శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 22, 2020 , 22:57:42

యాదాద్రి జిల్లాలో విస్తరిస్త్తున్న మహమ్మారి వైరస్‌

యాదాద్రి జిల్లాలో విస్తరిస్త్తున్న మహమ్మారి వైరస్‌

మోటకొండూర్‌: మండలంలోని చాడ గ్రామంలో ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  హైదరాబాద్‌లో ఉంటున్న గ్రామానికి చెందిన మరో వ్యక్తి వైన్స్‌లో పని చేస్తాడు. అయితే ఇటీవల వైన్స్‌ యజమాని ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వచ్చాడు.వైన్స్‌ యజమానికి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రాగా, ప్రైమ రీ కాంటాక్ట్‌ ఉన్న ఇతనికి పరీక్షలు నిర్వహించగా సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు అతనిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. అతనితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న ఏడుగురిలో ముగ్గురిని ఎయిమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు, నలుగురిని హోం క్వారంటైన్‌కు తరలించామని, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న 19 మం దిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించామని వైద్యులు తెలిపారు. గ్రామ పరిసరాలను హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేయించారు.  

 భువనగిరిలో.... 

భువనగిరి అర్బన్‌ : భువనగిరి పట్టణంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. ఇతను బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు రావడంతో  ఆపరేషన్‌ చేయించుకోవడానికి మూడు రోజుల క్రితం భువనగిరికి వచ్చాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు వెళ్లగా అక్కడ ముందుగా కరోనా పరీక్ష లు నిర్వహించారు. సోమవారం  పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. అతని కుటుంబసభ్యులు ముగ్గురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

 చౌటుప్పల్‌లో మరో నలుగురు ... 

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ కూరగాయల మార్కెట్‌లో మరో నలుగురు వ్యాపారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. ఇటీవల ఇద్దరు వ్యాపారులకు కరోనా రావడంతో అధికారులు మొత్తం 60 మంది వ్యాపారులకు కరోనా పరీక్షలు చేశారు. ఇందులో నలుగురికి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది.  వీరి కాంటాక్టులోని మరో 18 మందిని వైద్య బృందం హోంక్వారంటైన్‌కు తరలించారు. కాగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ కేంద్రంలో 9 మందికి కరోనా రాగా అందులో ఒకరు మృతి చెందారు.  మిగిలిన 8 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

హోంక్వారంటైన్‌లో 351మంది 

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 351మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సాంబశివరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 274 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో 14 మంది ఉన్నట్లు తెలిపారు.

మోత్కూరు: ఇతర రాష్ర్టాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన నలుగురిని హోం క్వారంటైన్‌ చేసినట్లు మండల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్‌ నుంచి పాటిమట్లకు వచ్చిన ఒకరిని, చెన్నై నుంచి పాలడుగుకు వచ్చిన ఇద్దరిని, ఛత్తీస్‌ఘఢ్‌ నుంచి మోత్కూరుకు వచ్చిన ఒకరిని హోంక్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. వారిని ఇండ్ల నుంచి బయటికి వెళ్ల కుండా ఉండాలని, ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి స్టాంపింగ్‌ చేసినట్లు తెలిపారు. మండలంలో ఇంకా ఇతర రాష్ర్టాల, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను వైద్య సిబ్బందికి తెలియజేసి కరోనా నివారణలో సహకరించాలని కోరారు.

 బీబీనగర్‌ ఎయిమ్స్‌కు ముగ్గురు...  

వలిగొండ : కరోనా వైరస్‌ సోకిన వారిని కలిసిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి మండల వైద్యాధికారులు బీబీనగర్‌ ఎయిమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు సోమవారం తరలించారు. మండల వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో వారి బంధువుల ఇండ్లల్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. శుభకార్యం నిర్వహించిన వారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఈ ముగ్గురిని గుర్తించి బీబీనగర్‌ ఎయిమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు.  

VIDEOS

logo