శనివారం 06 మార్చి 2021
Yadadri - Sep 05, 2020 , 01:25:13

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 40 మందికి పరీక్షలు నిర్వహించగా, యాదగిరిపల్లికి చెందిన ఇద్దరికి, కాచారం, శ్రీరాంనగర్‌కు చెందిన ఒక్కొక్కరికి కొవిడ్‌-19గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఆలేరులో నిర్వహించిన పరీక్షలో మండలంలోని చిన్నకందుకూరుకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

యాదాద్రి అర్చకుడి సహా మరో నలుగురికి..

యాదగిరిగుట్టకు చెందిన నలుగురితోపాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీబీనగర్‌ మండలంలో 29 మందికి..

బీబీనగర్‌: మండలంలోని కొండమడుగు, బీబీనగర్‌ గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 110 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు రామయ్య, ప్రవీణ్‌ తెలిపారు. 

రామన్నపేటలో 24 కేసులు..

రామన్నపేట: రామన్నపేట మండలంలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. మండలంలో 98 మందికి పరీక్షలు నిర్వహించగా, రామన్నపేటలో ముగ్గురికి, వెల్లంకిలో ఇద్దరికి, ఇంద్రపాలనగరంలో ఆరుగురికి, మునిపంపులలో ఐదుగురికి, పల్లివాడలో నలుగురికి, నిదానపల్లిలో ఇద్దరికి, సిరిపురం, ఉత్తటూరు గ్రామాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. వీరికి వైద్యసిబ్బంది ఐసొలేషన్‌ కిట్లను అందజేసి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

మోత్కూరులో 22 మందికి...

మోత్కూరు : మోత్కూరు మండలంలో 22మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగిందని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ తెలిపారు. పీహెచ్‌సీలో 96 మందికి ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు నిర్వహించారు. మోత్కూరు పురపాలిక కేంద్రంలో 12 మందికి, పొడిచెడులో ముగ్గురికి, బుజిలాపురంలో ఇద్దరికి, జామచెట్లబావిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు. వీరందరికీ ఐసొలేషన్‌ మెడికల్‌ కిట్లను అంద చేసి హోంక్వారంటైన్‌ చేశామని తెలిపారు. కాగా, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 842 మందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా, 150 మంది కరోనా సోకిన వారందరూ కోలుకుంటున్నారని తెలిపారు.

ఆలేరులో 19 కేసులు...

ఆలేరుటౌన్‌ : ఆలేరు మండలంలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని శారాజిపేట పీహెచ్‌సీ ఇన్‌చార్జి డాక్టర్‌ రాజేందర్‌ తెలిపారు. పట్టణంలోని సీహెచ్‌సీ కొవిడ్‌-19 పరీక్ష కేంద్రంలో 69మందికి పరీక్షలు నిర్వ హించగా, 19మందికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.

సంస్థాన్‌ నారాయణపురంలో 21 మందికి...

సంస్థాన్‌నారాయణపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 54 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోంక్వారంటైన్‌కు తరలించి మెడికల్‌ కిట్లను అందించామన్నారు.

అడ్డగూడూరులో 17 కేసులు 

అడ్డగూడూరు: మండలంలోని చౌళ్లరామారం గ్రామంలో మొబైల్‌  కొవిడ్‌ క్యాంప్‌ నిర్వహించి 100 మందికి పరీక్షలు చేయగా, చౌళ్లరామారంలో 10, డి.రేపాకలో మూడు, కోటమర్తిలో రెండు, బొడ్డుగూడెంలో రెండు, మొత్తం 17 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసొలేషన్‌ కిట్లను అందజేసి హోంక్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. 

ఆత్మకూరు(ఎం)లో 17 మందికి...

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 72 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. మండలంలోని మొరిపిరాలలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో సర్పంచ్‌ తిర్మల్‌రెడ్డి గ్రామంలోని ప్రధాన వీధుల వెంట హైపో  క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.

వలిగొండలో మరో 17 మందికి..

వలిగొండ: వలిగొండ మండలంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 17 మందికి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 99 మందికి ర్యాపిడ్‌ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించగా, 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వారిని హోంక్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

పోచంపల్లిలో 14మందికి...

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలో మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. అంతమ్మగూడెంలో 2, ఇంద్రియాలలో 1, పిలాయిపల్లిలో 4, హైదర్‌పూర్‌లో 1, రేవణపల్లిలో 6 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా, వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.

మోటకొండూర్‌ మండలంలో 8మందికి...

మోటకొండూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆలేరు ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం మండల కేంద్రంతోపాటు బోడుప్పల్‌కు, పలు మండలాలకు చెందిన 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు. వీరిలో మండల కేంద్రానికి చెందిన నలుగురికి, మండలంలోని చందేపల్లి గ్రామానికి చెందిన ఒకరికి, ఇక్కుర్తికి చెందిన ఒకరికి, బోడుప్పల్‌కు చెందిన ఒకరికి, గజ్వేల్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌, సెకండరీ కాంటాక్ట్‌ను గుర్తిస్తున్నామన్నారు. 

సోమారంలో ఏడుగురికి..

రాజాపేట:మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో 32మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. మండలంలోని సోమారంలో ఏడుగురికి కరోనా సోకడంతో హోంక్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు.

తుర్కపల్లిలో ఒకరికి...

తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు.

కరోనాతో వృద్ధుడు మృతి

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు (70) కరోనాతో శుక్రవారం మృతి చెందినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంగా ఉండడంతోపాటు నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సదరు వ్యక్తి హోంక్వారంటైన్‌లో ఉన్నప్పటికీ మృతి చెందినట్లు తెలిపారు.

పీపీఈ కిట్లతో అంత్యక్రియలు

అడ్డగూడూరు: మండలంలోని చౌళ్లరామారం గ్రామానికి చెందిన కొమ్మిడి భద్రమ్మ(75)అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరికి వారం రోజుల కిందట కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. ఆమెకు కూడ సోకిందనే అనుమానంతో ఆమె మనుమండ్లు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.


VIDEOS

logo