e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home యాదాద్రి ఆరో రోజూ.. అంతా ఇంట్లోనే..

ఆరో రోజూ.. అంతా ఇంట్లోనే..

ఆరో రోజూ.. అంతా ఇంట్లోనే..
  • జిల్లాలో కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌
  • ఇండ్లల్లోనే ఉంటున్న జిల్లా ప్రజానీకం
  • చెక్‌పోస్టులు, ప్రధాన రోడ్లపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు

యాదగిరిగుట్ట రూరల్‌, మే 17 : కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం కొనసాగింది. యాదగిరిగుట్ట పోలీసులు అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జానకీరెడ్డి చెప్పారు.

యాదాద్రిలో…
యాదాద్రి, మే 17 : సెకండ్‌ వేవ్‌ కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ సోమవారానికి ఆరవ రోజుకు చేరింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బయటకు వస్తున్నారు. అనంతరం ఇంటికే పరిమితమవుతున్నారు. రోడ్డుపైకి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి, అనుమతులు ఇస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వాహనాలకు జరిమానాలు విధించారు.

ఆలేరు టౌన్‌లో…
ఆలేరు టౌన్‌, మే 17 : ఆలేరు పట్టణంలో 6వ రోజు సోమవారం కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలవుతుంది. అన్ని వర్గాల వారు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. 10 దాటాక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనమంతా ఇండ్లకే పరిమితమవుతున్నారు.

బీబీనగర్‌లో…
బీబీనగర్‌, మే 17 : తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నదని ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం సాగిస్తున్న 20మంది వాహనదారులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 17 : కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సోమవారం ప్రశాంతంగా, స్వచ్ఛందంగా కొనసాగింది. లాక్‌డౌన్‌ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారడంతోపాటు వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. సడలింపు సమయంలోనే ప్రజలు సరుకులను కొనుగోలు చేసి లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించారు.

మోత్కూరు, గుండాల మండలాల్లో…
మోత్కూరు, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సోమవారం మోత్కూరు, గుండాల మండలాల్లో ప్రశాంతంగా జరిగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో, గుండాల మండల కేంద్రంలో సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలను వ్యాపారులు తెరిచి ఉంచారు. గ్రామాల్లోని ప్రజలు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం వచ్చి బారులుతీరి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వెళ్లకుండా టీవీల ఎదుట కాలక్షేపం చేస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు స్థానిక వ్యాపారి సోమఅశోక్‌ మధ్యాహ్న భోజనం అన్నదానం నిర్వహించారు. ఎస్సై జి.ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.

సంస్థాన్‌నారాయణపురంలో…
సంస్థాన్‌నారాయణపురం, మే 17 : కరోనా నివారణకు చేపట్టిన లాక్‌డౌన్‌ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 6 గంటలకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచి 10 గంటలకు వ్యాపారులు మూసివేశారు. పది తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో చెక్‌పోస్టు వద్ద వాహనాల తనఖీలు నిర్వహించారు.

తుర్కపల్లిలో…
తుర్కపల్లి, మే 17 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో సోమవారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6గంటలకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను వ్యాపారులు తెరిచి 10 గంటలకు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక చౌరస్తాలో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు చలానాలు విధించారు.
రాజాపేటలో..
రాజాపేట, మే 17 : కరోనా కట్టడికి తలపెట్టిన లాక్‌డౌన్‌ సోమవారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు తెరిచిన దుకాణాలు 10 గంటలకు మూసివేశారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో జన సంచారం లేక వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండలంలో లాక్‌డౌన్‌ పక్కాగా కొనసాగుతుందని ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
అడ్డగూడూరులో…
అడ్డగూడూరు, మే 17 : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. ప్రజలు కూడా బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.
రామన్నపేటలో…
రామన్నపేట, మే 17 : ప్రభుత్వం నిర్వహించిన లాక్‌డౌన్‌తో ఉదయం 10 గంటలకు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరిగే సంత లాక్‌డౌన్‌ కారణంగా జరగలేదు. పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్‌ఐ చంద్రశేఖర్‌ వాహనాల తనిఖీ నిర్వహించారు.
మోటకొండూర్‌లో…
మోటకొండూర్‌, మే 17: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌ మండల వ్యాప్తంగా సోమవారం కొనసాగింది. దీంతో గ్రామాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సడలింపు సమయంలో తప్ప ప్రజలు బయటకు రాలేదు. లాక్‌డౌన్‌ ప్రక్రియను నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి లాక్‌డౌన్‌పై అవగాహన కల్పించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరో రోజూ.. అంతా ఇంట్లోనే..

ట్రెండింగ్‌

Advertisement