శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Sep 21, 2020 , 01:04:38

పల్లెప్రగతితో అభివృద్ధి దిశగా గ్రామాలు

పల్లెప్రగతితో అభివృద్ధి దిశగా గ్రామాలు

సకాలంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పూర్తి     

పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలుస్తున్న పాలకవర్గం, ప్రజలు

ఆలేరు : పల్లెల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి.. ప్రగతిదిశగా ప్రతి పల్లె అడుగువేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. యాదగిరిగుట్ట మండలంలోని మైలారీగూడెంలో పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో విస్తారంగా మొక్కలను నాటడమే కాకుండా, ప్రభుత్వం సూచించిన సమయంలోపే వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పూర్తిచేసుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మండలంలోని మొత్తం 23 గ్రామ పంచాయతీలకు గానూ లప్పానాయక్‌తండా మినహా 22 గ్రామాలకు ఒక్కో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, మంజూరయ్యాయి. ఇందులో 22 వైకుంఠధామాలకు  మైలారీగూడెం పూర్తికాగా మాసాయిపేట, సైదాపురం గ్రామాల్లో తుదిదశకు చేరుకున్నాయి, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. 22 డంపింగ్‌ యార్డులకు గానూ మైలారీగూడెంలో పూర్తికాగా మరో 15 గ్రామాల్లో తుదిదశకు చేరుకున్నాయి. 

మిగతావి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందుకోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం చేసిన కృషికి సత్ఫలితాలు ఇస్తున్నాయి. వైకుంఠధామానికి కావాల్సిన ఎకరం భూమిని స్పెక్ట్రా హౌసింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అందజేయడంపై సర్పంచ్‌ కాదురి రజితాశ్రీశైలం, ఉప సర్పంచ్‌ మారెడ్డి కొండల్‌రెడ్డి, పంచాయతీపాలకవర్గం, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.