బుధవారం 03 మార్చి 2021
Yadadri - Sep 09, 2020 , 01:03:01

నేడు అసెంబ్లీ ముందుకు కొత్త రెవెన్యూ చట్టం

నేడు అసెంబ్లీ ముందుకు కొత్త రెవెన్యూ చట్టం

భూప్రక్షాళన పూర్తికావొస్తున్నా తగ్గని భూ వివాదాలు

ఆన్‌లైన్‌ ఎంట్రీలో తప్పిదాలు.. రైతులకు తప్పని ఇబ్బందులు

రెవెన్యూ శాఖలో తారాస్థాయికి చేరుతున్న అవినీతి, అక్రమాలు

ఈ క్రమంలోనే వీఆర్వో వ్యవస్థకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రభుత్వం

నిర్ణీత కాల వ్యవధిలో భూ సమస్యలు పరిష్కరించేలా కొత్త చట్టానికి రూపకల్పన

ప్రభుత్వ చర్యలతో జిల్లాలో హర్షం వ్యక్తం చేస్తున్న యావత్‌ ప్రజానీకం

భువనగిరి యాదాద్రి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 8,55,922 ఎకరాల్లో భూ విస్తీర్ణం ఉండగా.. 6,18,390 ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయి. మరో 63,222 ఎకరాల్లో వ్యవసాయేతర భూములు ఉండగా.. 26,616 ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో ఏండ్ల తరబడిగా కొనసాగుతున్న భూ సమస్యలకు చెక్‌పెట్టే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏలు పర్యటించి భూ వివరాలను ధరణిలో నమోదు చేశారు. ఇప్పటివరకు 98 శాతానికి పైగా భూ సమస్యలను పరిష్కరించారు. 2,20,067 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలను సైతం అందించారు. అయితే భూ వివరాలను ఆన్‌లైన్‌ చేసే సందర్భంలో చాలా వరకు తప్పిదాలు జరిగాయి. భూ విస్తీర్ణాన్ని తక్కువగా నమోదు చేయడం.. ఒకరి పేరుకు బదులుగా వేరొక పేరును నమోదు చేయడం.. సర్వే నంబర్లను తప్పుగా నమోదు చేయడంతో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కబ్జాలో ఒకరు ఉంటే పట్టా పాసుపుస్తకాలను మరొకరికి సైతం జారీ చేశారు. వీటిని సవరించుకునేందుకు బాధితులు నిత్యం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని చోట్ల రెవెన్యూ, అటవీశాఖ భూముల విషయంలో నెలకొన్న తగాదాలతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’కి సైతం భూ సంబంధిత ఫిర్యాదులే వస్తున్నాయి. ఈ సందర్భంలో రైతులు న్యాయం కోరుతూ ఆందోళనకు దిగుతున్నారు. నిన్నటికి మొన్న యాదగిరిగుట్ట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడ్డారు. ఇదే క్రమంలో రెవెన్యూ శాఖలో రోజురోజుకూ పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు సైతం ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తున్నాయి. జిల్లాలో పలు సందర్భాల్లో తహసీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు రైతుల నుంచి లంచం డిమాండ్‌ చేసి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. మరికొందరు అవినీతి చట్రంలో చిక్కుకుని సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ తరహా వాటికి చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ గత కొంతకాలంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కసరత్తును మొదలుపెట్టారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం కార్యరూపంలోకి రానుండడంతో ముందస్తుగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు.

కాలం చెల్లిన చట్టానికి చెల్లుచీటీ...

