ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 23, 2020 , 01:06:47

బంగారు భవితకు బాసర ట్రిపుల్‌ ఐటీ

బంగారు భవితకు బాసర ట్రిపుల్‌ ఐటీ

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

నైపుణ్యులైన బోధనా సిబ్బంది  

అత్యున్నత ల్యాబ్‌లు.. మెరుగైన వసతులు.. 

ఆరేళ్ల సమీకృత కోర్సుతో ఉన్నతికి బాటలు  

సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్‌గా ఆర్‌జీయూకేటీ

దేశ, విదేశాల్లో సత్తా చాటుతున్న విద్యార్థులు  

2020-21 విద్యాసంవత్సర నోటిఫికేషన్‌ విడుదల

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సువర్ణావకాశం

చదువుల తల్లీ బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలోని ఆర్‌జీయూకేటీ(రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ) గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంలా మారింది. 273 ఎకరాల ప్రశాంత వాతావరణంలో క్యాంపస్‌ ఉంది. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన గ్రామీణ విద్యార్థులకు ఈ విద్యాసంస్థలో చేరే అవకాశం దక్కుతుంది. ఐసీటీ(ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ) ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తుండగా, సుమారు 7 వేల మంది విద్యార్థులు, 230 మంది ఫ్యాకల్టీ, 110 మంది సహాయక సిబ్బంది, 420 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు.

- బాసర 

ఆఫర్‌ చేస్తున్న కోర్సులు

ఈ యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఏడు విభాగాలు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలో 3 విభాగాలు ఉంటాయి. ఆరేళ్ల సమీకృత కోర్సులో పీయూసీ(ప్రీ యూనివర్సిటీ కోర్స్‌) మొదటి రెండేళ్లు ఉంటుంది. అనంతరం బీటెక్‌ నాలుగేళ్లు. యూజీలోని ఏడు విభాగాల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలాజికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ ఉంటాయి. ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఉన్నాయి.

మెరుగైన వసతులు, అత్యాధునిక భవనాలు

ఈ యూనివర్సిటీలో మూడు అకాడమిక్‌ బ్లాకులు, ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్‌తో అత్యున్నతస్థాయి లేబొరేటరీలు, రెండు వేల మంది విద్యార్థులకు సరిపోయే విధంగా మూడు మెస్‌ బ్లాక్‌లున్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా ఆరు హాస్టల్‌ భవనాలున్నాయి. క్యాంపస్‌లో ల్యాండ్రోమ్యాట్‌, బ్యాంక్‌, రెండు ఏటీఎంలు, పోస్టాఫీస్‌, 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అంతేగాకుండా ఇండోర్‌, ఔట్‌డోర్‌ రిక్రియేషనల్‌ సదుపాయాలు, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌ ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలున్నాయి.

వినూత్నమైన విధానాలు, సాధించిన విజయాలు

ఎంహెచ్‌ఆర్‌డీ డిజిటల్‌ విధానం ద్వారా వందలాది హై క్వాలిటీ కోర్సులను ప్రవేశ పెట్టింది. ఇందులో ఎన్‌పీటీఎల్‌(నేషనల్‌ ప్రొగ్రాం ఆన్‌ టెక్నాలజీ ఎస్‌హ్యాన్స్‌డ్‌ లెర్నింగ్‌) ముఖ్యమైనది. ఇందులో బాసర యూనివర్సిటీ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కోర్సుల్లో ముగ్గురు విద్యార్థులు టాప్‌గా ఉండడం యూనివర్సిటీకి గర్వకారణం. మే 2017లో నిర్వహించిన పరీక్షల్లో ఎన్‌పీటీఎల్‌ కోర్సుల్లో యూనివర్సిటీ నుంచి ఏడుగురు విద్యార్థులు టాప్‌లో నిలిచి, రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించారు. నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో ఇక్కడి విద్యార్థులు రెండు సార్లు ప్రతిభ చూపారు. అలాగే విద్యార్థుల కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ఉద్యోగం అడిగే వారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లడమే లక్ష్యంగా తీర్చిదిద్దుతున్నారు.

