సోమవారం 30 నవంబర్ 2020
Yadadri - Oct 23, 2020 , 20:18:00

అప్ర‌మ‌త్త‌తే ఆయుధం : మ‌ంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

అప్ర‌మ‌త్త‌తే ఆయుధం : మ‌ంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

న‌ల్ల‌గొండ : బతుకమ్మ సంబరాలను ఇండ్ల వద్దకే పరిమితం చెయ్యడంతో పాటు ద‌స‌రా నాడు సామూహికంగా జమ్మి పూజల్లో పాల్గొనకుండా ఉండ‌ట‌మే మేలు అని, ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌తే ఆయుధంగా మ‌ల్చుకోవాల‌న్నారు మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి. తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే ప్రతి పండుగను జరుపుకోవాల్సిందే కానీ అదే స‌మ‌యంలో ప్రస్తుతం ఉన్న క‌రోనా ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌ల‌కు మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. బతుకమ్మ, విజయదశమి సంబురాలు సామూహికంగా జరుపుకోవడం వల్ల వైర‌స్ భారిన ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

పైగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలతో రోగాలు మ‌రింత ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. వీట‌న్నింటిని అధిగమించేందుకు ప్రభుత్వ పరంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని ప్రజలు అందులో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరాన్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌న్నారు. ఓనం వేడుకలను సామూహికంగా జరుపుకోవడం వ‌ల్ల కొవిడ్ విజృంభించి కేరళ రాష్ట్రానికి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయన్నారు. అదే పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాల‌ని కోరారు.