e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం

ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం

ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం
  • పదిరోజులపాటు పకడ్బందీగా సాగిన పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు
  • స్వచ్ఛందంగా ‘ప్రగతి’ కార్యక్రమాల్లో పాల్గొన్న పల్లె, పట్టణ జనం.. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం
  • చేయిచేయి కలిపి చైతన్యం నింపిన అధికారులు, ప్రజాప్రతినిధులు
  • రోజుకోచోట కార్యక్రమాల్లో పాలుపంచుకున్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
  • పల్లెలు, పట్టణాల్లో పదిరోజులపాటు నెలకొన్న సందడి వాతావరణం

జిల్లాలో మొత్తం గ్రామపంచాయతీలు : 421
గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజానీకం : 18,700 మంది
శ్రమదానంలో పాల్గొన్న పల్లె జనం : 40,257 మంది
శుభ్రపర్చిన పల్లె రోడ్లు : 9,709 రోడ్లు
రోడ్లపై పూడ్చిన గుంతలు : 1,378 గుంతలు
మూసేసిన నిరుపయోగ బోరు, బావులు : 227
శుభ్రం చేసిన ప్రభుత్వ సంస్థలు : 1,908
శుభ్రం చేసిన మురుగు కాల్వలు : 371
శుభ్రపర్చిన తాగునీటి వనరులు : 1,403
కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు : 540
ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలు : 7,73,654
వివిధ కమ్యూనిటీ, ఇనిస్టిట్యూషన్‌లలో నాటిన మొక్కలు : 73,531
వినియోగంలోకి తెచ్చిన వైకుంఠధామాలు : 325
బయో ఫెన్సింగ్‌ చేపట్టిన వైకుంఠధామాలు : 146

పదిరోజుల పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పంచాయతీలు, మున్సిపాలిటీల రూపురేఖలను మార్చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేశారు. ఊరూ.. వాడల్లో నాటిన మొక్కలతో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరిసింది. చెత్త తరలింపుతో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. ‘ప్రగతి’ కార్యక్రమాల కోసం ప్రభుత్వం కలెక్టర్‌కు రూ.కోటి, అదనపు కలెక్టర్‌కు రూ.25లక్షలను ముందుగానే కేటాయించింది. గతంలో చేపట్టిన ‘ప్రగతి’ కార్యక్రమాలు గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా సత్ఫలితాలు ఇవ్వగా.. తాజాగా నిర్వహించిన ‘ప్రగతి’ పనులతో సందడి నెలకొని ప్రతీ పల్లె, పట్టణం కొత్తకాంతులను సొంతం చేసుకున్నాయి.

- Advertisement -

యాదాద్రి భువనగిరి, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం జూలై 1 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని 421 పంచాయతీల్లో పల్లె ప్రగతిని, 6 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టింది. విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతోపాటు గ్రామ, పట్టణ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేలా పదిరోజుల ప్రణాళికను రూపొందించి పకడ్బందీగా అమలు చేసింది. తొలిరోజు గ్రామ సభలను నిర్వహించి వార్షిక ప్రణాళిక, పంచాయతీల ఆదాయ వ్యయాలు ప్రజల ముందుంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రభుత్వం పెంపొందించే ప్రయత్నం చేసింది. అవగాహన ర్యాలీలు నిర్వహించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి పెద్దఎత్తున హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి ఇంటి ఆవరణాల్లో పెంచుకునేలా ప్రజలను చైతన్యపర్చారు. రెండో రోజు ‘డ్రే’ డేగా పాటించి మురుగు కాల్వలను శుభ్ర పర్చడం, గుంతలలో మురుగునీరు లేకుండా మట్టి పోయడం, ఇండ్ల మధ్యన పెరిగిన ముళ్ల పొదలను తొలగించడంతోపాటు పెంట కుప్పలు, చెత్తా చెదారం తొలగింపు వంటి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. మూడో రోజు ‘పవర్‌’డేగా పాటించి విద్యుదీకరణ పనులను ముమ్మరంగా చేపట్టారు. విరిగిన, శిథిలమైన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, ఇంటర్మీడియట్‌ పోల్స్‌ ఏర్పాటు, వేలాడుతున్న వైర్లను సరి చేయడం, ఎల్‌ఈడీ లైట్లు, థర్డ్‌ వైర్‌, మీటర్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టి చాలా వరకు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. వీటితోపాటు శిథిలమైన ఇండ్లను కూల్చివేయడం, పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాల చుట్టూ బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు ఇంకా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
ప్రజలతో మమేకమై ఉత్సాహంగా..
గ్రామస్థాయి మొదలుకుని జిల్లాస్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పది రోజుల ‘ప్రగతి’ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచాయతీల్లో ఎం పీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు, మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు సైతం పాలు పంచుకున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకుని జిల్లాస్థాయి అధికారుల వరకు రోజువారీగా పనుల తీరును పర్యవేక్షించారు. కలెక్టర్‌ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ, డీపీవో సాయిబాబా, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ఇతర జిల్లాస్థాయి అధికారులు పల్లెల్లో పర్యటించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ నియమించారు. అలాగే మూడు, నాలుగు పంచాయతీలకు ఒక అధికారిని, మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఒక అధికారిని పర్యవేక్షణకోసం ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ‘పల్లె నిద్ర’ వంటి కార్యక్రమాలను చేపట్టి స్థానిక ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకుని అధికారులు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలో పది రోజులుగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతికి..ఊరూ-వాడల్లో పరుచుకున్న పచ్చదనం, మెరుస్తున్న పరిశుభ్రత ప్రణమిల్లుతున్నాయి.

