మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Sep 20, 2020 , 01:50:57

ఆరేండ్ల ప్రగతి పర్యావరణ పురోగతి

ఆరేండ్ల ప్రగతి పర్యావరణ పురోగతి

జీవరాశులు నేడు ఇక్కడి చిట్టడి

స్వరాష్ట్రంలో పర్యావరణంలో పెనుమార్పులు  

సకల జీవరాశులకు అనుకూలంగా పచ్చని అడవులు

తంగేడు వనం స్ఫూర్తితో ఊరూరా ప్రకృతి వనాలు 

గోదావరి జలాలతో పెరిగిన అపార మత్స్య సంపద

కనుమరుగైన జీవరాశులు నేడు పల్లెల్లో సాక్షాత్కారం

ఇటు వానలు, అటు గోదారితో పెరుగుతున్న జలసంపద 

జిల్లాలో వెల్లివిరుస్తున్న జీవ వైవిధ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కురవని మేఘాలు.. జలకళను కోల్పోయిన చెరువులు.. బీడు బారిన పొలాలు.. అడివిని అంతం చేయడమే తప్ప పంతంగా బతికించేవారు కనిపించని కాలంలో.. జీవ రాశుల మనుగడే ప్రశ్నార్థకమైన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం భావి తరాల బాగుకోసం నడుం బిగించింది. ఆరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ తలపెట్టిన కార్యాలు ఫలించాయి. కార్యదీక్ష ఫలించింది. ఒకప్పటి గడ్డు పరిస్థితులు మటుమాయం అయ్యాయి. మొత్తంగా జిల్లాలో జీవావరణంలో పెను మార్పులు వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఊరికి ఆదెరువు.. జలకళలాడుతున్నది.. బీడు భూములు సాగు కళను సంతరించుకున్నాయి. మోడువారిన అడవులు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కనుమరుగైపోయిన జంతుజాలాలు తిరిగి కనిపిస్తున్నాయి. పరవళ్లు తొక్కుతున్న గోదావరి గలగలలు, ఒనగూరిన మత్స్య సంపద ఓ వైపు.. విదేశీ పక్షుల సందడి.. సకల జీవరాశుల పునరాగమనంతో ప్రకృతి రమణీయత కండ్లముందు ఆవిష్కృతమవుతోంది. జీవ వైవిధ్యానికి బీజం వేసిన జిల్లాలోని చిట్టడువులు రాష్ర్టానికే స్ఫూర్తిగా నిలిచి పుడమి తల్లిని పులకరింపజేస్తున్నాయి. 

గోదావరి గలగలలు..

కరువుకు మారుపేరుగా నిలిచిన జిల్లాలో నేడు గోదావరి గలగలలు వినిపిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో రూ.350 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులతో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రతి యేటా జిల్లాలో చేపడుతున్న హరితహారంతో ఎటుచూసినా పచ్చదనం వెల్లివిరుస్తోంది. పెరిగిన భూగర్భ జలాలు.. బీడు భూములను అభిషేకిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చర్యల మూలంగా సకల జీవరాశులతో జిల్లా ఓలలాడుతున్నది.  

జీవవైవిధ్యానికి నిలయంగా జిల్లా.. 

జిల్లాలో 111.733 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అట వీ సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కనుమరుగైన ఎన్నో జీవరాశులు నేడు ఈ ప్రాంతంలో సాక్షాత్కరిస్తున్నాయి. హరితహారంలో భాగంగా రాచకొండ, లక్కారం, బీబీనగర్‌, కొండమడుగు, వీరారెడ్డిపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో ప్రతి యేటా లక్షల మొక్కలను నాటుతుండటంతో ఎటుచూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఇక్కడి అటవీ ప్రాంతంలో శాఖాహారానికి సంబంధించి నెమళ్లు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు, కొండముచ్చులు తదితర జంతువులు, మాంసాహారానికి సంబంధించి హైనా, అడవి పిల్లి, తోడేలు తదితర జంతువుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారీ వృక్షాలతోపాటు ఔషధ గుణాలు న్న ఎన్నో జాతుల వృక్షాలకు ఇక్కడి అడవులు నెలవుగా మారాయి.

