బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 26, 2020 , 01:11:54

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఊంజల్‌ సేవ పర్వాలను అర్చకులు శాస్ర్తోక్తంగా చేపట్టారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచి శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన జరిపించి, సుగంధ ద్రవ్యాలు, శుద్ధజలం, ఫలరసాలతో అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు.

వైభవంగా నిత్యపూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఆగమశాస్త్రం ప్రకారం జరిగాయి. ఉదయం సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. తులసీ పత్రాలతో ఘనంగా అర్చన చేశారు. మంటపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, విశ్వక్సేనారాధన, నిత్యకల్యాణ పర్వాలు వైభవంగా కొనసాగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అనంతరం శ్రీస్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహహోమం, ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొని పాల్గొన్న భక్తుల గోత్రనామాలపై పూజలను చేశారు. 

వివిధ పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి హారతితో స్వాగతం పలికి, మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 2,15,694 ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.2,15,694 సమరికూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 2,700, ప్రసాదవిక్రయాలతో రూ. 1, 74,300, వాహనపూజల ద్వారా రూ. 4,500, మినీ బస్సులతో రూ. 1,310, అన్నదాన విరాళంతో రూ. 3,382, కొబ్బరికాయలతో రూ. 19,770, టోల్‌గేట్‌తో రూ.1490, ఇతర విభాగాలతో రూ. 6,010తో కలిపి మొత్తం రూ. 2,15,694 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

VIDEOS

logo