ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 06, 2020 , 00:44:13

కరోనా కట్టడికి కట్టుదిట్ట చర్యలు

కరోనా కట్టడికి కట్టుదిట్ట చర్యలు

గుట్టలో కొవిడ్‌ విస్తరించకుండా రసాయనాల పిచికారీ

మరింత పకడ్బందీగా పారిశుధ్య పనులు

యాదాద్రి,నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రు. యాదాద్రి లక్ష్మీనరసింహుడి దర్శనానికి రాష్ట్రంలోని వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటంతో ఇక్కడి వ్యాపారులకు కరోనా సోకుతుంది. అలాగే వీరి ద్వారా స్థానికులకు కూడా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా కరోనా బారిన పడ్డారు. పట్టణంలో రోజూ దాదాపు నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఈ వారంలో ముగ్గురు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరించకుండా మున్సిపాలిటీ పరిధిలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. 

సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ..

పట్టణ పరిధిలోని నిత్యం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సుమారు 5,000 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ట్యాంకర్‌ ద్వారా పిచికారీ చేస్తున్నారు. కాలేజీలు, పాఠశాలల గదుల్లోనూ రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. అలాగే ఖాళీ ప్లాట్లు, మోరీల స మీపంలో రోజు విడిచి రోజు సుమారు 100 కిలోల బ్లీచింగ్‌, 100 కిలోల గమాగ్జిన్‌ చల్లుతున్నారు. కరోనా వచ్చిన వారి ఇండ్ల సమీపంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోజుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. సాయంత్రం వేళ జనాల రద్దీ పెరుగకుండా ఈ నెల 1 వరకు దుకాణాలను సాయంత్రం 5 వరకే అనుమతించారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మరింత పకడ్బందీగా పారిశుధ్య పనులు..

పారిశుధ్య పనులు మరింత పకడ్బందీగా చేపడుతున్నారు. మున్సిపాలిటీలో పనిచేసే  46 మంది పారిశుధ్య కార్మికులకు ఇటీవలే రక్షణ కిట్లు, మాస్కులు, బూట్లు, క్యాపులు అందజేశారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి నాలుగు స్వచ్ఛ ఆటోలు తెప్పించారు. వీటితో పాటు గతంలో ఉన్న ఒక ట్రాక్టర్‌, రెండు ట్రాలీ ఆటోల ద్వారా నిత్యం 9 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. రోజూ పారిశుధ్య పనులు చేపడుతూ వీధులను శుభ్రంగా ఉంచుతున్నారు. అలాగే దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తున్నారు. 

గుట్టలో లాక్‌డౌన్‌ విధించాలని వినతి..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్టలో 20 రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజితకు వినతిపత్రం అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా వ్యాపారులకు వారి ద్వారా స్థానికులకు కరోనా విస్తరిస్తుందని వినతిలో పేర్కొన్నారు. అత్యవసరాలకు మాత్రమే అనుమతించి పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, కౌన్సిలర్‌ బూడిద సురేందర్‌, నాయకులు హేమేందర్‌, అంకం నర్సింహ, గడ్డం చంద్రం, షేక్‌ దావూద్‌, కిసరి బాలరాజు, గొర్ల భాస్కర్‌ తదితరులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ నాయకులు కూడా గుట్టలో లాక్‌డౌన్‌ విధించాలని కోరుతూ మున్సిపల్‌ కమిషనర్‌కు  వినతిపత్రం అందజేశారు. VIDEOS

logo