గురువారం 29 అక్టోబర్ 2020
Yadadri - Sep 22, 2020 , 01:14:31

ప్రాణభయంతో సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

ప్రాణభయంతో సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

ఆత్మకూరు(ఎం): భూ వివాదం విషయంలో చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానిక సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది. మండల కేంద్రం పరిధిలోని బంజరుబావి వద్ద ఇరువర్గాలకు సంవత్సర కాలం నుంచి పొలం గెట్టు విషయంలో గొడవ జరుగుతుంది. దీనిలో భాగంగా ఇరువర్గాల రైతులు ఈనెల 17న ఒకరికొకరు దాడి చేసుకోవడంతో గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశారు. అయినప్పటికి ఓ వర్గానికి చెందిన రైతులు మరో వర్గానికి చెందిన నాగం యశ్వంత్‌రెడ్డిని చంపుతామని బెదిరించడంతో భయపడిన అతడు సెల్‌టవర్‌ ఎక్కి రక్షణ కల్పించాలని కోరాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జ్యోతి, ఎస్‌ఐ ఎండీ ఇద్రిస్‌అలీతో పాటు ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువకుడు కిందికి దిగాడు.


logo