యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మంటలు క్షణాల్లో వ్యాప్తి చెంది స్పందించే లోపే ఘోరం జరిగే అవకాశం ఉంది. ఆస్తినష్టంతో పాటు కొన్ని సమయాల్లో ప్రాణనష్టం కూడా తప్పకపోవచ్చు. వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండే అవకాశం ఉ న్నందున తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
జాగ్రత్తలు అవసరం..
చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇతర మండే పదార్థాలు అందుబాటులో ఉంచొద్దు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్ల లు ఆర్పకుండా అజాగ్రత్తగా పారేయవద్దు. వంటింటి కింద, పై భాగాల్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. సిలిండర్‌కు పాడైన గ్యాస్ ట్యూబ్‌ను తొలగించి ఐఎస్ఐ మార్కు ఉన్న కొత్త ది మార్చుకోవాలి. సిలిండర్ వాడకం పూర్తయ్యాక రెగ్యులేటర్ వాల్వ్‌ను ఆపేయాలి. ఇండ్లల్లో వాడే ఏసీలు ఓవర్‌లోడ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని వైరింగ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లుతూ దుప్పటి చుట్టుకోవాలి. బడులు, దవాఖానలు, దుకాణా సముదాయాల్లో ఆర్సీసీ, కాంక్రీట్ స్లాబ్‌లను మాత్రమే పైకప్పుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. పరిశ్రమల వద్ద తగినంత నీరు, ఇతర అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి. వాహనాల్లో వస్తువులు ఎత్తడం, దించడం లాంటి సమయాల్లో ఇంజన్లను బంద్ చేయాలి. ఇండ్లకు 60 అడుగుల దూరంలో గడ్డివాములు ఉండాలి. చిన్న చిన్న గడ్డివాములను మధ్యమధ్యలో ఖాళీ స్థలం ఉంచుకుంటూ ఏర్పాటు చేసుకోవాలి. వాహనాల్లో గడ్డిని తీసుకువెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలి.
అందుబాటులో ఫైర్ ఇంజన్లు
జిల్లాలో ఫైర్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గతం లో భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట ఔట్‌పోస్టులు ఉండ గా, మూడు సంవత్సరాల క్రితం నూతనంగా ఆలేరు, మోత్కూ రు, యాదగిరిగుట్టలో కూడా ఫైర్స్టేషన్లు ఏర్పాటయ్యాయి. దీని వల్ల ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే సంఘటన స్థలానికి వీలైనంత త్వరగా వచ్చి మంటలను అదుపులోకి తీసుకువస్తారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగక ముందే అక్కడికి చేరుకుంటున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ప్రమాదవశాత్తు కంచె దగ్ధమైతే యాదగిరిగుట్ట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అప్రమత్తత చాలా అవసరం
వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఉంటుంది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇండ్ల ల్లో సిలిండర్లు ఆర్పి వేసే సమయం లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పరి శ్రమల దగ్గర కార్మికులు సైతం అప్ర మత్తంగా ఉండాలి. ఖాళీ ప్రదేశాలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద సిగరెట్లు పూర్తిగా ఆర్పి పడేయాలి. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచా రం అందించాలి.
-పి. జయకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి,యాదాద్రి భువనగిరి
ఇవీ కూడా చదవండీ…
రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ ఉండదు : మంత్రి ఈటల
కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు.. తగ్గని కరోనా కేసులు
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం