బుధవారం 03 మార్చి 2021
Yadadri - Sep 23, 2020 , 01:06:58

యాదాద్రి ఆలయ పనుల పురోగతిపై ఆరా

యాదాద్రి ఆలయ పనుల పురోగతిపై ఆరా

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంగళవారం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఆధ్వర్యంలో ఆలయ ఈవో గీత, ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ రవీందర్‌రావు, మెదక్‌ ఎస్‌ఈ, వైటీడీఏ ఇన్‌చార్జి ఎస్‌ఈ వసంతనాయక్‌, స్థపతి సలహాదారు ఆనందాచార్యుల వేలు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్థపతులు, ఉప స్థపతులు పరిశీలించారు. 

ముఖ్యంగా గోడలు, సాలహారాలు, గోపురాలు, బ్రహ్మోత్సవ మండపంను పరిశీలించి, ఫ్లోరింగ్‌ పనులు, ప్రధానాలయం, శివాలయాల్లో  చేపట్టిన తుదిమెరుగులను క్షుణంగా పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన సీఎం కేసీఆర్‌ ఆలయ నిర్మాణం పనులను పరిశీలించి, పలు సలహాలు సూచనలు ఇచ్చిన మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీశారు.  ఆలయంలో నర్సింహస్వామి చరిత్ర ఘట్టాలు, కట్టడాలను తంజావూరును తలపించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. కల్యాణకట్ట, బస్టాండ్‌, పుష్కరిణి రెయిలింగ్‌, రహదారుల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. 5 వేల నుంచి 10 వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్‌ సౌకర్యం, ఒకేసారి నాలుగువేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపిన నేపథ్యంలో ఆ దిశగా పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న అంశాలను క్షుణంగా పరిశీలించారు. గండిచెరువు, టెంపుల్‌ సిటీలో నిర్మించే కాటేజీ నిర్మాణం పనులను వారు పరిశీలించారు. సుమారు గంటకుపైగా ప్రధానాలయంలో కలిగి తిరిగి పనులు పరిశీలించారు. ఆలయానికి నలుదిక్కులా ఏర్పాటు చేస్తున్న ఐరావతం, సింహం విగ్రహాల అమరిక వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. 

వాటర్‌ ప్రూఫ్‌ పనుల పరిశీలన..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వాటర్‌ ప్రూఫ్‌ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌ రావు స్థపతులు, ఇంజినీర్లు, ఆర్టిటెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా వర్షపు చినుకు సైతం లీకేజీ కాకుండా ఉండేందుకు ప్రధానాలయంలో అంతర్‌, బాహ్య ప్రాకారంపై వాటర్‌ ప్రూఫ్‌ పనులు సాగుతున్నా యి. నీటి లీకేజీ లేకుండా ప్రాకారం పైభాగంలో ప్రూఫింగ్‌ రసాయనాలు, డంగు సున్నంతో నింపుతున్న పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలలో ఇంజినీర్లు తీసుకుంటున్న జాగ్రత్తలను  వారు పరిశీంచి తగు సలహాలు, సూచనలు చేశారు. 

శివాలయం పనుల పరిశీలన..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయం నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఇప్పటికే చేరుకున్న నంది విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు శివాలయం ముఖమండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపు ఉన్నటువంటి ఆవరణలో ఏర్పాటు చేసిన నంది విగ్రహం, శివాలయంలో పూర్తయిన రంగులు, ఫ్లోరింగ్‌, విద్యుత్‌ సరఫరా పనులను వైటీడీఏ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ఇంజినీర్లకు  పనులను అప్పగించారు.నెలలోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, స్థపతులు, ఉప స్థపతులకు వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది.

VIDEOS

logo