ఓటీఎస్ మరో 45 రోజులు

ఆస్తిపన్ను బకాయి చెల్లింపునకు మరో సదావకాశం
వన్‌టైం స్కీమ్‌ను పొడిగించిన సర్కారు
అక్టోబర్ 31 వరకు చెల్లించొచ్చు..
పన్ను బకాయిపై 90 శాతం వడ్డీ మాఫీ
పాత బకాయిల చెల్లింపునకు మంచి అవకాశం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వన్‌టైం సెటిల్మెంట్ స్కీం.. మున్సిపాలిటీలో పాత బకాయిలను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన సువర్ణ అవకాశం. ఎన్నో ఏళ్లుగా వడ్డీతో కలిపి తడిసిమోపెడు అయిన బకాయిల నుంచి విముక్తి పొందేందుకు ఇంతకు మించిన తరుణం మరొకటి లేదు. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ స్కీం సెప్టెంబర్ 15తో ముగియనున్నది. వన్‌టైం సెటిల్మెంట్ స్కీం అమలులోకి వచ్చినప్పటి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చారు. కరోనా పరిస్థితులు ప్రతిబంధకంగా మారినప్పటికీ కొన్ని మున్సిపాలిటీల్లో ఆశించిన మేర బకాయిలు వసూలయ్యాయి. కొన్ని చోట్ల మాత్రం బకాయిదారుల నుంచి స్పందన రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గడువును అక్టోబర్ నెలాఖరుకి పెంచింది. పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ఇంతకు మించిన మంచి అవకాశం మాత్రం దొరకదని అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రభుత్వం కల్పించిన మరో అవకాశాన్ని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు.
జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 41,031 అసెస్మెంట్లకుగాను రూ.8.23కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైం సెటిల్మెంట్ స్కీంలో బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీని పొందే అవకాశం ఉన్నప్పటికీ మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి స్పందన కరువైంది. గత 44 రోజులుగా మున్సిపల్ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బకాయిలు ఎక్కువగా ఉన్న వారిపై దృష్టిపెట్టి ఇంటింటికీ వెళ్లి బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు, ఆటోల్లో ప్రచారం చేశారు. వన్‌టైం సెటిల్మెంట్ స్కీం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో రూ.25 లక్షల మేరనే పెండింగ్ బకాయిలు వసూలయ్యాయి.
గడువు పెంపుతోనైనా వసూళ్లు పెరిగేనా?
భువనగిరి మున్సిపాలిటీలో వసూళ్లయిన రూ.19లక్షలు మినహాయిస్తే జిల్లాలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో ఆశించిన మేర బకాయిలు వసూలు కాలేదు. ఇందుకు కరోనా పరిస్థితులే కారణమన్న అభిప్రాయాన్ని మున్సిపల్ అధికారులు వ్యక్తపరుస్తున్నారు. కరోనాతో బకాయిలను చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయని బకాయిదారులు వాపోతున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడువు పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కలెక్టర్టు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్ గడువు పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. అక్టోబర్ నెలాఖరు వరకు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం బకాయిదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. గడువు పెంపుతో బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆశాభావాన్ని మున్సిపల్ అధికారులు వ్యక్తపరుస్తున్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!