ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 20, 2020 , 01:51:01

జోరు వాన... జలాశయాలు కళకళ

జోరు వాన... జలాశయాలు కళకళ

బీబీనగర్‌ / ఆలేరు / భూదాన్‌పోచంపల్లి / చౌటుప్పల్‌ : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు నిండి అలుగులు దుంకుతున్నాయి. దీంతో శనివారం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీబీనగర్‌ మండల పరిధిలోని చిన్నేరు వాగుకు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో గూడూరు, అన్నంపట్ల, మగ్దుంపల్లి, రావిపహాడ్‌తండా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 90 చెరువులు, కుంటలుండగా ఇందులో మల్లాపురం చెరువు, మైలారిగూడెంలో గోధుమకుంట చెరువు, రామాజీపేటలో పెద్ద చెరువు, గౌరాయిపల్లిలో ఊర చెరువు, వంగపల్లిలో ఎక్క చెరువు, యాదగిరిగుట్ట పట్టణంలో గండి చెరువు, చాకలిగిద్దె కుంట, తోపుగాని కుంట, దాతారుపల్లి పెద్ద చెరువు, సాదువెళ్లిలో ఊర చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలో పిలాయిపల్లి, జూలూరు, పెద్దరావులపల్లి, ఇంద్రియాల గ్రామాలలో మూసీ నది ఉధృతంగా ప్రవహించింది. ఇక చన్నేరులో వరద భారీగా రావడంతో మెహర్‌నగర్‌ వద్ద ఉదయం రాకపోకలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌లో మధ్యాహ్నం అరగంట పాటు ఎడతెరిపిలేని వర్షం రావడంతో ద్విచక్ర వాహనదారులు తడిసి ముద్దయ్యారు. చిరువ్యాపారులు ఇబ్బందిపడ్డారు. 

పైపైకి పాతాళగంగ

భువనగిరి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పాడుపడ్డ బోర్లు, బావులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో మండలంలోని నందనంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గతంలో వేసిన బోరు నుంచి పాతాళగంగ పైపైకి ఉబికి వస్తుంది. ఎన్నో ఏండ్లుగా వినియోగంలో లేని బోరు బావి నుంచి నీరు పైకి ఉబికి వస్తుండటంతో గామ్రస్తులు శనివారం బోరుబావిని చూసేందుకు తరలివచ్చారు. 

VIDEOS

logo