ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 06, 2020 , 00:44:17

చౌటుప్పల్‌కు కొత్త వెలుగులు

చౌటుప్పల్‌కు కొత్త వెలుగులు

 పూర్తయిన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు

 రూ. 6.13 కోట్లతో నిర్మాణం

 ఇక కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌కు చెక్‌....

 తీరిన ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల

చౌటుప్పల్‌ : ఇప్పటి వరకు విద్యుత్‌ కష్టాలతో అలమటించిన చౌటుప్పల్‌ మున్సిపాలిటీవాసులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీపికబురందించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇబ్బంది పడ్డ ఈ ప్రాంత వాసులు ఇక్కట్లు తొలగిపోయాయి. దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గతంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో తల్లడిల్లుతున్నామని  వందల సార్లు వినతులు సమర్పించినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇండ్లలోని  విలువైన వస్తువులు కాలిపోవడం పరిపాటిగా మారేది. నూతన సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేరింది.  అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కరెంట్‌ సమస్యను ఈప్రాంత ప్రజలు తెలియజేశారు. కరెంట్‌ సమస్యతో గ్రామాల్లో ఉండాలంటేనే భయమేస్తుందని తెలిపారు. వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నూతన సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయించి కరెంట్‌ ఇక్కట్లకు చెక్‌పెడుతానని భరోసా ఇచ్చారు. ఇదే అయ్యే పనేనా అని ఎద్దేవా చేసిన ప్రతిపక్షాలకు  కనువిప్పు కలిగేలా యుద్ధప్రాతిపాదికన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు చేయించాడు. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే నూతన సబ్‌స్టేషన్‌ను తంగడపల్లి రోడ్డు పక్కన ఏర్పాటు చేయించాడు. దీంతో దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. 

రూ. 6.13 కోట్లతో నిర్మాణ పనులు..

చౌటుప్పల్‌ పట్టణ శివారులోని తంగడపల్లి రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  అప్పటి  ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నిర్మాణ పనులు ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను దగ్గరుండి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. సబ్‌స్టేషన్‌ను  రూ. 1.50 కోట్లు,  లైన్‌కనెక్షన్‌ తదితపర పనులను రూ. 3.50 కోట్లు కేటాయించారు. మొత్తం రూ. 6.13 కోట్ల నిధులతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే ఈ సబ్‌స్టేషన్‌ నుంచి తంగడపల్లి, చౌటుప్పల్‌ గ్రామాల్లోని గృహవసరాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పడిన దామెర, చింతలగూడెం కరెంట్‌ సరఫరా జరుగుతుంది. ఈ గ్రామాల్లోని వ్యవసాయానికి సైతం ఈ సబ్‌స్టేషన్‌ నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌ నుంచి 8ఎంఏ (మెగా వోల్టా ఆంపీయర్‌) విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఈ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల  లోవోల్టేజీ సమస్యతో పాటు విద్యుత్‌ షార్ట్‌సర్యూట్‌కు శాశ్వతంగా చెక్‌పడింది. 

చౌటుప్పల్‌కు కరెంట్‌ జిగేల్‌....

ఇప్పటి వరకు కరెంట్‌ కష్టాలతో ఇబ్బండిపడ్డ  మున్సిపాల్టీలోని పలు గ్రామాల  ప్రజలకు కరెంట్‌ బాధల నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న చౌటుప్పల్‌ వాసులకు విద్యుత్‌ సమస్య కంటి మీద కునుకు లేకుండా చేసింది. తరుచుగా లోవోల్టేజ్‌, షార్ట్‌సర్క్యూట్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు. కానీ నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో పవర్‌ కష్టాలు దూరమయ్యాయి. దీంతో చౌటుప్పల్‌ కరెంట్‌ జిగేల్‌తో వెలిగిపోతుంది. 

కరెంట్‌ కష్టాలను దూరం చేశా... 

నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో చౌటుప్పల్‌ పట్టణానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. రూ. 6.13 కోట్లతో ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయించాము.  ఇప్పటివరకు పట్టణ వాసులు ఎదుర్కుంటున్న లోవోల్టేజీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడనుంది. మున్సిపాలిటీ పరిధిలోని చౌటుప్పల్‌ తంగడపల్లి, దామెర, చింతలగూడెం తదితర గ్రామాలకు ఈ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. 

- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి


VIDEOS

logo