e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు సేవకులకు సలాం

సేవకులకు సలాం

సేవకులకు సలాం

ఆపదొస్తే మొదట ‘108’ కే కాల్‌ l అనుక్షణం అప్రమత్తంగా ఉండే యోధులు
ఆపత్కాలంలోనూ మేమున్నామంటూ భరోసా
దవాఖానకు చేర్చి మెరుగైన వైద్యం అందించడమే కర్తవ్యంగా సిబ్బంది విధులు
క్లిష్టసమయంలో అందిస్తున్న సేవలతో వెల్లువెత్తుతున్న ప్రశంసలు
సేవలను మరింత బలోపేతం చేసిన తెలంగాణ ప్రభుత్వం
జిల్లాలో 11 అంబులెన్స్‌లు.. 47 మంది నిర్విరామంగా సేవలు

యాదాద్రి భువనగిరి, జూన్‌ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఎవరో ఒకరు.. ఏదో ఒకచోట సాయం కోసం ఎదురు చూస్తున్న సందర్భాలు కోకొల్లలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని.. అత్యవసర వైద్యం అవసరమైన వారిని దవాఖానలకు తరలించి వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా 108 సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుతున్న గర్భవతులకు ఆపద్బాంధవులుగా మారుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనంలోనే పురుడు పోసి కొండంత అండగా నిలుస్తున్నారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధితులను అత్యవసర వైద్యం కోసం దవాఖానలకు తరలించి ప్రాణాలను నిలపడంలో సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్‌, బీబీనగర్‌, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట ప్రాంతాల్లో 11వాహనాలను అందుబాటులో ఉంచి రెండు షిఫ్ట్‌లలో ప్రశంసయమైన సేవలను సిబ్బంది అందిస్తున్నారు.
భయంతో విధులు నిర్వహిస్తున్నా..
భువనగిరి అర్బన్‌, జూన్‌ 7 : కరోనా భయంతో విధులు నిర్వహిస్తున్నాను. ఒక పేషెంట్‌ను తరలించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. భయం అని తెలిసి కూడా విధులకు వెళ్తున్నా. అయినా భయంతోనే ఉంటున్నా. కానీ గతంలో కన్నా ప్రస్తుతం విధులు నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కష్టకాలంలో మనుషులకు సేవ చేయడంలో ఉన్న సంతోషం మరెక్కడా దొరకదు. విధులు నిర్వహించి ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలకు దూరంగా ఉంటున్నా. వారిని దగ్గరకు ఆప్యాయతగా తీసుకోలేక ఎంతో మనస్తాపానికి గురవుతున్నా. కానీ విధులు నిర్వహించడం బాధ్యతగా తీసుకుంటున్నా.
విశ్వం, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌, భువనగిరి
ఫోన్‌ రింగైతే భయం వేస్తుంది..

భువనగిరి అర్బన్‌, జూన్‌ 7: ప్రస్తుత పరిస్థితిల్లో ఫోన్‌ రింగైతే భయం వేస్తుంది. కరోనా పేషెంట్‌ను తరలించాలని ఫోన్‌ వస్తే మరొకరు కరోనా బారిన పడ్డారని బాధగా అనిపిస్తుంది. ఇబ్బందులున్న వెంటనే చెప్పిన ప్రాంతానికి వెళ్లి వారిని దవాఖానకు చేర్చుతున్నా. కరోనా పేషెంట్‌ను తరలిస్తుంటే ఎంతో బాధగా ఉంటుంది. వారిని తరలించే సమయంలో మాస్కులు, గ్లౌజులు, వేసుకుంటా. వారు త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటా. గతంలో ఎమర్జెన్సీ పేషెంట్లు చాలా తక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం రోజు రావడంతో విధులను ఎంతో అప్రమత్తంగా నిర్వహిస్తున్నా.
రాకేశ్‌, 108 పైలెట్‌ డ్రైవర్‌, భువనగిరి
కరోనా బాధితుల ప్రాణ రక్షణే ధ్యేయం

