అదరాలి.. మెరవాలి

అడుగడుగునా అత్యద్భుతం.. అణువణువునా ఆధ్యాత్మికం...
ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణ పనులు
ఆరు గంటల పాటు పరిశీలించిన సీఎం కేసీఆర్
ఆలయ స్థపతులు, ఆర్కిటెక్ట్ అధికారులకు సూచనలు
హరిత హోటల్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. తుది దశకు చేరిన ప్రధాన ఆలయంతో పాటు, శివాలయం, గిరి ప్రదక్షిణ రోడ్డు, రింగ్ రోడ్డు, గండి చెరువు సమీపంలో నిర్మిస్తున్న పుష్కరిణి, కల్యాణ కట్ట, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణాలు, కొండకు ఏర్పాటు చేస్తున్న గ్రీనరీ పనులను అధికారులు సీఎంకు వివరించారు. ఆదివారం ఉదయం బాలాలయానికి చేరిన సీఎం కేసీఆర్‌కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పట్టువస్ర్తాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ చతుర్వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అత్యద్భుతంగా పునర్నిర్మితమవుతున్న ప్రధాన ఆలయ తుది పనులు పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో గీతారెడ్డి, స్థపతులు పనులు జరుగుతున్న తీరును వివరించారు. విగ్రహాలు, శిల్పాలు పరిశీలించిన సీఎం వారికి పలు సూచనలు చేశారు. పూర్తికావస్తున్న ఫ్లోరింగ్ పనులు పరిశీలిస్తూ తూర్పు రాజగోపుర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. బాహ్య, అంతరప్రాకారాలు, వాటికి అమర్చిన విగ్రహాలు, సాలహారాలు, వాటిలో అమర్చనున్న విగ్రహాల వివరాలు స్థపతులను అడిగి తెలుసుకున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వాటిపై ఏర్పాటు చేసిన బీడు పలకలు, ఇటీవలే మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన ఐరావతం, సింహం విగ్రహాల అమరిక పనుల వివరాలు తెలుసుకున్నారు. ఆలయ, మంటపాల గోడలకు ఎంబాజ్ విధానంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు, పంచనారసింహుల రూపాలు, దేశంలో పలు నారసింహ ఆలయ నమూనా చిత్రాలను పరిశీలించారు. ప్రధాన ఆలయంలోని ఆంజనేయ, రామనుజులు, ఆళ్లారు, గరుడ్మంతుడి ఉప ఆలయాలను పరిశీలించారు. గర్భాలయ ద్వారం తలుపులు, గోడపై ఏర్పాటు చేసిన నర్సింహ విగ్రహం, దానికి ఏర్పాటు చేసిన నారవేప కనుమ తొరణం, భక్త ప్రహ్లాదుడి చరిత్రను వివరించేలా రాగి పలకలపై ఏర్పాటు చేసిన చిత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి దక్షిణం వైపున బ్రహ్మోత్సవ, పడమర వైపున వేంచపు మందిరాలను పరిశీలించారు. అలాగే పడమర వైపున చేపడుతున్న ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. గంటకు పైగా ప్రధాన ఆలయంలో కలియ తిరిగి పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయానికి నలు దిక్కులా ఏర్పాటు చేస్తున్న ఐరావతం, సింహం విగ్రహాల అమరికకు సంబంధించి సీఎం కేసీఆర్ స్థపతులు, ఆర్కిటెక్ట్ ఆనందసాయికి పలు సూచనలు చేశారు.
శివాలయం పనుల పరిశీలన..
