సోమవారం 08 మార్చి 2021
Yadadri - Sep 07, 2020 , 01:48:49

శానిటైజర్లతో జాగ్రత్త!

శానిటైజర్లతో  జాగ్రత్త!

అతిగా వాడితే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే.. 

మండే స్వభావం కలిగిన వాటితో ప్రమాదాలకు ఆస్కారం

అవగాహన లేకుంటే నష్టాలే అధికం

సబ్బు వినియోగమే మేలంటున్న వైద్యనిపుణులు

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా శానిటైజర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి ఎంత వరకు శ్రేయస్కరం..? అతిగా వాడితే కలిగే దుష్పరిణామాలు ఏమిటో..? అందరికీ తెలియదు. డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన రెండు రకాల శానిటైజర్లకు మండే స్వభావం ఉంది. వీటి వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఎక్కువ. సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సూర్యాపేట టౌన్‌  

 కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఇతరుల నుంచి కరోనా సోకకుండా రక్షణ పొందేందుకు వీటి వాడకం పెరిగిపోయింది. కార్యాలయాలు, దవాఖానలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు.. ఇలా ఎక్కడ చూసినా శానిటైజర్లు కన్పిస్తుంటాయి. వీటిని అతిగా వాడడం చాలా వరకు ప్రమాదకరమని, అలసత్వం వహిస్తే అగ్ని ప్రమాదాలు.. అశ్రద్ధ చేస్తే అరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నా.. వాడకం ఏమాత్రం తగ్గడం లేదు. శానిటైజర్ల కంటే సబ్బులే సురక్షితమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదాలకు అవకాశం... 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రెండు రకాల శానిటైజర్లు మండే స్వభావం కలిగి ఉన్నాయి. ఇందులో ఒకటి ఐసో ప్రోపైల్‌ ఆల్కహాల్‌ (ఐపీఏ), రెండోది ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌. ఈ రెండింటికీ మండే స్వభావం ఉంటుందని ప్రముఖ వైద్యులు తెలుపుతున్నారు. ఐపీఏ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 75 శాతం ఆల్కహాల్‌ ఉంటుందని, ఇక ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 80 శాతం ఇథనాల్‌ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

సబ్బుతో చేతులు కడుక్కోవడం మేలు...

మార్కెట్‌లోకి నకిలీ శానిటైజర్లను తయారు చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా నకిలీ శానిటైజర్లు అమ్ముతూ ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందని ప్రజలు వీటినే కొనుగోలు చేసి రోగాల బారినపడుతున్నారు. శానిటైజర్ల కంటే సబ్బుతో చేతులను శుభ్రం గా కడుక్కోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. 

మార్కెట్‌లో మిథనాల్‌ ఆధారిత శానిటైజర్లే ఎక్కువ 

డిమాండ్‌ పెరగడంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకు లభించే మిథనాల్‌తో తయారు చేసినా శానిటైజర్లను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీనివల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐపీఏ లీటర్‌కు రూ.250, ఇథనాల్‌ లీటర్‌కు రూ.49, అయితే మిథనాల్‌ కేవలం లీటర్‌కు రూ.19కే లభిస్తుండడంతో ప్రజలు దీనినే కొనుగోలు చేస్తున్నారు. 

శానిటైజర్ల వాడకంపై జాగ్రత్తలు తప్పనిసరి

శానిటైజర్లను ప్రత్యేక గదుల్లో భద్రపరచడం ఉత్తమం. చేతులకు శానిటైజర్‌ రుద్దుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి స్టౌ వెలిగించడం, కరెంట్‌ స్విచ్‌లు వేయడం, రోగులకు ఆక్సిజన్‌ పెట్టడం వంటివి చేయకూడదు. ధూమపానం అలవాటు ఉన్నవారు సైతం అప్రమత్తంగా ఉండాలి. శానిటైజర్ల వలన బ్యాక్టీరియా, వైరస్‌ మాత్రమే నశిస్తుంది. సబ్బుతో కడుక్కుంటే మలినాలు కూడా పోతాయి. సాధ్యమైనంత వరకూ సబ్బునే వాడడం మంచిది.       

- కర్పూరపు హర్షవర్ధన్‌, 

డీఎంహెచ్‌ఓ, సూర్యాపేట

తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 

  స్టెరిలైజేషన్‌ రూమ్‌లు, విద్యుత్‌ కంట్రోల్‌ రూంలలో శానిటైజర్లను నిల్వ చేయరాదు.

  గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్‌ పంపుల వద్ద పెట్టరాదు.

  శానిటైజర్‌ పెట్టుకున్న వెంటనే వంటగదిలోకి వెళ్లరాదు. 

  శానిటైజర్‌ రుద్దడం వల్ల కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంది.

  రుద్దుకొని నేరుగా ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

  పిల్లలకు శానిటైజర్లను దూరంగా ఉంచాలి.

  అలవాటు ఉన్నవారు సైతం శానిటైజర్‌ వాడకంలో అప్రమత్తంగా ఉండాలి.

  బానిసలైన వారికి అందుబాటులో శానిటైజర్లు నిల్వ ఉంచకూడదు.

VIDEOS

logo