బుధవారం 28 అక్టోబర్ 2020
Yadadri - Sep 21, 2020 , 01:04:51

యువత మేలుకో.. ఓటరుగా నమోదు చేసుకో..

యువత మేలుకో.. ఓటరుగా నమోదు చేసుకో..

అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం 

ఓటరు జాబితా సవరణకు చర్యలు 

డిసెంబర్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఆలేరు టౌన్‌ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ఈ ఓటుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అభివృద్ధి వైపునకు నడిపించేందుకు గ్రామస్థాయిలో సర్పంచ్‌ నుంచి మొదలుకొని దేశ ప్రధానిని సైతం ఎన్నుకునే అరుదైన అవకాశం ఒక్క ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యం. దీంతో సుపరిపాలనను అందించే వారిని గద్దెనెక్కించడం.. పాలన నచ్చని వారిని గద్దెదించడం ఈ రెండు కూడా మనం వేసే ఓటుతోనే సాధ్యం. ఇందుకోసం 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితా ముసాయిదా ప్రతులు ప్రచురించారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు, పేర్లు నమోదులో తప్పొప్పులు ఉన్నా, చిరునామాను మార్పు చేసుకోవాలనుకున్నా, నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకున్నా అవకాశం కల్పించారు. దీని ప్రకారం.. 2021 జనవరి 1వ తేదీ వరకు 18 ఏండ్ల వయస్సు నిండనున్న ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులకు డిసెంబర్‌ 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నది. ఈసారి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్టోబర్‌ 31వ తేదీలోగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తయ్యాకనే ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. 

ఆన్‌లైన్‌ ఓటరు నమోదు ఇలా...

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ అంతర్జాలం కనెక్షన్‌ ఉంటే చాలు జాతీయ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేరు ఉన్నప్ప


టికీ సవరణలు చేయించుకోవాలన్నా, ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓటును మార్చుకోవాలన్నా, ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలున్నా, కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు కావాలన్నా వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే సెల్‌ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీ, పాస్వర్డ్‌ తదితర వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ కాగానే సదరు మెయిల్‌ ఐడీ, పాస్వర్డ్‌ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు నమోదుతోపాటు పైన పేర్కొన్న సేవలను పొందవచ్చు. వెబ్‌సైట్‌ : www.nvsp.in లోకి వెళ్లి మెయిల్‌ ఐడీ, పాస్వర్డ్‌ పేజీ ఓపెన్‌ చేసుకోవాలి. అందులో ఎడమ వైపు ఓటరు నమోదు, తరలింపు, సవరణలు తొలగింపు తదితర ఆప్షన్లు ఉంటాయి. అవసరమైన ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే వచ్చే పేజీలో వివరాలను పూరించి సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది. మీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వివరాలను సైతం తెలుసుకోవచ్చు. ఓటు నమోదు సవరణ, తొలగింపు తరలింపు తదితర అంశాలపై మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దానిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాలో ఓటర్లు.. 

యాదాద్రి జిల్లాలో 4,00,007 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆలేరు నియోజకవర్గంలో 2,09,265 ఓటర్లు ఉండగా, భువనగిరిలో 1,90,812 ఓటర్లు ఉన్నారు. 

ఉపయోగించే ఫారాలు

కొత్త ఓటరుగా నమోదుకు ఫారం నంబర్‌ 6 

అభ్యంతరాలపై ఫిర్యాదుకు ఫారం నంబర్‌ 7 

తప్పొప్పుల సవరణకు ఫారం నంబర్‌ 8

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కోసం ఫారం నంబర్‌ 8ఏఅందుబాటులో ప్రత్యేక పత్రాలు

భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన ప్రతి యువతీయువకులకు ఓటు హక్కును కల్పించింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలు బదిలీలు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు పలు రకాల ప్రత్యేక ఫారాలు సిద్ధం చేసింది. వీటిని ప్రాంతాల్లో బీఎల్‌ఓల వద్ద అందుబాటులో ఉంచారు. 

ముఖ్యమైన తేదీలు...

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ 2020 అక్టోబర్‌ 31లోగా ముసాయిదా ఓటర్ల జాబితా జాబితా 

ప్రదర్శన 2021 జనవరి 16 ముసాయిదా మార్పులు చేర్పులు 2020 డిసెంబర్‌ 15 వరకు 

ఓటర్ల తుది జాబితా 2021 జనవరి 15వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులు నమోదు చేసుకొని అదేరోజు సాయంత్రం ప్రకటిస్తారు. 

సద్వినియోగం చేసుకోవాలి

18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతి ఏటా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఓటు లేని వారు సద్వినియోగం చేసుకోవాలి. - శ్యామ్‌సుందర్‌రెడ్డి, తహసీల్దార్‌, ఆలేరు 

 
logo