వలిగొండ, జూన్‌ 7 : ప్రతి క్షణం కరోనా బాధితుల ప్రాణ రక్షణే ధ్యేయంగా 108 అంబులెన్స్‌ వాహనంలో పని చేస్తున్నాను. కరోనా బాధితులను అత్యవసర చికిత్స కోసం తరలిస్తున్నప్పుడు పీపీఈ కిట్లు ధరించి అనేక జాగ్రత్తలు తీసుకొని సేవలందిస్తాం. కరోనాతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్షణే ప్రథమ కర్తవ్యంగా చికిత్స అందిస్తాం. గంటల కొద్దీ పీపీఈ కిట్లు వేసుకోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విధి నిర్వహణలో తప్పదు. కరోనా రోగులను, ఇతరులను 108 వాహనంలో తరలించి దవాఖానల్లో చేర్చిన తర్వాత అంబులెన్స్‌ వాహనాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేసి, పీపీఈ కిట్లను తీసేసి వేడి నీటితో స్నానం చేసి పూర్తిగా శానిటైజ్‌ చేసుకున్నా గానీ ఇంట్లో కుటుంబ సభ్యులను కలువాలంటే కొంత భయంగా ఉంటుంది.

నల్ల సాలయ్య, అత్యవసర మెడికల్‌ సాంకేతిక సేవకుడు, 108, వలిగొండ
ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నాను..

రామన్నపేట, జూన్‌ 7 : నేను 108లో 14ఏండ్లుగా పని చేస్తున్నాను. కరోనా సమయంలో రోజు మూడు నుంచి నాలుగు కరోనా కేసులను వివిధ దవాఖానలకు చేర వేస్తున్నాను. కరోనా పాజిటివ్‌ అని తెలిసినా ధైర్యంగా పీపీఈ కిట్‌ను వేసుకొని వారికి ముందస్తుగా బీపీ, పల్స్‌రేట్‌ను పరీక్షించి అవసరమున్న స్థాయిలో ఆక్సిజన్‌ సపోర్టు ఇచ్చి గాంధీ, ఎయిమ్స్‌, వివిధ ప్రభుత్వ దవాఖానలకు చేరవేస్తున్నాను. విధులు నిర్వహించి ఇంటికి వెళ్లినప్పుడు చిన్న పిల్లలు ఉండటంతో భయంతో ఇంటి బయటనే స్నానం చేసి నాలుగైదు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్తున్నాను. ఇటువంటి విపత్కర సమయంలో విధులను నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నాను.
సైదయ్య, ఈఎమ్‌టీ, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌
వారానికి ఒకసారి ఇంటికెళ్తున్న..

యాదగిరిగుట్ట రూరల్‌, జూన్‌ 7 : ప్రస్తుత కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్నిసార్లు వారి చేతులు పట్టుకొని మరీ వాహనంలోకి ఎక్కిస్తాను. పాజిటివ్‌ వచ్చిన వారిని కలుస్తున్న క్రమంలో వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దని, ధైర్యంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది, ఖర్చు లేకుండానే కరోనాను జయించవచ్చని చెబుతుంటా. కొంత మంది సీరియస్‌ కండీషన్‌ ఉన్న వాళ్లను తీసుకొని హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్‌ దవాఖానలకు వెళ్లాల్సి వస్తుంది. మా ఇంటికి కూడా వారానికి ఒకసారి వెళ్తున్నాను. వెళ్లినప్పుడు నేరుగా లోపలికి వెళ్లకుండా మొదట ఇంటి బయటే బట్టలను వేడినీటిలో నానబెట్టి, వేడి నీటితో స్నానం చేసి వెళ్తాను. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉన్నా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా.
రాజిరెడ్డి, 108 పైలెట్‌, యాదగిరిగుట్ట
కరోనా కాలంలో కీలక పాత్ర

