శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jun 22, 2020 , 23:26:34

మున్సిపాలిటీల్లో స్మార్ట్‌ టాయిలెట్లు

మున్సిపాలిటీల్లో స్మార్ట్‌ టాయిలెట్లు

భువనగిరి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఇందుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే మున్సిపాలిటీలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం, ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు పరిశుభ్రత, మౌలిక వసతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ప్రజా సంక్షేమం కోసం నూతన అడుగులు వేస్తున్నది. గ్రేటర్‌ మున్సిపాలిటీలకు దీటుగా పట్టణ మున్సిపాలిటీలను మార్చాలని నిశ్చయించారు. దీనిలో భాగంగా పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, ముఖ్యవాణిజ్య, వ్యాపార సముదాయం, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాల వద్ద షీ టాయిలెట్లు, స్టాండ్‌ ఎలోన్‌, కమ్యూనిటీ టాయిలెట్లు, స్మార్ట్‌ వాష్‌రూమ్‌ల నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్లు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసే స్మార్ట్‌ వాష్‌రూమ్‌, షీ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, వాటిని ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో నూతనంగా 110 టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపడంతోపాటు  ఆమోదం అనంతరం నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భువనగిరి మున్సిపాలిటీలో నిర్మాణం చేపట్టేందుకు స్థలాలను గుర్తించి పనులను పర్యవేక్షించడానికి అధికారులను కేటాయించారు. 

వెయ్యి మందికి ఒకటి ఉండేలా చర్యలు..

జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ ఉండగా, నూతనంగా భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్‌, చౌటుప్పల్‌ పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. ఈ పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నది. మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభా ప్రకారం పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక ప్రకారం ఆదేశాలు రావడంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు అవసరమయ్యే టాయిలెట్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించడంతోపాటు కొన్నిచోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. 

భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో.

భూదాన్‌పోచంపల్లి పట్టణంలో ప్రస్తుత జనాభా 17,051 మంది. నూతనంగా ఆరు స్థలాల్లో 20పబ్లిక్‌ టాయిలెట్ల కోసం ఆ స్థలాలను పరిశీలించిన అనంతరం ప్రతిపాద

నలు పంపించారు. ఆమోదం అందిన వెంటనే నిర్మాణం చేపడుతారు. 

ఆలేరు పట్టణంలో.. 

ఆలేరు పట్టణంలో ప్రస్తుతం జనాభా 17,120 మంది. ప్రసుత్తం పబ్లిక్‌ టాయిలెట్లు 4 ఉన్నాయి. నూతనంగా మరో 24 అందుబాటులోకి తేవాలని 12 మహిళలకు, 12 పురుషుల టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాలను గుర్తించారు.  

యాదగిరిగుట్ట పట్టణంలో.. 

యాదగిరిగుట్ట పట్టణంలో ప్రస్తుతం జనాభా 15,761 ఉన్నది. 16 పబ్లిక్‌ టాయిలెట్లు నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. బస్‌ డిపో ఉండడం, యాదగిరిగుట్ట టెంపుల్‌ సిటీ కావడంతో దేవాలయ సందర్శనానికి వచ్చే భక్తులకు అదనంగా ఏర్పాటు చేయాలని స్థలాలను గుర్తించారు.  

మోత్కూర్‌ పట్టణంలో..

మోత్కూర్‌ పట్టణంలో ప్రస్తుత జనాభా 15,924 ఉన్నది. పట్టణంలో పబ్లిక్‌ టాయిలెట్లు లేకపోవడంతో నూతనంగా 16 టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే స్థలాలను పరిశీలించారు.  

చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో.. 

చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో ప్రసుత్తం 31,263 జనాభా ఉన్నది. ప్రస్తుతం రెండు పబ్లిక్‌ టాయిలెట్లు ఉండగా, మరో మూడు పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు. 30 ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 12 ఏర్పాటు చేయగా, మొత్తం 20వరకు అందుబాటులోకి వస్తాయి. 

భువనగిరి మున్సిపాలిటీలో..

భువనగిరి మున్సిపాలిటీలో గతంలో 30వార్డులుండగా పట్టణ జనాభా 52వేలు ఉండగా, జనాభా ప్రకారం 76 పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించి వాటి నిర్వహణ సులభ్‌ కాంప్లెక్స్‌ సంస్థకు అప్పగించారు. మున్సిపాలిటీల పరిధి పెంచడంతో నూతనంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడటం, భువనగిరి మున్సిపాలిటీ పరిధి పెరిగింది. దీంతో భువనగిరి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో ప్రస్తుతం 35 వార్డులుగా విభజించారు. మున్సిపాలిటీలో ప్రస్తుత జనాభా 59,844 ఉన్నది. పట్టణంలో 755 వాణిజ్య వ్యాపార సంస్థలు, వ్యవసాయ మార్కెట్‌యార్డు, రైతుబజార్‌, బస్టాండ్‌, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలు, భువనగిరి ఖిల్లాకు వచ్చే సందర్శకులు, జిల్లా కేంద్రం కావడంతో కలెక్టరేట్‌, జిల్లాలోని 17 మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతినిత్యం 10వేల నుంచి 15వేల వరకు పట్టణానికి వచ్చిపోతుంటారు. 

VIDEOS

logo