ప్రధాన ఆలయం నుంచి భక్తులు వెలుపలికి వచ్చే మార్గంలో నిర్మిస్తున్న శివాలయం పనులను కేసీఆర్ పరిశీలించారు. శివాలయంలో 25 నిమిషాల పాటు నలుమూలలా కలియ తిరిగి నిర్మాణాలను చూశారు. అలాగే శివాలయంలో గణపతి, పర్వతమర్థిని, ఆంజనేయ, నవగ్రహ మంటపాలు, యాగశాల నిర్మాణాలను పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇటీవల ఐదున్నర అడుగుల ఎత్తయిన నంది విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. నంది విగ్రహంతో పాటు శివాలయంలో నిర్మిస్తున్న కల్యాణ మంటపం పనులను పరిశీలించారు. మధ్యాహ్నం 2:23 నిమిషాలకు హోటల్ హరితకు వెళ్లి భోజనం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన వెజిటేబుల్ బిర్యాని, పప్పుకూర, టమాటా చారు ప్రత్యేకంగా తయారు చేసినట్లు సిబ్బంది తెలిపారు. సీఎం వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతులు ఉన్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ప్రధానాలయం లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీస్ ఏజెన్సీ నిర్వహించిన విద్యుత్ దీపాల ట్రయల్స్ దృశ్యాలు, వీడియోలు, బం గారు ఊయల, అద్దాల మేడ, ఇత్తడి క్యూలైన్లు, గర్భాలయ ద్వారాలకు అమర్చనున్న బంగారు రేకులు, విమాన గోపురానికి బంగారు తాపడం చేసే నమూనాల గ్రాఫిక్ దృశ్యాలు, సాలహారాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల నమూనాలతో రూపొందించిన గ్రాఫిక్ చిత్రాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇతర అధికారులు వివరించారు. స్వర్ణ, ధవళ కాంతులతో వెలిగిపోతున్న ఆలయ దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండకు నలు దిక్కులా ఉన్న రహదారులతో పాటు ఘాట్ రోడ్డు, కొండపైన పోలీసులు మొహరించారు. అదనపు సీపీ సుధీర్‌బాబు. డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సైలు, భారీ సంఖ్యలో కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొన్నారు. స్పెషల్ పార్టీ, ఎస్పీఎఫ్, హోంగార్డులు కొండ చుట్టూ పహారా కాశారు.
దర్శనాల నిలిపివేత
సీఎం రావడానికి గంట ముందు 11 గంటల నుంచి కొండపైకి భక్తులను అనుమతించలేదు. సీఎం కొండపైన పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో దర్శనాలు నిలిపివేశారు. అలాగే ఉద యం 9 గంటల నుంచే కొండపైకి ఎలాంటి వాహనాలు అనుమతించలేదు. వివిధ ప్రాంతాల నంచి వచ్చిన భక్తులు కొండకింద వాహనాలు పార్కు చేసుకుని ఘాట్ రోడ్డు వెంట కాలి నడకన పైకి వెళ్లారు. స్వామి దర్శనం ముగియగానే భక్తులను కిందికి పంపించారు.
వానరాలకు అరటిపండ్లు
కొండపై నుంచి కిందికి దిగుతున్న క్రమంలో ఘాట్ రోడ్డు వెంట ఉన్న వానరాలకు సీఎం కేసీఆర్ స్వయంగా ఆహారంగా అరటి పండ్లు అందించారు. కోతులకు అరటి పండ్లు ఆహారంగా అందించి మూగ జీవాలపై ఆయనకు ఉన్న ప్రేమ ను చాటుకున్నారు.
యాదాద్రిలో భక్తుల కోలాహలం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు సమర్పించి సుదర్శన హోమం జరిపారు. సుదర్శన అళ్వారును కొలుస్తూ హోమం చేశారు. దేవేరులను అందంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ కల్యాణ తంతు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అందంగా ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలోనే భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ వేడుక జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా శ్రీ వారి కైంకర్యాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపై ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయం ప్రధాన అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.
శాస్ర్తోక్తంగా యాదాద్రి ఆలయ నిర్మాణం జరగాలి
గండిచెరువుకు గోదావరి జలాలు
సమీక్షలో సీఎం కేసీఆర్
యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మికం, ఆహ్లాదం ఉట్టిపడేలా రూపుదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆలయ పనులు సంప్రదాయబద్ధంగా, శాస్ర్తోక్తంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ సుమారు ఆరు గంటల పాటు ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించి అనంతరం అధికారులతో హరిత హోటల్లో సమీక్ష నిర్వహించారు. ఆలయ రాజగోపురం, ప్రధానద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుంచి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని సూచించారు. అధికారులు, స్థపతులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్న రింగ్‌రోడ్డును ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరుపక్కలా పచ్చని చెట్లు, వీధి దీపాలు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో సుందరంగా నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. కొండకు పడమర వైపున ఉన్న గండి చెరువును ప్రతి రెండు నెలలకు ఒక సారి కాళేశ్వరం జలాలతో నింపాలని సూచించారు. తెప్పోత్సవం జరిపే పుష్కరిణిని నిత్యం శుద్ధ జలాలతో నింపాలన్నారు. ప్రత్యేక ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండిచెరువు పరిసరాలను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. టెంపుల్‌సిటీలో సుమారు 200 ఎకరాల్లో 365 కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కల్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్అండ్బీ ఈఎన్సీని ఆదేశించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణస్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకే సారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లు బయటకు పంపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని , 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్‌ను సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, టూరిజం బోర్డ్ చైర్మన్ భూపతి రెడ్డి, కలెక్టర్ అనితారామంద్రన్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి వేలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!