గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 21, 2020 , 01:04:42

యాదాద్రీశుడి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు

యాదాద్రీశుడి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు

వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం

శ్రీవారి ఖజానాకు రూ. 6,56,449 ఆదాయం

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆదివారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురష్కరించుకుని శ్రీస్వామివారికి ప్రధానార్చకులు నల్లంధీగల్‌ లక్ష్మీనారసింహాచార్యులు ఆధ్వర్యంలో విశేషంగా పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు నిత్యారాధనలతో పాటు వేకువజామున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం స్వామివారికి ఆలయ మహా మంటపంలో 108 కలశాలకు శాస్ర్తోక్తంగా శతఘటాభిషేకం చేపట్టారు. వివిధ ఫల రసాలు, పంచామృతాలు, ఫల జలాలు, శుద్ధమైన జలంతో శ్రీస్వామి, అమ్మవార్లను అభిషేకించారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహామూర్తి, ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌, వేముల వెంకటేశ్‌, వెంకటేశ్వర్లు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

వైభవంగా విశేష పూజలు

పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆదివారం నిత్యపూజలు ఆగమశాస్త్రంగా వైభవంగా చేపట్టారు. బాలాలయాన్ని ఉదయం 5 గంటలకు తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, ఆరాధన చేపట్టారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, పట్టువస్ర్తాలను ధరింపజేసి అర్చన జరిపారు. ఉత్సవమూర్తులను తులసీ దళాలతో అర్చించి అష్టోత్తరం నిర్వహించారు. మహా మంటపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి వారికి సాయంత్రం, రాత్రి ఆరాధన, శయనోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకుని మొక్కుల తీర్చుకున్నారు. ఆదివారం వారాంతపు  సెలవు కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. హైదరాబాద్‌ తో పాటు ఇతర ప్రాంతాలను నుంచి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఖజానాకు 

రూ. 6,56,449 ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 6,56,449 సమరికూరినట్లు ఆలయ ఈవో గీతా తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 4,150, ప్రసాదవిక్రయాలతో రూ. 5,31,845, చెక్‌పోస్టు ద్వారా రూ. 2,710,  మినీ బస్సుల ద్వారా రూ. 2,510, వాహనపూజల ద్వారా రూ. 17,200, అన్నదాన విరాళంతో రూ. 6,616, కొబ్బరికాయలతో రూ. 54,570లతో కలిపి మొత్తం రూ. 6,56,449 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

యాదాద్రి ఆలయం అద్భుతం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. 

అనంతరం ఆయన యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పూర్తి కృష్ణ శిలలతో ఆలయాన్ని నిర్మించడం గొప్పవిషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలోని ఆలయాలన్నీ అద్భుతంగా మారుతున్నాయని చెప్పారు.

VIDEOS

logo