సాధారణ రోజుల్లోనూ ప్రతి నిత్యం యాభైకి పైగా కేసుల్లో సేవలు అందిస్తుండగా.. కరోనా కాలంలో 108 సిబ్బంది వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు మూడు నెలల వ్యవధిలో శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న 71 మంది కరోనా బాధితులను దవాఖానలకు చేర్చారు. ఈ మూడు నెలల కాలంలో 108 సిబ్బంది మొత్తం 2,647 మందికి వైద్యం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 440 మందికి ప్రథమ చికిత్స చేసి దవాఖానకు చేర్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న 314 మంది గర్భవతులను సురక్షితంగా దవాఖానకు తరలించి తల్లీ, బిడ్డలను కాపాడారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న 48 మందిని, పురుగుల మందు తాగడం, పాము, తేలు కాటుకు గురవ్వడం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 2,174 మందిని వెంటనే దవఖానాలకు చేర్చి వైద్య సేవలు అందించారు. కరోనా పరిస్థితులకు ముందు సిబ్బంది విధులు పూర్తయిన అనంతరం ప్రతి రోజూ ఇళ్లకు వెళ్లేవారు. అయితే కుటుంబ సభ్యులకు తమ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో వారం రోజులకు ఓసారి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు.
ఫోన్‌ చేసిన వెంటనే సాయం
బాధితుల నుంచి కాల్‌ వచ్చిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలంలో ఉండేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. అవసరమైతే అక్కడే ప్రాథమిక చికిత్స చేసి అనంతరం అత్యవసర వైద్యం కోసం దవాఖానకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాణాలను కాపాడినప్పుడు సిబ్బందిలో కనిపించే సంతోషం అంతా ఇంతా కాదు. కరోనా పరిస్థితుల్లో బాధితులకు 108 అంబులెన్స్‌ల్లోనే ఆక్సిజన్‌ను అందించి ప్రాణాలను కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మహేశ్‌, 108 సర్వీస్‌ జిల్లా కోఆర్డినేటర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా
వెనుకడుగు వేయకుండా..

ఆలేరు టౌన్‌, జూన్‌ 7 : కొవిడ్‌ వచ్చినా చాలా మంది ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడేవారే అత్యవసర పరిస్థితికి వెళ్తుంటారు. ఒక్కోసారి ఆక్సిజన్‌ లెవల్‌ పడిపోతే రోగికి ఏమవుతుందోనని భయమవుతుంది. పీపీఈ కిట్లు వేసుకొని విధులు నిర్వహిస్తున్నాం. విధులు నిర్వహించేటప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. మనోధైర్యంతో విధులు చేపడుతున్నాను. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ఆందోళనగా ఉంటుంది. ఒక్కోసారి భయమేస్తుంది. ఎప్పటికప్పుడు మేము వాహనాలను సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్‌ చేస్తున్నాం. ఆక్సిజన్‌ వంటివి సిద్ధంగా ఉంచుతున్నాం.
బి.వెంకటేశ్‌, ఈఎంటీ
బాధ్యతగా భావిస్తున్నాం
ఆలేరు టౌన్‌, జూన్‌ 7 : అత్యవసర సమయంలో కొవిడ్‌ రోగులు దవాఖానలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 108 వాహనం ద్వారా వారిని తరలిస్తున్నాం. కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈఎంటీలతో సమానంగా సేవలు అందిస్తున్నాం. కరోనా పాజిటివ్‌ వ్యక్తులను దవాఖానలకు తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాం. వారి కుటుంబసభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి. కుటుంబ సభ్యులకే ధైర్యం చెప్పి దవాఖానలకు తరలిస్తున్నాం. సమాచారం అందగానే వెంటనే అక్కడికి చేరుకుంటున్నాం. కరోనా బాధితులకు సేవలు చేయడం బాధ్యతగా భావిస్తున్నాం.
ఎం.ఎల్లస్వామి, పైలెట్‌
కరోనాను జయించి..
ఆలేరు టౌన్‌, జూన్‌ 7 : కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తుంది. ఇలాంటి విపత్కర సమయంలో కూడా విధులు నిర్వహిస్తున్నాం. ఎంతో మంది కరోనా రోగులను దవాఖానలకు తరలిస్తున్నాం. గుండె నిబ్బరం చేసుకొని విధులు నిర్వహిస్తున్నా. గత ఏడాది కరోనా బారినపడ్డాను. అధైర్య పడకుండా జాగ్రత్తలు తీసుకొని మందులు వాడి కోలుకున్నాను. ఎంతో మంది కరోనా రోగులు చనిపోతున్నారు. మృతుల కుటుంబాల రోదన చూస్తే బాధ అనిపిస్తుంది. సెలవు పెట్టే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ 24 గంటలు విధులు నిర్వహిస్తున్నాం. ఎంతో మంది మా సేవలు వినియోగించుకుంటున్నారు.
వై.శంకర్‌, పైలెట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సేవకులకు సలాం

ట్రెండింగ్‌

Advertisement