బుధవారం 25 నవంబర్ 2020
Yadadri - Oct 25, 2020 , 09:23:59

రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిగడ్డ

రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిగడ్డ

సబ్సిడీ ఉల్లిగడ్డల ధరను సర్కారు మరో 5 రూపాయలు తగ్గించింది. బయటి మార్కెట్లో కిలో రూ.100కిపైగా ఉండగా, జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ప్రభుత్వం రూ.35కే అందిస్తున్నది. శనివారం పలుచోట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు అన్ని రైతు బజార్లలో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరికి 2 కేజీలు ఇస్తామని, వినియోగదారులు ఆధార్‌ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.

కేపీహెచ్‌బీ కాలనీ, కంటోన్మెంట్‌, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, నేరేడ్‌మెంట్‌ :  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు, పేదలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లిగడ్డలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ రైతుబజార్లలో రూ. 35కే  ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఆధార్‌ కార్డు చూపించి.. ఒక్కొక్కరూ రెండు కిలోల చొప్పున ఉల్లిగడ్డలను కొనుగోలు చేశారు. కూకట్‌పల్లి రైతుబజార్‌లో పండుగ కోసం 39 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎస్టేట్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ తెలిపారు. మొదటి రోజు 20 క్వింటాళ్ల సరుకు సబ్సిడీ ధరకే విక్రయించినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయిస్తామన్నారు. అల్వాల్‌ రైతుబజార్‌లో బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, ఎర్రగడ్డ రైతుబజార్‌లో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. అలాగే మెహిదీపట్నం, ఆర్కేపురం రైతుబజార్లలో ఉల్లి కేంద్రాలను నెలకొల్పినట్లు ఎస్టేట్‌ అధికారులు విజయ్‌కుమార్‌, మహేందర్‌ వెల్లడించారు. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో.. 

దసరా పం డుగ వేళ ప్రజలకు ఇబ్బంది కలుగవద్దనే ఉ ద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన రైతుబజార్లలో  కేంద్రాలను ప్రారంభించాం.  బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు దిగి వచ్చేంత వరకు వీటిని కొనసాగిస్తాం. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తెప్పించిన నాణ్యమైన ఉల్లిని అందుబాటులో ఉంచాం. ప్రజలకు నిత్యావసర సరుకుల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.

ఎంతో సంతోషాన్ని కలిగించింది.. 

గత వారం.. పది రోజుల నుంచి బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దసరాకు మా లాంటి మధ్య తరగతి వాళ్లు ఉల్లిని కొనే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. రాయితీపై ఉల్లి అందుబాటులోకి రావటంతో పండుగ వాతావరణం నెలకొన్నది. - శివలక్ష్మి

ఊహించని సాయం 

బయట మా ర్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో ప్ర భుత్వం మంచి నిర్ణయాన్ని తీసుకున్నది. రూ.60-85 వరకు వెచ్చించి  మాలాంటి వాళ్లు ఉల్లిని కొనలేని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిగడ్డలు అందించడం అభినందనీయం. ఇది ఊహించని సాయంగా భావించాలి. - ఉమేష్‌కుమార్‌