అపార మత్స్య సంపద..

కాళేశ్వరం జలాల రాకతో జిల్లాలో మత్స్య సంపద సైతం గణనీయంగా పెరిగింది. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. నిత్యం నీటిని విడుదల చేస్తుండటంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు పెద్దపెద్ద చేపలు చిక్కుతున్నాయి. కిలోల చొప్పున చేపలు దొరికితే గొప్ప అనుకునే చోట ఏకంగా క్వింటాళ్ల కొద్దీ చేపలు వలలకు చిక్కుతున్నాయి. రవ్వ, బొచ్చె, మెరిగె, బంగారు తీగె జాతుల చేపలు దొరుకుతుండగా వీటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌తో మత్స్యకార్మికులకు ఆదాయం సైతం పెరిగింది. దీంతో ఈ ప్రాంత మత్స్యకారుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. గోదావరి జలాలు చేపల రూపంలో మత్స్యకార్మికుల బతుకు చిత్రంలో పెనుమార్పులను తీసుకొచ్చింది.

సకల జీవరాశులకు నిలయంగా పల్లె ప్రకృతి వనాలు..

జిల్లాలో గడచిన ఐదేండ్లలో అటవీశాఖ అడవుల్లో 25 లక్షల వరకు మొక్కలు నాటింది. ఈ క్రమంలోనే చౌటుప్పల్‌ సమీపంలో ఉన్న తంగేడు వనంలో ఎకరం స్థలంలో యాదాద్రి మోడల్‌ పేరుతో అటవీశాఖ చిట్టడివిని సృష్టించింది. మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్‌వుడ్‌, మద్ది, వేప, శ్రీగంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు, గోరింటాకు తదితర మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తుండగా.. కనుమరుగై పోయిన ఎన్నో 

విలో కనిపిస్తున్నాయి. జీవావరణంలో మార్పుకు అద్దంపట్టేలా రింగన్న పురుగులు, సీతాకోక చిలుకలు, పిచ్చుకల గూళ్లు, సరీ సృపాలు, తేనె తుట్టలు కనిపిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి నిలయంగా ఈ ప్రాంతం నిలుస్తుండగా.. దీని స్ఫూర్తితో ఆరో విడుత హరితహారంలో భాగంగా రాష్ట్రమంతటా చిట్టడవులను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నది. ఎకరం స్థలంలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి వనాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా మారడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనున్నాయి.

సైబీరియన్‌ పక్షుల సందడి..

విదేశీ పక్షులకు సైతం జిల్లా ఆతిథ్యమిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గత రెండేండ్లుగా ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. రాజాపేట మండలంలోని బొందుగుల చెరువు ప్రాంతానికి గత మే నెలలో వచ్చిన సైబీరియన్‌కు చెందిన కొంగలు సందడి చేశాయి. ఖండాలు దాటి.. సుమారు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నాయి. తాజాగా బీబీనగర్‌, మోత్కూరు చెరువుల వద్ద ఈ తరహా కొంగలు అగుపిస్తున్నాయి. నీటి అలలపై తేలియాడుతూ ఆహారంగా చేపపిల్లలను వేటాడే దృశ్యాలు స్థానికులను కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. సైబీరియన్‌కు చెందిన ఈ కొంగలు ఈ చెరువులకు రావడం ఇదే తొలిసారి అని స్థానికులు పేర్కొంటున్నారు. తమ కెమెరాల్లో వాటిని బంధించి సందడి చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలుపెట్టడానికి శుభ సూచకంగా భావించే ఆరుద్ర పురుగులు ఈ ఏడాది ఆలేరు, సంస్థాన్‌నారాయణపురం రాచకొండ, బీబీనగర్‌, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు తదితర ప్రాంతాల్లో సాక్షాత్కరించగా.. ఆయా ప్రాంతాల్లో జింకలు, నెమళ్లు, రింగన్నలు, పీతలు వంటి ఎన్నో రకాల జీవరాశులు పంట పొలాల నడుమ దర్శనమిచ్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

గతంలో కన్నా జీవరాశులు పెరిగాయి..


