e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home యాదాద్రి లాక్‌డౌన్‌కు అన్నివర్గాల నుంచి విశేష స్పందన

లాక్‌డౌన్‌కు అన్నివర్గాల నుంచి విశేష స్పందన

లాక్‌డౌన్‌కు అన్నివర్గాల నుంచి విశేష స్పందన
  • ఇండ్లకే పరిమితమైన జిల్లా ప్రజానీకం
  • 11 బస్సులు మినహా.. మిగతావన్నీ డిపోకే పరిమితం
  • నిర్మానుష్యమైన రోడ్లు.. నిలిచిపోయిన ప్రజా రవాణా
  • అనుమతులు ఉన్నప్పటికీ జాతీయ రహదారులపై తగ్గిన వాహనాల రాకపోకలు
  • దర్శనాల రద్దుతో బోసిపోయిన యాదాద్రి ఆలయ ప్రాంగణాలు
  • లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించిన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • సరిహద్దుల్లో 13 చోట్ల చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీస్‌ శాఖ
  • 300 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ..
  • ఎప్పటికప్పుడు సమీక్షించిన డీసీపీ నారాయణ రెడ్డి

యాదాద్రి భువనగిరి, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 12 నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడంతో జిల్లా యం త్రాంగం తమదైన వ్యూహంతో ముందుకు సాగారు. తెల్లవారుజామున 6 నుంచి 10 గంటల వరకు లాక్‌ డౌన్‌ సడలింపునిచ్చిన ప్రభుత్వం ఉదయం 10 నుం చి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 20 గంటలపాటు పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి రోజైన బుధవారం లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేశారు. లాక్‌డౌన్‌ గురించి ఒక రోజు ముందుగానే విస్తృతంగా ప్రచారం చేయడంతో ఎవరూ బయటకు వచ్చేందుకు సాహసించలేదు. కొందరు బయటకు వచ్చినా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇండ్లకు పంపించారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన 10 గంటల నుంచే రోడ్లపైకి ఎవరూ రాలేదు. రోజూ కిటకిటలాడే ప్రాంతాలు మార్కెట్లు, రైతు బజార్లు జన సందోహం లేక వెలవెలబోయి కనిపించాయి. మంగళవారమే నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చుకున్న ప్రజానీకం ఇండ్లకే పరిమితమయ్యారు. యాదాద్రి లక్ష్మీనారసింహుడి దర్శనాలను నిలిపివేస్తూ ఆలయ అధికారులు ముందుగానే ప్రకటన చేయడంతో బుధవారం యాదాద్రికి భక్తులు రాలేదు. దీంతో ఆలయ పరిసరాలన్నీ బోసిపోయి కన్పించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తించారు.

స్తంభించిన రవాణా వ్యవస్థ..
చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో ప్రజా రవాణా కోసం బస్సులను నడపాల్సిన అవసరం కూడా రాలేదు. దీంతో యాదాద్రి డిపో నుంచి కేవలం 11 బస్సులను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్లగొండ, తిరుమలగిరి, భువనగిరి రూట్లలో మాత్రమే నడిపారు. జాతీయ రహదారులపై రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ బుధవారం రాకపోకలు అంతగా సాగలేదు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం 22వేల వరకు వాహనాల రాకపోకలు ఉంటాయి. అయితే బుధవారం లాక్‌డౌన్‌ ప్రభావంతో 7వేల వాహనాలకు మించి వెళ్లలేదు. అలాగే హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపైన కూడా ప్రతిరోజూ 16వేలకు పైగా వాహనాల రాకపోకలు ఉంటుండగా, బుధవారం మాత్రం 8,500 వాహనాలు మాత్రమే వెళ్లినట్లు బీబీనగర్‌ టోల్‌గేట్‌ నిర్వాహకులు తెలిపారు. బుధవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో యాదగిరి గుట్ట డిపో అధికారులు బస్సుల వేళల్లో మార్పులు చేశారు.

అత్యవసర సేవలు మినహా సకలం బంద్‌..
పట్టణ ప్రజలతోపాటు పల్లె ప్రజానీకం సైతం లాక్‌డౌన్‌ను నిక్కచ్చిగా పాటించారు. అత్యవసర సేవలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, మెడికల్‌ షాపులు తదితర వాటిని మాత్రమే తెరిచి ఉంచారు. ప్రధాన రహదారులపై ఉన్న దుకాణాలతోపాటు చిన్న చిన్న సందుల్లో ఉండే దుకాణాలను సైతం బంద్‌ చేశారు. దీంతో ఉదయం నుంచే గల్లీల్లో నిర్మానుష్య వాతావరణం కన్పించింది. అత్యవసరమైతే తప్ప వ్యవసాయ పనులకు సైతం చాలా మంది రైతులు వెళ్లక ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని రంగాలు లాక్‌డౌన్‌ కావడంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. శుభ కార్యాలను సైతం ముందస్తుగానే రద్దు చేసుకోవడంతో ఎక్కడా ఆ సందడి కన్పించలేదు.

పోలీస్‌ శాఖ పటిష్ట వ్యూహం..
జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీస్‌ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మొదటి రోజు లాక్‌డౌన్‌ జిల్లాలో విజయవంతమైంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు డీసీపీ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ భువనగిరి పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా సరిహద్దుల్లో, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్‌శాఖ 13 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రతి చెక్‌ పోస్టు వద్ద 20 మంది సిబ్బందిని ఉంచి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి భువనగిరి, ఆలేరు, వలిగొండ, చౌటుప్పల్‌ ప్రాంతాలలో పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించడంతోపాటు బందోబస్తుపై కిందిస్థాయి అధికారులతో సమగ్రంగా చర్చించి అప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌కు అన్నివర్గాల నుంచి విశేష స్పందన

ట్రెండింగ్‌

Advertisement