ఆదివారం 25 అక్టోబర్ 2020
Yadadri - Sep 07, 2020 , 01:47:47

వేగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పనులు

వేగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పనులు

త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణభవన్‌

పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పూర్తి సహకారం

నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న గులాబీ సైనికులు

భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల సౌధాలుగా  పేరుపొందుతున్న తెలంగాణ భవనాలు జిల్లాల్లో పూర్తికావస్తున్నాయి. ఈక్రమంలో జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ (తెలంగాణ భవన్‌) నిర్మాణం చివరి దశకు చేరుకున్నది.  జిల్లాలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అనువుగా ఉండేలా టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం రూపకల్పన చేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయాల్లోనే (తెలంగాణ భవన్‌) నిర్వహించేలా సమగ్ర చర్యలు చేపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలతో కార్యాలయాలు కీలకంగా మారనున్నారు. అందు కు అనుగుణంగా పార్టీ కార్యాలయాన్ని  వేగవంతంగా ప్రారంభించేందుకు పనులను ముమ్మరం చేస్తున్నారు. పనుల్లో వేగం పెంచి కార్యాలయాన్ని అన్ని హంగులతో విజయదశమి వరకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.

రూ. 60లక్షలు సమకూర్చిన అధిష్ఠానం

జిల్లాలో నిర్మాణమవుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం(తెలంగాణభవన్‌) కోసం పార్టీ అధినాయకత్వం రూ. 60లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్టీ భవనం అన్నిహంగులతో ఉండేందుకు వీలుగా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అదనంగా మరో రూ.80 లక్షలు పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఎమ్మెల్యే పైళ్ల సహకారంతో జిల్లాలో నిర్మాణమవుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ఇతర జిల్లాలకు ధీటుగా నిలువనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎకరం స్థలం.. అన్నిహంగులతో..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా భువనగిరి పట్టణంలోని బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని సర్వేనెంబర్‌ 24లోని ఎకరం స్థలంలో టీఆర్‌ఎస్‌  పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణ పనులు చేపట్టారు. పూర్తి స్థాయిలో పనులు చేసి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనాన్ని అన్ని హంగులతో రూపుదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకువెళ్తున్నారు. పార్టీ జిల్లా కార్యాలయం అందుబాటులోకి వస్తే  టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి తుది మెరుగులు

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయంలో అనుకున్న మేర పనులు చేపడుతూ త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్థానిక నాయకులు చర్యలు చేపడుతున్నారు. నూతనంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో సమావేశ మందిరంతో పాటు, పార్కింగ్‌, వంటగంది, స్టోర్‌రూం, వాచ్‌మెన్‌ గదులు నిర్మాణమవుతున్నాయి. అందులో పార్టీ కార్యాలయం, సమావేశం హాల్‌ పనులు తుదిదశకు వచ్చాయి. వంటగది, స్టోర్‌రూం, వాచ్‌మెన్‌ గదులు 75 శాతం మేర నిర్మాణాలు జరిగాయి. 

పనులను పర్యవేక్షస్తున్న గులాబీ నేతలు 

భువనగిరిలో నిర్మాణమవుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం పనులను ఎప్పటికప్పుడు  కార్యకర్తలు, నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల్లో జాప్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  త్వరలో పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.

 త్వరలో అందుబాటులోకి ..

పార్టీ కార్యకర్తలకు, పలు పార్టీ కార్యక్రమాల కోసం  చేపడుతున్న టీఆర్‌ఎస్‌  జిల్లా  (తెలంగాణభవన్‌) కార్యాలయాన్ని అతి త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. పార్టీ అధిష్ఠానం అందించిన రూ. 60లక్షలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సొంత నిధులు రూ. 80లక్షలతో  కార్యాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నాం. ఇప్పటికే పార్టీ కార్యాలయం, సమావేశ మందిరం పనులు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలిన  పనులను వేగవంతంగా చేపట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.

 - గోమారి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ భువవగిరి పట్టణ అధ్యక్షుడు


logo