ఎల్ఆర్ఎస్కు స్పందన భేష్

క్రమబద్ధీకరణకు దరఖాస్తుల వెల్లువ
శుక్రవారం వరకు వచ్చిన దరఖాస్తులు 3,170
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. అక్రమ లేఅవుట్లు 222
క్రమబద్ధీకరించుకోవాల్సిన ప్లాట్లు 40 వేల పైనే
సవరణ ఉత్తర్వులతో తగ్గనున్న క్రమబద్ధీకరణ చార్జీలు
నాలా చార్జీలు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు
శ్లాబులు పెంచి చార్జీలు తగ్గించిన సర్కారు
రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువే వర్తిస్తుందని వెల్లడి
పేద, మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గొప్ప ఊరటను కల్పించింది. శ్లాబులను పెంచి చార్జీలను తగ్గిండచంతోపాటు నాలా చార్జీలను ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు భారీ స్పందన రానుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 222 వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారికంగా గుర్తించగా..40,150 వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ పథకం అమలులోకి రాగా ఇప్పటివరకు 3,170 వరకు దరఖాస్తులు వచ్చాయి. సవరణ ఉత్తర్వులతో చార్జీలను భారీగా తగ్గించడం.. యాప్ ద్వారా అత్యంత సులభంగా దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించడంతో గతంలో కన్నా ఈసారి స్పందన బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.”
ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో ప్రభుత్వం కఠిన వైఖరీని అవలంభించింది. ఈ క్రమంలోనే అనధికార, అక్రమ లే అవుట్లకు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయమని, ఇలాంటి లే అవుట్లలో భవన నిర్మాణాలకు సైతం అనుమతులను జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయం అనుమతులు పొందని వ్యక్తిగత ప్లాట్ల యజమానులు, లే అవుట్ల డెవలపర్లలో గుబులు రేపింది. దీంతో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. మొదట్లో జారీచేసిన జీవోలో చార్జీలు అధికంగా ఉన్నాయంటూ దరఖాస్తుదారులు వెనుకంజ వేయడంతో ఆశించిన మేరలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు రాలేదు. జనం బాధ తెలిసిన ప్రభుత్వం చార్జీలను తగ్గించి ఆర్థికంగా ఉపశమనం కల్పించింది. జీవో నెం.131ని సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నివర్గాల ప్రజలకు గొప్ప ఊరటను కల్గిస్తోంది.
పేదలపై తగ్గనున్న భారం..
ఎల్ఆర్ఎస్ పథకం అమలు ఆరంభం సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలో 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14 శాతాన్ని చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా స్లాబ్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ప్రయోజనం కలుగనుంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించాల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొని ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల వారికి ఉపశమనం కల్పించింది.
జిల్లాలో ఎల్ఆర్ఎస్కు 3,170 దరఖాస్తులు
జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 30 వరకు అక్రమ లే అవుట్లను గుర్తించగా.. 1,200 వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకునేందుకు 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 42 అక్రమ లే అవుట్లలో 6వేల వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉండగా ఎల్ఆర్ఎస్ కోసం 1,266 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 83 వరకు ఉన్న లే అవుట్లకు సంబంధించి 10వేల వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించకోవాల్సి ఉండగా 700 దరఖాస్తులు వచ్చాయి. ఆలేరు మున్సిపాలిటీలో 16 అక్రమ లేఅవుట్లు ఉండగా వీటిల్లో 470 వరకు అనధికార ప్లాట్లు ఉన్నాయి. క్రమబద్ధీకరణ కోసం 270 దరఖాస్తులు వచ్చాయి. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా 39 అక్రమ లే అవుట్ల పరిధిలో 22వేల వరకు ప్లాట్లను అనధికార ప్లాట్లుగా గుర్తించారు. వీటిలో కేవలం 486 దరఖాస్తులు మాత్రమే క్రమబద్ధీకరణ కోసం వచ్చాయి. మోత్కూరు మున్సిపాలిటీలో ఉన్న 12 అక్రమ లే అవుట్లలో 480 వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉండగా 248 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రేపటి నుంచి దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ప్లాట్ మార్కెట్ విలువ
(చదరపు గజానికి రూ.ల్లో) చార్జీలు
3,000లోపు - 20శాతం
3,001 - 5,000 - 30శాతం
5,001 - 10,000 - 40శాతం
10,001 - 20,000 - 50శాతం
20,001 - 30,000 - 60శాతం
30,001 - 50,000 - 80శాతం
50,000 లకు పైన - 100శాతం
యజమానులకు భారీ ఊరట
ప్రభుత్వం గత నెల 30న అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉత్తర్వుల జారీ చేసింది. అయితే అందులో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. పాత రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజులు చెల్లించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంలో యజమానులను భారీ ఊరట లభించింది. ప్రస్తుత జీవో సబబుగానే ఉంది.
-వంటేరు ఇంద్రసేనారెడ్డి, మాసాయిపేట
ఎల్ఆర్ఎస్ కట్టుకోవడం మంచి అవకాశం
అక్రమ వెంచర్లను రెగ్యులరైజేషన్ చేయడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ఈ ఎల్ఆర్ఎస్ విధానం ఉంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తులో ఇంటి నిర్మాణంలో కాని, ఇంకా ఇతర ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వమే చక్కని అవకాశం కల్పించింది. దీంతో చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ అవకాశం అక్టోబర్ 15 వరకు ఉంది. కాబట్టి ప్రతిఒక్కరూ ఎల్ఆర్ఎస్ చెల్లించుకునే వీలు కలుగుతుంది. నేరుగా కట్టుకోలేనివారు ఆన్లైన్ ద్వారా చెల్లించి తమ ప్లాట్‌ను చట్టబద్ధం చేసుకోవచ్చు.
- బాలశంకర్( కమిషనర్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ)
ఎల్ఆర్ఎస్ ఉంటేనే మౌలిక వసతులు
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లే అవుట్లు, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పొంది ఉంటేనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక వసతులు ఏర్పాటు జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 42 అక్రమ లే అవుట్లు ఉన్నాయి. వాటికి 6వేల దరఖాస్తులు రావల్సి ఉండగా 1266 దరఖాస్తులు వచ్చాయి.. అక్రమ లే అవుట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లించి అధికారిక లే అవుట్లుగా మార్చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-కృష్ణవేణి, భువనగిరి,
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి
తాజావార్తలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!