అక్రమాలు, అవినీతిని మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టంపై సుదీర్ఘమైన కసరత్తు చేస్తున్నారు. వివాదాలకు తావివ్వకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న రికార్డు ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌వోఆర్‌) చట్టం స్థానంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 144 చట్టాల్లో కాలం చెల్లిన వాటిని తొలగించి కేవలం 20 చట్టాలతోనే చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుదారుడు ఆర్జీ దాఖలు చేసింది మొదలు.. సమస్య పరిష్కారం వరకు స్టేటస్‌ రిపోర్టును ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటును ఇకపై కల్పించనున్నారు. ఏ అధికారి వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉన్నది?. ఎందుకు ఉన్నది? అనే సమాచారాన్ని దరఖాస్తుదారుడు తెలుసుకునే వీలుండనున్నది. భూ వివాదాలు 45 రోజుల్లో పరిష్కారం కాకుంటే.. ఆర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదించడమో.. అక్కడా తీర్పు సంతృప్తికరంగా లేకుంటే రెవెన్యూ కోర్టులో అప్పీల్‌ చేసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొనసాగిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లన్నీ ఇకపై తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే సాగనున్నాయి.

ప్రతి పనికి పైసలు తీసుకుండ్రు..

ఆత్మకూరు(ఎం): తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు ప్రతి పనికి పైసలు తీసుకుండ్రు. పేద రైతులు ఆఫీసుకు వస్తే భూమి సమస్య తీర్చాలని దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వీఆర్వోలు మాత్రం ఆఫీసు చుట్టూ ప్రతిరోజు తిప్పించుకొని పైసలు తీసుకున్నారు తప్ప సమస్య పరిష్కరించలేదు. చిన్న సంతకానికి కూడా పైసలు ఇస్తేనే పెట్టిండ్రు. పైసలు తీసుకొని కూడా పనులు చేయకుండా రేపుమాపు అంటూ ఆఫీసు చుట్టూ తిప్పించుకొని నానా అవస్థలు పెట్టిండ్రు. ఇలాంటి వీఆర్వోలను సీఎం కేసీఆర్‌ తీసేస్తున్నట్లు ప్రకటించడం సంతోషం.  - ఎ.ఎలెందర్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, ఆత్మకూరు(ఎం)

చెప్పులరిగేలా తిప్పించుకుంటుండ్రు

బీబీనగర్‌ : మండలంలోని నెమురగొముల గ్రామ రెవెన్యూలోని 158, 159, 160 సర్వే నంబర్లలో కలిపి మాకు 3 ఎకరాల 14 గుంటలు, ఇంకో సర్వే నంబర్‌ 225, 226లో ఒక ఎకరం భూమి ఉన్నది. 2003 సంవత్సరంలో మా గ్రామ వీఆర్వో స్థానిక రియల్టర్ల సొమ్ముకు ఆశపడి మా కుటుంబాన్ని నిట్టనిలువునా మోసం చేశాడు. అన్ని రికార్డుల్లో మా పేరు ఉన్నప్పటికీ అన్యాయంగా ఇతర వ్యక్తికి పట్టా వచ్చేలా చేశాడు. ఈ విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేసేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అధికారులు మారినా మాకు మాత్రం న్యాయం జరగలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త చట్టంతోనైనా మాకు న్యాయం జరుగుతుందేమోనని ఆశ పడుతున్నం.

- సంకూరి శ్రీకాంత్‌, నెమురగొముల, బీబీనగర్‌ మండలం

వీఆర్వో వ్యవస్థ రద్దు మంచిదే..

అడ్డగూడూరు : ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం మంచి నిర్ణయం. వీఆర్వోల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగినా పనులు కాకపోయేది. ఆఫీసు తీయకు ముందు వచ్చి ఆఫీసు మూసేదాక ఉన్నా వీఆర్వోలు దొరికేవారు కాదు. వీఆర్వోలు అడిగిన డబ్బులు ఇచ్చినా పనిచేసే వారు కాదు. అనినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా వీఆర్వో వ్యవస్థ మారిపోయింది. ఒక్క రోజులో అయ్యే పనులను కూడా నెలల తరబడి ఆఫీసు చుట్టూ ప్రజలను తిప్పేవారు. ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం. భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ సదస్సులో ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను కనీసం చదవకుండా పడేసేవారు. ప్రభుత్వం తెస్తున్న కొత్త చటం ప్రజలకు సులువుగా పనులు అయ్యే లా  ఉండాలని కోరుకుంటున్నాం. -  చేడే చంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, అడ్డగూడూరు మండలం

ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు వీఆర్వో చుట్టు తిరిగా..

గుండాల : మా గ్రామం వస్తకొండూరు గుండాల మండలం. నేను 20 ఏండ్ల కింద గ్రామంలో 508 సర్వే నంబర్‌లో 2 ఎకరాల 10 గుంటలు, 507 సర్వే నంబర్‌లో రెండు ఎకరాల 2 గుంటల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నా. ప్రభుత్వం ఇచ్చిన పాత పాసుపుస్తకాలు, తెలంగాణ ప్రభుత్వంలో కొత్త పాసుపుస్తకాలు వచ్చినయి. ఇప్పుడు ఏదో కారణంతో ఆన్‌లైన్‌లో ఉన్న భూమిని తొలగించారు. దానిని తిరిగి ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి వీఆర్వో చుట్టూ, తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ రైతులకు పంట పెట్టుబడి అందిస్తుంటే నాకు పెట్టుబడి అందలేదు. రైతుల పాలిట దేవుడు, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రైతులకు న్యాయం చేయబోతున్నాడనే కోటి ఆశలతో రైతులు ఎదురుచూస్తున్నం. - దిండిగల్ల స్వామిరావు, వస్తకొండూరు, గుండాల మండలం


నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడం మంచిదే.. 

చౌటుప్పల్‌ : కొత్త రెవెన్యూ చట్టానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టడం మంచి పరిణామం. ఇది రైతులతోపాటు ప్రజలకూ శుభవార్త. దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించడమే సీఎం లక్ష్యంగా కన్పిస్తుంది. ఈ చట్టం అందుకు అద్దం పడుతుంది. ఇప్పటి వరకు భూ పరిపాలనలో కింది స్థాయిలో అవినీతి ఊడలు దిగింది. వీఆర్వో వ్యవస్థ అంటేనే అవినీతికి ఆజ్యంగా అందరూ భావించేవారు. రైతులు చెప్పులరిగేలా తిరిగినా పట్టాదారు పాసుపుస్తకాల జారీ జరిగేది కాదు. పెండింగ్‌లో వేలాది భూ సమస్యలకు సంబంధించిన కేసులు మూలుగుతున్నాయి. దీన్ని రూపుమాపేందుకు సీఎం కేసీఆర్‌ వీఆర్వో వ్యవస్థ రద్దు లాంటి ఎంతో మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనవుతుంది. ఈ చట్టంతో రైతు భూములకు ప్రభుత్వం పక్కగా భరోసా కల్పించింది. అంతేకాకుండా భూ లావాదేవీల్లో కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ను అమలు చేసేలా ఈ బిల్లును రూపొందించారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి అభినందనలు. 

- డా. విద్యారాణి, ఆక్యూపంక్చర్‌ వైద్యురాలు, చౌటుప్పల్‌

వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం సమంజసమే

రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం సమంజసమే. రెవెన్యూ రికార్డులు భ్రష్టు పట్టడానికి ప్రధానంగా వీఆర్వోలే కారణం. సగం తగాదాలు వారి తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఇటీవల కొత్త పాసు బుక్కులు జారీ చేయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలాచోట్ల పట్టాలు ఒకరిపేరు మీద ఉంటే కబ్జాలో మరొకరు ఉండేవారు. ప్రతీ గ్రామంలో వందలో సంఖ్యలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. నూతన రెవెన్యూ చట్టంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన జాగ్రతలు తీసుకోవాలి. వీఆర్వోలకు అర్హతలను బట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో వారి సేవలను ఉపయోగించుకుంటామని చెప్పడం కూడా స్వాగతించదగిన విషయమే.

- బొక్క యాదిరెడ్డి, కుంకుడుపాముల సర్పంచ్‌


రైతులను రక్షించిన దేవుడు సీఎం కేసీఆర్‌..

గుండాల : నా పేరు పురుగుల అశోక్‌. మాది తుర్కలశాపూరం  గ్రామం గుండాల మండలం. రెండేండ్ల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం, వీఆర్వోల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. 395, 318, 319 సర్వే నంబర్లలో నేను, నా తమ్ముడు కలిసి తుర్కలశాపూరం గ్రామంలో మూడెకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేశాం. ఆ భూమికి సంబంధించి ఆన్‌లైన్‌, పాసుపుస్తకం కోసం వ్యవసాయ పనులు వదులుకొని వీఆర్వో చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చినా రేపుమాపు అంటూ రోజులు గడిపారు తప్ప మా పని మాత్రం చేయలేదు. నాతోపాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భూ సమస్యలతో ఎంతో మంది రైతులు వీఆర్వోల చుట్టూ తిరుగుతున్నా పని మాత్రం అయితలేదు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రైతులను రక్షించిన దేవుడు సీఎం కేసీఆర్‌.

- పురుగుల అశోక్‌ రైతు తుర్కలశాపూరం

దారిచూపిన ధర్మగంట..

ఆలేరు: ‘నమస్తే తెలంగాణ’ నేతృత్వంలో చేపట్టిన ‘ధర్మగంట’ కథనానికి ఎంతో మంది రైతులకు న్యాయం చేకూరింది. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది రైతులకు ఏండ్లనాటి భూ సమస్యలు పరిష్కార మార్గం చూపించింది. నిర్లక్ష్యం వహించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పలువురు రెవెన్యూ అధికారులకు సైతం ధర్మగంట ఇంటి బాటపట్టించిందనటంలో సందేహం లేదు. గతేడాది నుంచే రెవెన్యూ వ్యవస్థలో పలు మార్పులు తీసుకువస్తామని సీఎం కేసీఆర్‌ మాటలు నేటికి సాకారమైంది. రైతుల పక్షపాతిగా వ్యవహరించాల్సిన వీఆర్‌వోలు లంచాలకు అలవాటుపడి రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ఇది గమనించిన సీఎం కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్థనే రద్దు చేయడంలో పలువురు రైతులు, రైతుకూలీ సంఘాలు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయం అభినందనీయం.. 

వీఆర్‌వో వ్యవస్థ రద్దు కోసం సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరే. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడం చాలా గొప్పది. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన కృతజ్ఞతలు.

- దంతూరి యాదగిరి, బీఎన్‌, తిమ్మాపురం, భువనగిరి

రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేయాలి..

సంస్థాన్‌నారాయణపురం : మండల కేం ద్రంలో రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేయాలి.  ప్రక్షాళనలో భాగంగా రైతుల అన్ని రకాల భూ సమస్యలకు సంబంధించి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన సలహాల కోసం మండల కేంద్రాల్లో రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేయాలి.  

- బద్దుల కృష్ణకుమార్‌, సంస్థాన్‌నారాయణపురం మండలం

అవినీతి లేని కొత్త వ్యవస్థ రావాలి..

యాదాద్రి, నమస్తే తెలంగాణ : ఇప్పటి వరకు భూ బదాలయింపులు, మ్యుటేషన్లు, ఫౌతీల కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామ రెవెన్యూ అధికారులను భూ ప్రక్షాళనకు సంబంధించిన విధుల్లోంచి తొలిగించినంత మాత్రాన సరిపోదు. ప్రత్యామ్నాయంగా అవినీతిలేని పారదర్శక వ్యవస్థ రావాలి. వీఆర్‌వోలు లేకుండా కేవలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, తహసీల్దార్లతోనే భూ బదాలయింపులు నిర్వహిస్తే క్షేత్ర స్థాయిలో రైతులకు సంబంధించిన సరైన సమాచారం వారికి తెలియకపోవచ్చు. దీంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయిలో సరైన వివరాలు తెలిసి ఉండేలా, అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త వ్యవస్థను తీసుకురావాలి. కేవలం వీఆర్‌వోలను తీసివేసి ఆ బాధ్యతలను ఇతర అధికారులకు ఇచ్చినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పలేం. శాస్త్రీయంగా అధ్యయనం చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలి.

- బెజగం నాగరాజు, సమాచార హక్కు చట్టం ప్రచార సమితి, ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు

భూ సమస్యలకు చెక్‌..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూసమస్యలకు చెక్‌ పడుతుంది. రైతులకు భూరికార్డుల సమస్యలు పూర్తిస్థాయిలో తొలగుతాయి. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు వీఆర్‌వోల చుట్టూ తిరిగే కాలం చెల్లిపోయింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో భూ సంబంధిత సమస్యలు రూపుమాసిపోతాయి.

- పడాల శ్రీనివాస్‌పటేల్‌, సీనియర్‌ న్యాయవాది, భువనగిరి


రైతుల తిప్పలు తీరుతాయి..

యాదాద్రి, నమస్తే తెలంగాణ : రిజిస్ట్రేషన్‌ తర్వాత భూ బదాలయింపు, వారసత్వ భూముల బదిలీ, ఫౌతీ చేయడానికి వీఆర్‌వోలు రైతులను ఇబ్బందులు పెట్టేవారు. భూములు కొన్న రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత వన్‌-బీ, ఆన్‌లైన్‌లో నమోదు కోసం ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అయినా చాలా సందర్భాల్లో డబ్బులు ఇస్తే కానీ పనులు జరిగే పరిస్థితి ఉండేది కాదు. పలు భూ వివాదాలు పరిష్కారం కాకపోవడంతో విసిగి వేసారిన రైతులు గుట్ట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యలకు యత్నించిన ఘటనలు అనేకం ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ వారు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నారు. వీఆర్‌వోల వ్యవస్థను రద్దు చేశారు. ఇది చాలా శుభ పరిణామం. 

- మిట్ట అనిల్‌, మహేంద్ర యువసేన నాయకుడు, యాదగిరిపల్లి

ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం..

ఆలేరుటౌన్‌ : వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. గ్రామాల్లో పొలాల మధ్య గట్టు, బాట పరిష్కారం కోసం ఇరువర్గాలకు చెందిన రైతుల దగ్గర నుంచి పెద్దఎత్తున వీఆర్వోలు డబ్బులు వసూలు చేసేవారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి పురుగుమందు తాగి చనిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. కబ్జాలో ఉన్న వారి నుంచి లంచం తీసుకొని పాసుపుస్తకాలు ఇచ్చేవారు. పాసుపుస్తకంలో తక్కువ భూమి చూపించి, ఆ భూమిని లంచం ఇచ్చినవారికి ఇచ్చేవారు. అన్యాయం జరిగిందని కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకంలేకా అయిన కాడికి వీఆర్వో చెప్పిన రేటు ప్రకారం అమ్మిన రైతులు ఎందరో ఉన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఆలేరు మండలం ఉండటంతో మండలంలో ఇక్కడి వ్యవసాయ భూములకు అత్యధిక రేటు పలుకుతున్నది. దీంతో ఇక్కడి వీఆర్వోలు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులుగా మారి వివాదాస్పదంగా ఉన్న రైతుల భూములు బడాబాబులకు అమ్మి కోట్లకు పడగలెత్తారు. ఆలేరు పట్టణంలోని సర్వే నంబర్‌ 1026లో, బీసీ కాలనీలో, బీరప్పగడ్డలో పేదలకు ప్లాట్ల కేటాయింపులో వీఆర్వోలు అనర్హులకు ఇచ్చి కోట్లు సంపాదించారు. అధికారులకు తెలియకుండా ప్రభుత్వ భూములను స్వాహా చేసిన చరిత్ర వారిది. ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో రైతులు తహసీల్దార్‌తో తమకు న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నారు. వారికి ఈ విషయంలో రైతులకు న్యాయం చేస్తే చాలా సంతోషం. కీసర లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తహసీల్దార్లపై నిఘాపెట్టి రైతులకు అన్యాయం జరిగితే వెంటనే వారిని సర్వీస్‌ నుంచి శాశ్వతంగా తొలగించే విధంగా పారదర్శకంగా, రైతులకు ప్రయోజనకరంగా ఉండే నూతన చట్టాన్ని రూపొందించాలని కోరుకుంటున్నా. - మంగ నర్సింహులు, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి 

డబ్బులిస్తేనే సర్వే చేస్తమన్నరు..

ఆలేరు : వ్యవసాయ భూమి ఏదైనా సర్వే చేయాలంటే రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని రెవెన్యూ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు. దాదాపుగా ఏడాదిపాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పారు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలంలోని వర్టూర్‌ పరిధిలోని గంగాబావి, మాకు మోటకొండూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 324 రు, 326 ఈ మా చెల్లెలికి 1.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయమై సర్వే నిర్వహించి, సబ్‌ డివిజన్‌ చేసి, హద్దులు నిర్ధారించి ఇవ్వాలని  2018 జూన్‌ 30వ తేదీన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. నిబంధనల మేరకు మీ సేవలో రూ.295 చెల్లించి దరఖాస్తు చేసుకోవడంతో పాటు రసీదు, అవసరమైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాసుపుస్తకాలు, పహాణి, 1బీ, ఈసీలను మోటకొండూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో అందజేసి రసీదు తీసుకున్నాను. సంవత్సరాలు గడుస్తున్నా, రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మోటకొండూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాను. వారి సూచన మేరకు మండల సర్వేయర్‌ను కలువగా, సర్వే చేయాలంటే ఖర్చు అవుతుందని చెప్పాడు. సర్వేయర్‌ అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో సర్వే నిలిపివేశాడు. దీంతో ‘నమస్తే తెలంగాణ ధర్మగంట’ను ఆశ్రయించాం. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వేయర్‌ స్పందించి వెంటనే విచారణ చేపట్టి, సర్వేయర్‌ను జిల్లా కలెక్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

- మెట్టు సువర్ణ, రైతు గంగాబావి, వర్టూర్‌ గ్రామం, మోటకొండూర్‌ మండలం


25 ఏండ్లు అరిగోస పెట్టారు..

ఆలేరు: మా గ్రామం అప్పుడు ఆత్మకూరు(ఎం) మండలంలో ఉండేది. ప్రస్తుతం మోటకొండూర్‌ మండలంలో కలిసింది. మా గ్రామంలోనే సమీప బంధువైన ఎన్నె మల్లారెడ్డి వద్ద 8.19 ఎకరాల భూమిని 12 జనవరి, 1993లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశాను. వీటికి సంబంధించిన పాసుపుస్తకాలు సైతం తనతోపాటు తమ అన్నదమ్ములైన కృష్ణారెడ్డి, సిద్ధారెడ్డిలకు రెవెన్యూ అధికారులు అందించారు. ఆ తరువాత కొన్నేండ్లకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను జప్తు చేసుకున్నారు. ఇచ్చిన పట్టాను ఎందుకు జప్తు చేశారో తెలియజేయాలని, వెంటనే విచారణ చేపట్టి తమకు రావాల్సిన 8.18 ఎకరాల భూమిని తమకు ఇవ్వాలని గత 25 ఏండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాను. ఆత్మకూరు(ఎం) మండల రెవెన్యూ కార్యాలయం, నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్‌ మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయం  చుట్టూ తిరిగాను. వీఆర్‌వో, వీఆర్‌ఏలు అరిగోస పెట్టారు. దీంతో విసుగు చెంది ‘నమస్తే తెలంగాణ ధర్మగంట’ను ఆశ్రయించాం. ఆ కథనానికి అప్పటి తహసీల్దార్‌, డీటీ, ఆర్‌ఐ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆర్డీవోకు నివేదించారు. నివేదిక పరిశీలించిన అప్పటి భువనగిరి డివిజన్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు, 8.18 గుంటల భూమిపై మాకు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. నాకు న్యాయం జరిగింది. తాజాగా సీఎం కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేశారని తెలిసింది. రైతులను ఇబ్బందులు పెట్టిన వీఆర్‌వోలకు తగిన శాస్తి జరిగింది. 

- ఎన్నె రామిరెడ్డి, రైతు, చందేపల్లి గ్రామం, మోటకొండూర్‌ మండలం


VIDEOS

logo