ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 19, 2020 , 00:34:28

ఓటీపీ వస్తేనే.. సిలిండర్‌

ఓటీపీ వస్తేనే.. సిలిండర్‌

జిల్లాలో 2,16,257 కనెక్షన్‌లు 

ఆలేరు టౌన్‌ : యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. అయితే వంటగ్యాస్‌ సిలిండర్‌ సరఫరాలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నూతన నిబంధనలను తీసుకువచ్చింది. వంటగ్యాస్‌ పక్కదారి పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గ్యాస్‌ ఏజెన్సీలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో వినియోగదారులు ఏజెన్సీకి ఫోన్‌ చేసి బుక్‌ చేయడం, యాప్‌, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉన్నది. ఆ మేరకు డెలివరీ బాయ్‌ వినియోగదారుడి ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. ఈ విధానంలో సిలిండర్లు నల్లబజారుకు తరలించేవారు. ఇది గుర్తించిన కేంద్రం ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానంలో సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకుంటే రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్‌ వస్తుంది. డెలివరీ బాయ్‌కి వినియోగదారుడు ఆ ఓటీపీ  నంబర్‌ను ఇవ్వాలి. దాన్ని తన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌లో నమోదు చేసుకొని సిలిండర్‌ను ఇస్తాడు. దీంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫోన్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి. లేకుంటే సిలిండర్‌ డెలివరీ సాధ్యపడదు. తప్పనిసరిగా వినియోగదారులు తమ మొబైల్‌ నంబర్‌ను లింగ్‌ చేసుకోవాలని గ్యాస్‌ ఏజెన్సీలు లబ్ధిదారులను కోరుతున్నాయి. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని చమురు సంస్థల ఆలోచన. అందుకే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 

జిల్లాలో కనెక్షన్లు ఇలా...

జిల్లాలో 18 ఏజెన్సీల ద్వారా 2,16,257 గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో జనరల్‌ కనెక్షన్లు 1,67,269, దీపం కనెక్షన్లు 41,973, ఉజ్వల యోజన కనెక్షన్లు 7,015 ఉన్నాయి.


VIDEOS

logo