, ట్రాన్‌స్క్రిప్షన్‌, ఫొటోగ్రఫీ, ఆర్టికల్‌ అండ్‌ బ్లాగ్‌రైటింగ్‌ ఇలా ప్రస్తుతం సుమారు 100కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో పలు చిన్నచిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు సైతం తమ ప్రాజెక్టులను ఫ్రీలాన్స్‌ వర్కర్లతోనే పూర్తి చేయించుకుంటుండడం విశేషం. ఈ ఫ్రీలాన్సింగ్‌ వర్కర్లకు విదేశాల నుంచే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.

- Advertisement -

అంత సులువేం కాదు..
ఫ్రీలాన్స్‌ వర్క్‌ చెప్పుకున్నంత సులువేం కాదు. దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే ఫ్రీలాన్సర్‌గా వర్క్‌ చేయాలని భావిస్తే ముందుగా వారు కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యం పొందిన సైట్లలో అప్‌వర్క్‌, 99డిజైన్స్‌, ట్రూలాన్సర్‌, ఫ్రీలాన్స్‌ ఇండియా, టాప్‌టాల్‌ వంటి కొన్ని ముఖ్యమైన సైట్లు ఉన్నాయి. ఆయా వెబ్‌సైట్లలో మన విద్యార్హతలు, ఏ రంగంలో సేవలు అందించాలనుకుంటున్నాం, పని వేళలు ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రీలాన్స్‌ వర్క్‌కు అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా ఆయా సైట్లు ఒక నిర్ణీత పనిని వేలం వేస్తుంది. ఎన్ని రోజుల్లో, ఎంత మొత్తానికి ఆ పనిపూర్తి చేయగలరనే బిడ్లను స్వీకరిస్తుంది. ఉదాహరణకు ఒకరు యాప్‌ను తయారు చేయించుకోవాలని నిర్ణయించుకుంటే తన బడ్జెట్‌ను, అందులో ఉండాల్సిన ఫీచర్లను, ఏ సమయంలోగా కావాలనుకుంటున్నారో అన్ని వివరాలు తెలుపుతూ సైట్‌లో వెల్లడిస్తారు. దీంతో ఆ సైట్‌లో రిజిస్టర్‌ అయిన ఫ్రీలాన్స్‌ వర్కర్లు బిడ్లను దాఖలు చేస్తారు. వాటిని పరిశీలించిన అనంతరం తనకు నచ్చిన వ్యక్తికి ఆ వ్యక్తి తన ప్రాజెక్టును అప్పగిస్తాడు. నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తిచేస్తే అందుకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. అయితే కొన్ని ఫ్రీలాన్సింగ్‌ సైట్లు తమ సైట్‌లో రిజిస్టర్‌ అయిన ఫ్రీలాన్స్‌ వర్కర్లకు వచ్చే దాంట్లో కమీషన్‌ తీసుకుంటే, కొన్ని మాత్రం ఎలాంటి కమీషన్‌ తీసుకోకుండా సేవలందిస్తున్నాయి.

కరోనాతో పెరుగుతున్న క్రేజీ
నిన్నమొన్నటి వరకు ఫ్రీలాన్స్‌ వర్క్‌ చేసేందుకు కొంతమంది మాత్రమే ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం విపరీతమైన క్రేజ్‌ పెరుగుతున్నది. యువతనే కాకుండా మహిళలు, మధ్యవయస్కులు సైతం ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌పై మొగ్గుచూపుతున్నారు. అందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇంటి నుంచి వర్క్‌ చేసే అవకాశముండడం, ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోవడం, నిర్ణీత పనిగంటలు లేకపోవడం, నైపుణ్యాలను సొంతంగా మరింత మెరుగుపరుచుకునే అవకాశముండడం వల్లనే చాలామంది ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అదీగాక ఇప్పటికే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా అదనపు ఆదాయం కోసం, తమ తీరిక సమయాన్ని ఫ్రీలాన్స్‌ వర్క్‌ కోసం వెచ్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 15లక్షల మందికిపైగా ఫ్రీలాన్స్‌ వర్కర్లు ఉండగా, కరోనా ప్రారంభమైన తరువాత ఈ రంగం ఏకంగా 46 శాతం వృద్ధి సాధించిందని పయోనీర్‌ సంస్థ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు
ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు
ఆఫీస్‌ లేదు.. బాస్‌ ఉండడు

ట్రెండింగ్‌

Advertisement