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ట్రిపుల్‌ ఐటీలో 2020-21 విద్యాసంవత్సరంలో చేరేందుకు  బుధవారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్‌ 3గా నిర్ణయించారు. అక్టోబర్‌ 20న జాబితాను వెల్లడించనున్నారు.

ఈ ఏడాది పెరగనున్న పోటీ

ట్రిపుల్‌ ఐటీలో ఈసారి తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. పదోతరగతిలో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు ఈ విద్యాసంస్థలో సీటు దక్కుతుంది. ఈ ఏడాది దాదాపు లక్షా 30 వేల మందికి 10 జీపీఏ వచ్చినట్లు అంచనా. వీరిలో 35 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఉన్నారు. యేటా దాదాపు 1500 సీట్లకు గాను 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చేవి. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో పోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది.

విద్యార్థులు సాధించిన విజయాలు.. 

గేట్‌ 2017లో టాప్‌ ర్యాంకులు సాధించారు. 

గేట్‌ ద్వారా డీఆర్డీవో, ఐఎస్‌ఆర్‌వో, బార్క్‌ వంటి ఉద్యోగాలు సాధించారు.

తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖలు, నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లుగా సుమారు 185 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 

టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో లో అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా 30 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 

సాధించిన అవార్డులు.. 

ఐసీటీ ఆధారిత విద్యా అవార్డులు.. 2018లో నిర్వహించిన 13వ వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ప్రత్యేక అవార్డు  

ముంబైలో జరిగిన ఇన్నోవేషన్‌, ఇంక్యూబేషన్‌, ఎంటర్‌ ప్రెన్యూయర్‌ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువతకు అత్యంత ప్రాధాన్యం కల్పించినందుకు ఈ అవార్డు సాధించారు.

2019లో ఇండియన్‌ మోస్ట్‌ ట్రస్టెడ్‌ ఎడ్యుకేషన్‌ అవార్డు  

2019లో 15వ వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ అవార్డు  

2018లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

2018లో థాయ్‌లాండ్‌లో ఆసియా బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ అవార్డు

కీలకంగా మారనున్న పుట్టిన తేదీ

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందాలంటే వివిధ సామాజిక రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుం టారు. ఇందులో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. రెండో దశలో విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో సాధించిన జీపీఏ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం అవి కూడా సమానమైతే మూడో దశలో విద్యార్థి పుట్టిన తేదీ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరిలో ఎవరికి ఎక్కువ వయస్సు ఉంటే వారినే ఎంపిక చేస్తారు. దీంతో విదార్థి ఎంపికలో పుట్టిన తేదీ కీలకంగా మారనుంది. పుట్టిన తేదీ కూడా సమాన మైతే విద్యార్థి హాల్‌టికెట్‌ నంబర్‌ ర్యాండమ్‌ ప్రకారంగా ఎంపిక చేయనున్నారు. ఈసారి పదోతరగతి హాల్‌టికెట్‌లో మొత్తం పది అంకెలు ఉన్నాయి. ఇందులో తొలి ఐదు అంకెలను 253తో గుణించి, తరువాత చివరి ఐదు అంకెలను గుణించిన దాంతో భాగించడం ద్వారా వచ్చే సంఖ్యే ర్యాండమ్‌ నంబర్‌. ఇలా ఇద్దరు విద్యార్థుల పుట్టిన తేదీ సమానమైతే ర్యాండమ్‌ నంబర్‌ ఎవరిది తక్కువగా ఉంటే వారిని ఎంపిక చేస్తారు. 

ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షలు షురూ

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులకు బుధవారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, కొవిడ్‌ 19 దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు విద్యార్థులు మాస్కు ధరించాలని, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. VIDEOS

logo