శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 15, 2020 , 00:38:50

జోరు వాన...

జోరు వాన...

అలుగులు పారుతున్న చెరువులు, కుంటలు

కూలిన ఇళ్లు.. ప్రహరీలు

వలిగొండ మండలంల రికార్డుస్థాయిలో 19.3 సెం.మీ వర్షం


భువనగిరి/భువనగిరి కలెక్టరేట్‌ : యాదాద్రి జిల్లాలో సోమవారం ఉదయం వరకు 35.4 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా వలిగొండలో 193.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి మండలంలోని సూరేపల్లి, బొల్లేపల్లి సిరివేణికుంట, ఆకుతోటబావితండా తదితర గ్రామాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఆకుతోటబావితండా గ్రామానికి చెందిన కెతావత్‌ రవి ఇంటి ప్రహరీ కూలిపోయింది. ఈఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని గ్రామస్తులు తెలిపారు.

ఆలేరులో... 

ఆలేరు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో యాదగిరిగుట్ట మండలంలో 90 చెరువుల్లోకి వరద నీళ్లు వచ్చి చేరాయి. సోమవారం మల్లాపురం పెద్దచెరువు పూర్తిగా నిండి మత్తడి దుంకింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.  

వలిగొండలో...  

వలిగొండ : వలిగొండ మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో జోరువాన కురిసింది. అధికారులు తెలిపిన ప్రకారం.. మండలంలో 19.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు ఉప్పొంగాయి. వలిగొండ-నర్సయ్యగూడెం, వలిగొండ-సుంకిశాల, వలిగొండ-వెల్వర్తి, వలిగొండ-లింగరాజుపల్లి గ్రామాల మధ్య ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వలిగొండ పట్టణ కేంద్రంలోని 1వ వార్డు, 5వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి నీరుచేరడంతో నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా 525 ఎకరాల వరి పంట, 149 ఎకరాల పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మండలంలో దెబ్బతిన్న ఇండ్ల వివరాలను సేకరిస్తున్నట్లు, ప్రాణనష్టం జరుగలేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని అక్కాచెల్లెల చెరువుతోపాటు అరూరు, వెల్వర్తి, జంగారెడ్డిపల్లి, వేములకొండ, లింగరాజుపల్లి, మాందాపురం, సుంకిశాల గ్రామాల్లోని చెరువులు మత్తడి దూకి అలుగులు పారుతున్నాయి. 

కూలిన ఇల్లు.. 

ఆత్మకూరు(ఎం): రెండు రోజులుగా కురిసిన వర్షంతో మండలంలోని కూరెళ్ల వాగు ప్రవహించింది. వాగులో గ్రామస్తులు వలలతో చేపలు పట్టారు. మండల కేంద్రంలోని శాంతినగర్‌లో ఎలగందుల అండమ్మ ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో సరుకులు, వస్తువులు తడిసిపోయాయి. 

బీబీనగర్‌లో...

బీబీనగర్‌: మండలంలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంతోపాటు పాల్వాయిగూడెం, జంపల్లి తదితర గ్రామాల్లో పెంకుటిండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రుద్రవెళ్లి, భట్టుగూడం గ్రామాల వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహిస్తుంది.

పిల్లాయిపల్లి కాల్వకు గండి.. 

చౌటుప్పల్‌ రూరల్‌ : మండల పరిధిలో ఎడతెరపిలేని వర్షంతో మండల వ్యాప్తంగా 44.2 మిల్లీ మిటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో పిల్లాయిపల్లి కాల్వ పరిహక ప్రాంతంలోని చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. చిన్నకొండూర్‌ గ్రామ సమీపంలోని పిల్లాయిపల్లి కాల్వకు సోమవారం సాయంత్రం గండి పడి నీరు పంట పొలాల మీదుగా వృథాగా పోతోంది. 

జలదిగ్బంధంలో సూరారం... 

రామన్నపేట: రెండురోజులుగా కురిసిన వర్షాలకు తోడుగా శాలిగౌరారం కాల్వ ఉధృతి పెరగడంతో మండలంలోని సూరారం గ్రామంలోని ఎస్సీ కాలని పూర్తిగా జల దిగ్బంధమైంది. ఆదివారం రాత్రి ఇండ్లలోకి నీరు రావడంతో భయంతో వణికిపోయారు. సూరారంలో నుంచి శౌలిగౌరారం కాల్వ ప్రవహిస్తుంది. పల్లివాడ కత్వ వద్ద నుంచి కాల్వకు నీటిని వదులుతారు. తూముల తలుపులు దెబ్బతినడటంతో మూసీలో నీటి ఉధృతి పెరగడంతో అర్ధరాత్రి ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. 50 ఇండ్లలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర సామగ్రి పూర్తిగా తడిసిపోయింది. మండలంలో 6.18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సూరారం శివారులో శాలిగౌరారం కాల్వకు గండి పడింది. కుంకుడుపాముల గ్రామంలోని కుంటకు గండి పడటంతో అమ్మనబోలు-రామన్నపేట మార్గంలో వరదనీటితో రోడ్డు కోతకు గురైంది. మండల వ్యాప్తంగా 10 ఇండ్లు నేల కూలాయి. అధికారుల లెక్కల ప్రకారం.. 60 ఎకరాల వరిపొలం నీట మునిగింది.

రాజాపేటలో... 

రాజాపేట : రెండురోజులుగా కురిసిన వర్షంతో మండలంలోని సింగారం, జాల, కుర్రారం, మల్లెగూడెం, పాముకుంట, బొందుగుల చెరువులు రెండోసారి అలుగు పారుతున్నాయి. అదే విధంగా పొట్టిమర్రి వాగు సైతం ప్రవహిస్తుంది.   VIDEOS

logo