శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Sep 21, 2020 , 01:04:46

కరువు నేలలో కష్టాన్ని నమ్ముకుని...

కరువు నేలలో కష్టాన్ని నమ్ముకుని...

రాజాపేట : ఆరుగాలం కష్టాన్ని నమ్ముకున్న రైతు పేరు గుంటి కృష్ణ, రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆయనకు 10 ఎకరాలు ఉంది. ఐదేండ్ల క్రింతం తన పొలంలో 10 బోర్లు తవ్వించాడు. ఐదు బోర్లు ఫెయిల్‌ కాగా, మరో ఐదు బోర్లలో అంతంత మాత్రమే నీళ్లు వచ్చాయి. సాగుకు సరిపడ నీళ్లు లేక ఉన్న ఎకరం వరి పంట ఎండిపోయింది. ప్రత్యామ్యాయంగా పాడి పరిశ్రమను ఎంచుకున్నాడు. రెండు ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేసి 5 నుంచి 10 పాడి ఆవులతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేశాడు. దాణా, పశుగ్రాసానికి పెరిగిన ధరలతో అందులోనూ  అంతంత మాత్రమే లాభాలు వచ్చాయి. ఎండాకాలంలో పశువులకు నీళ్లు దొరకక తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నాడు. 

రెండేండ్ల నుంచి... 

రెండేండ్ల నుంచి కృష్ణ నీటి కష్టాలు తీరాయి. వర్షాలు అధికంగా కురుస్తుండడంతో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు అలుగు పారుతుంది.దీంతో వాగు పరిహక ప్రాంతంలోని బోరు బావుల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. దీంతో పాడి పరిశ్రమకు స్వస్తిపలికి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాడు. భూగర్భ జలాలు పెరగడం, వరుణుడు కరుణించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న 10 ఎకరాల భూమిలో వరిని సాగు  చేశాడు. ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది.

మరింత భూమి కౌలు తీసుకుని...

గంధమల్ల చెరువు మళ్లీ నిండి వాగు పారడంతో తనకున్న 10 ఎకరాల భూమితో పాటు మరో 10 ఎకరాల భూమిని ఎకరానికి 5 వేల చొప్పున ఇచ్చి కౌలు తీసుకున్నాడు. సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు నియంత్రిత సాగుపై దృష్టి సారించి 10 ఎకరాలు దొడ్డు రకం, 10 ఎకరాలు సన్నరకం వరి సాగు చేశాడు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాడు. సాంకేతికతను జోడించి రసాయన ఎరువులు తగ్గించాడు. ఇప్పటి వరకు వరికి ఎటువంటి చీడపీడలు సోకకుండా చిరుపొట్ట దశలో ఉంది. అధిక దిగుబడి వచ్చి అప్పులు తీరుతాయని ఆశతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

పశువులకు నీళ్లు లేకుండె.. 

ఐదేండ్ల క్రితం బోర్ల కోసం లక్షల రుపాయాలు ఖర్చు పెట్టాను. బోర్లల్లో నీళ్లు లేక పాడి పరిశ్రమతో ఉపాధి పొందాను. మూడేండ్ల క్రితం పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి. రెండేండ్లుగా వర్షాలు మంచిగ పడుతున్నయి. గంధమల్ల చెరువు నిండి వాగు పారుతుంది. బోరు బావుల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. దీంతో మళ్లీ ఎవుసంపై ఆసక్తి పెరిగింది. ఈ సారి పంట దిగుబడి పెరుగుతుంది. అప్పులు తీరుతాయి. 

- గుంటి కృష్ణ, రైతు