పది రోజుల ప్రగతి ఫలాలు ఇవిగో..

జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతిలో భాగంగా 2,322 మురుగు కాల్వల్లో పూడిక తీయాలని గుర్తించి 2,258 కాల్వల్లో పూడికను తొలగించారు. 3,798 ప్రాంతాలకు గాను 3,732 ప్రాంతాల్లో సర్కారు చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. 2,633 ఖాళీగా ఉన్న ప్లాట్లు, కామన్‌ ఏరియాలను గుర్తించి 2,514 ప్లాట్లు, కామన్‌ ఏరియాల్లో పరిశుభ్రతా చర్యలను చేపట్టారు. 1,515 ముంపు ప్రాంతాలను గుర్తించి 1,378 చోట్ల మొరంతో గుంతలు పూడ్చారు. అలాగే దోమల వ్యాప్తి జరిగే 3,383 ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్‌ పౌడర్‌ ఇతర నివారణ చర్యలు తీసుకున్నారు. 371 కాల్వలను శుభ్రపర్చడంతోపాటు 716 అంగన్‌వాడీ కేంద్రాలను, 412 ప్రాథమిక పాఠశాలలను, 79 ఉన్నత పాఠశాలలను, 148 ఆరోగ్య కేంద్రాలను, 573 కమ్యూనిటీ హాల్స్‌లో పారిశుధ్య చర్యలను చేపట్టారు. వీటితోపాటు అంగల్లు, బస్‌స్టాండ్స్‌, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలను పకడ్బందీగా చేపట్టారు. 1,403 తాగునీటి వనరులను శుభ్రపర్చడంతోపాటు 1,321 ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేపట్టారు. 750 వాటర్‌ పైపులైన్ల లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. 81 పని చేయని పాడైపోయిన బోర్‌వెల్స్‌తోపాటు 146 పాత బావులను గుర్తించి పూడ్చి వేసేందుకు చర్యలు తీసుకున్నారు. 1,132 వేలాడే విద్యుత్‌ వైర్లను గుర్తించి 625 తీగలను సరి చేశారు. 1,527 తుప్పుపట్టిన విగిరిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించి 540 ఏర్పాటు చేయడంతోపాటు 2,301 స్తంభాలకు థర్డ్‌వైరును ఏర్పాటు చేశారు. 950 తాగునీటి వనరులకు విద్యుత్‌ మీటర్లను అమర్చేందుకు గుర్తించి 565 మీటర్లను అమర్చారు. పదిరోజుల ప్రగతి పనుల్లో భాగంగా మొత్తం 40,257 మంది శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ 6 మొక్కల చొప్పున 7,73,654 మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ సభల్లో మొత్తం 18,700 మంది ప్రజలు పాల్గొన్నారు. 9,709 రోడ్లను శుభ్రపర్చేందుకు చర్యలు తీసుకున్నారు. 325 వైకుంఠధామాలను వినియోగంలోకి తేగా..146 చోట్ల బయో ఫెన్సింగ్‌ చేపట్టారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 90,256 మొక్కలను నాటారు. ఇనిస్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ కింద 6,480 మొక్కలను, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా 67,051 మొక్కలను నాటారు. 423 పల్లె ప్రకృతి వనాలకు గాను 412 వనాల్లో ప్లాంటేషన్‌ చేపట్టారు. రూ.20,116 దాతల నుంచి విరాళాల రూపంలో వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం
ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం
ఫ‌లించిన ప్ర‌గ‌తి మంత్రం

ట్రెండింగ్‌

Advertisement