గంతంతో పోల్చుకుంటే జీవరాశుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 111.805 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఇందులో కుందేళ్లు, ఎలుగుబంట్లు, అడవిపందులు, హైనాలు, నక్కలు, కొండచిలువలు, నెమళ్లు, ముళ్లపందులు, అడవికోళ్లు, గద్దలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటికి ఐదు విడుతల్లో మొక్కలు నాటే పక్రియ ద్వారా అటవీశాఖ ఆధ్వర్యంలో 25లక్షల 25వేల మొక్కలను నాటాం. అటవీ శాతం సైతం పెంపొందింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ సంపద పర్యవేక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. అడవుల్లో జీవరాశుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.

                              - డి.వి.రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి  


సీఎం కేసీఆర్‌ కృషి మరువలేం..


ఆకుపచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని మరువలేము. ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి పర్యావరణ పరిరక్షణతోపాటు, బాగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతున్నది. దీంతో చాలా ఏండ్లుగా కనిపించకుండ పోయిన రకరకాల పక్షులు, నెమళ్లు, నీరుబాతులు, సైబీరియన్‌కొంగలు, తాబేళ్లుతోపాటు వన్యప్రాణులు నక్కలు, తోడేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు(ఏదులు), ఉడుములు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామల్లో నిర్మిస్తున్న పల్లెప్రకృతి వనాలతో పక్షులు, వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. 

     - జక్కా రాఘవరెడ్డి, రైతు, కంచనపల్లి, వలిగొండ మండలం

పచ్చదనం పెరుగుతున్నది..


ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో అన్ని గ్రామాల్లో చెరువులు నిండుతున్నాయి. ఫలితంగా పచ్చదనం చికురిస్తుండటంతో కొన్ని రకాల కీటకాలు వచ్చి పంటల వద్ద స్థావరాలను ఏర్పరుచుకుంటాయి. ఈ సమయంలో పక్షులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఆ కీటకాలను తింటాయి. దీని వలన పంటకు లాభం జరుగుతుంది. సీతకోకచిలుకలు, రింగాన లాంటివి కూడా ప్రస్తుతం అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఈ రకమైన పక్షులు, కీటకాలు పచ్చదనం పెరగడంతో జీవవైవిధ్యానికి దోహదపడతాయి.

             -కె. రాజేశ్‌కుమార్‌, ఏవో, యాదగిరిగుట్ట


30 ఏండ్ల వాతావరణం గుర్తుకొస్తుంది..

ప్రకృతి కరుణించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 30 ఏండ్ల కిందటి వాతావరణం గుర్తుకొస్తుంది. గతంలో బీడు భూములుగా మారిన భూములు నేడు పంటలు పండుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా పూర్వ వైభవం నెలకొన్నది. గత కొద్ది రోజులుగా వాన దేవుడు కరుణించడంతో అనేక చోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. పిచ్చుకలు, కోకిలలు, కాకులు, రామచిలుకల కిలకిలలు వినబడుతున్నాయి. మిషన్‌భగీరథ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లోరిన్‌ రహిత నీటిని తాగుతుండటంతో ఎలాంటి ఒల్లు నొప్పులు లేవు. 

                                                - గవ్వల సత్తయ్య,ఆలేరు 

విభిన్న రకాల చేపలను చూడలేదు.. 


కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి కాల్వ ద్వారా మండలంలోని వివిధ గ్రామాల చెరువులను నింపింది. చెరువుల్లోకి చేరిన గోదావరి జలాల్లో గతంలో ఎన్నడూ చూడని విభిన్న రకాల చేపపిల్లలు దర్శనమిస్తున్నాయి. తండ్రులు, తాతల కాలంలో వివిధ రకాల చేపలు ఉండేవని చెబితే వినడం తప్పా మేము ఎన్నడూ చూడలేదు. టీఆర్‌ఎస్‌ పాలనలో మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టి గోదావరి జలాలు నింపడంతో ఈసారి మత్స్య సంపద భారీగా పెరిగింది. దీంతో మత్స్యకారులకు జీవనోపాధులు పెరగనున్నాయి.

                    -బొయిని నాగరాజు, తుర్కపల్లి మండలం
VIDEOS

logo